ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మరో జ్యోతిర్లింగం

రెండో కార్తీక  సోమవారం స్పెషల్

 

ఈ జ్యోతిర్లింగం కుడా గుజరాత్  లో,  ద్వారకా  పట్టణానికి దగ్గరలో వుంది.

సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారే పరమేశ్వరమ్ ||
కేదారం హిమవత్ప్రుష్ఠే డాకిన్యాం భీమశంకామ్ |
వారాణస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ||
వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే |
సేతుబంధే చ రామేశం ఘశ్మేశంచ శివాలయే ||
ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తస్సర్వ సిద్ధిఫలం లభేత్ ||

నాగేశం  దారుకావనే  - నాగేశ్వరుడు.
  

            అమర్తసంజ్నే నగరేచ రంయే, విభూశితంగం వివిధైశ్చ భోగైహి
            సాధ్భుక్తి ముక్తిప్రదమీశ మేకం, శ్రీ నాగానాతం శరణం ప్రపద్యే||

గుజరాత్  రాష్ట్రంలో ద్వారకా నగరానికి పదిహేడు కి.మీ. దూరంలో ఉన్న ఈ మహా జ్యోతిర్లింగం పదవది. దారుకుడు అనే రాక్షసుడి బారి నుంచి మహా భక్తుడైన సుప్రియుడిని రక్షించాడు ఆ పరమ శివుడు.

శివపురాణంలో  ఈ నాగేశ్వర్ గురించిన కధ మరింత వివరంగా వుంది.   ఈ దారుకా వనంలో  దారుకుడు, దారుకి  అనే రాక్షస దంపతులు వుండేవారు. దారుకుడు పరమ శివుడి భక్తుడు.  వారు ఎక్కడ వుంటే వారున్న వనం కూడా వారితో పాటే వుంటుందని వారం కుడా వుంది. అయితే దారుకుడు  గర్వంతో  ఆ అడవిలో వుండే  ఋషి వాటికలను, యజ్ఞాలను  ధ్వంసం చేస్తూ...  ఋషులను, అడవిలో  వచ్చే వారినందరినీ హింసిస్తూ వుండేవాడు. వారంతా అడవిలో వున్న ప్రసిద్దుడైన  మహర్షి ఔరకుడు (Ourava)కి  మొర పెట్టుకున్నారు. ఈ మహర్షి చవనుడు, మనువు కుమార్తె అయిన అరుషిల పుత్రుడు.  ఆయన దారుకుని దంపతులకి శాపం ఇచ్చాడుట.

 

ఈయన దారుకుడు భూమి మీద ఎవరినైనా హింసిస్తే, వారు మరణిస్తారని శాపం ఇచ్చాడు, అందుకే వారు సముద్రంలో నివసిస్తూ (వారితో పాటు అడవి కూదా ), సముద్రంలో ప్రయాణించే వారిని హింసించే వారుట.  అలా ఒకసారి వ్యాపారి అయిన సుప్రియుడు అనే వైశ్యుడు వారి చేత చిక్కాడుట.  దారుకుడు పెట్టె బాధలు భరించలేక సుప్రియుడు  శివుని శరణు వేడగా,  శివుడు సుప్రియునికి తన  పాసుపతాస్త్రాన్ని ఇచ్చాడని, ఆ అస్త్రంతో సుప్రియుడు ఆ దారుకుడిని, మిగతా రాక్షసులని  సంహరించాడు. అలా సుప్రియుడు పూజించి, అర్చించిన శివలింగమే  ఈ నాగేశ్వర్.

 



    ఈ జ్యోతిర్లింగాన్ని  శ్రీకృష్ణుడు పూజించాడని అంటారు. 

     నాగేశ్వర్  ద్వారకా నగరానికి, బేట్ ద్వారకాకి మధ్య మైదానంలో  వుంది.  

    ఇక్కడ వున్న శివలింగం అన్ని చోట్లా వున్నట్లు  నున్నగా వుండదు. ద్వారకాశిలతో చేయబడింది. చిన్న చిన్న చక్రాలు వుంటాయి లింగం మీద.  అంతే కాదు మూడు ముఖాల రుద్రాక్షాలు వున్నట్లు వుంటుంది ఈ లింగం.

ఇక్కడ ఆలయ ఆవరణలో చిన్న నీటి గంగాళం వంటి పాత్రలో ఒక రాయి తేలుతూ వుంటుంది. ఈ రాయి హనుమంతుడు లంకకు వేసిన వారధి లోని రాయిగా చెబుతారు. 


       ఈ ఆలయంలో భక్తులు జంట నాగులని భక్తితో సమర్పిస్తారు. నాగేశ్వర్  అంటేనే నాగుపాము అని. అవి ఆభరణాలుగా ధరించిన శివుడు నాగేశ్వరుడుగా కొలుస్తారు.  నాగేశ్వర్ ఆలయంలోని అమ్మవారిని నాగేశ్వరిగా పిలుస్తారు.

 



         ఈ ఆలయం లో నందీశ్వరుడు తూర్పు దిక్కుని చూస్తూ వుంటే, శివుడు దక్షిణ దిక్కుని చూస్తూ వుంటాడు.  నలమహారాజు  ఇక్కడి శివలింగాన్ని పూజించటం వల్ల  చక్రవర్తి అయ్యాడని కూడా అంటారు.

విశాలమైన ఆవరణలో ఎత్తైన  శివుడి విగ్రహం  వుంది. ఆలయ ఆవరణ లో చెట్టుకింద శనేశ్వరుడు వున్నాడు. అక్కడ భక్తులు తిలాభిషేకం చేస్తారు.

          మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చివేయాలని అనుకున్నాడుట.  ఈ ఆలయాన్ని ద్వంశం చేస్తుండగా వేలాది తేనెటీగల గుంపు వారిపై దాడి చేసిందిట. అప్పటికే సగం కూల్చిన ఆలయాన్ని వదిలివేసి వెనక్కి తిరిగి వెళ్లారు.  ఆ తరువాత ఆలయాన్ని భక్తులు తిరిగి నిర్మించారు.

         ప్రస్తుతమున్న ఈ ఆలయాన్ని T-సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత శ్రీ గుల్షన్ కుమార్ మరణానంతరం వారి కుటుంబ సభ్యులు రెండు కోట్ల రూపాయలతో  నిర్మించారు.  ఇక్కడ ఆకర్షనీయమైనది 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు తో వున్న శివుని విగ్రహం. మూడు కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది.

ఈ ఆలయం లోపలే విశాలమైన హాలు గుండా ప్రవేశించి స్వామి దర్శనానికి వెడుతుంటేనే బల్లలపై ఆకర్షణీయమైన వస్తువులు, లింగాలు, వస్తువులు, పూజా సామాగ్రి, నాగుపాముల ప్రతిమలు, కొబ్బరికాయలు వంటి వస్తువులు అమ్ముతుంటారు.  ఒకరకమైన చిన్నపాటి షాపింగ్ సెంటర్ ఇది.

అరేబియన్ సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రంలో వున్న నాగేశ్వర్ పుణ్య క్షేత్రం భక్తులతో నిత్యమూ అలరారుతూ వుంటుంది.  భక్తులు స్వయం గా అభిషేకాలు చేసుకోవచ్చు.

ద్వారకకి వచ్చే భక్తులు ఆ ద్వారకాదీసునితో పాటు  ఇక్కడికి వచ్చిఈ  పరమేశ్వరుని దర్శించుకుంటారు.  నాగేశ్వర జ్యోతిర్లింగం మన భారత దేశంలో రెండు చోట్ల వుందని ఆయా భక్తుల నమ్మకం.

1. హిమాలయాలలోని అల్మోరాకు దగ్గరలో వున్న జాగేశ్వర క్షేత్రం 

2. గుజరాత్ లోని ద్వారక దగ్గరలోని నాగేశ్వర క్షేత్రం  

గుజరాత్ లోని నాగేశ్వర్ అసలైన జ్యోతిర్లింగం అని కుడా అంటారు. 

ఉత్తరాఖండ్ లోని జాగేస్వర్ ఆలయం ఆల్మోరా ప్రాంతంలో వుంది. అల్మోరా  ప్రాంత మంతా దారు వృక్షాలతో నిండి వుంది.  ఇక్కడ కూడా ప్రసిద్ధమైన పురాతనమైన శివాలయం వుంది.  అసలైన జ్యోతిర్లింగం విషయం లో భిన్నాభిప్రాయాలున్నాయి.

మేము చూసిన నాగేశ్వర్, ద్వారక, గుజరాత్ లో వున్న ఆలయ విశేషాలు ఇవి.....

 ఏది ఏమైనా విశిష్టమైన ఈ శివాలయం భక్తులని విశేషం గా ఆకర్షి స్తోంది.

ద్వారకనుండి  గోపితలాబ్   అనే గ్రామం  వెళ్ళే  బస్సులో  వెళ్లి ఈ  జ్యోతిర్లింగమును  దర్శించవచ్చు. ప్రైవేటు వాహనాల్లో అయితే చుట్టుపక్కల మరి కొన్ని ప్రదేశాలు చూడవచ్చు.

 

....Mani Kopalle


More Punya Kshetralu