ఊరి చివర దేవత- అయనార్‌

 

 

భారతీయ సంప్రదాయంలో గ్రామదేవతలకి పెద్దపీట. కులమతాలకు అతీతంగా, ఆచారాలకు భిన్నంగా ప్రజలంతా గ్రామదేవతను కొలుచుకుకోవడం తరచూ కనిపించే దృశ్యమే! ఈ కోవలో తమిళనాట కనిపించే ‘అయనార్‌’ అనే దేవత కథని తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది.

 

హరిహరసుతుడు

శివకేశవుల పుత్రుడు ఎవరన్న ప్రశ్న రాగానే ‘అయ్యప్ప’ అన్న జవాబు మెదులుతుంది. కానీ ఈ అయనార్‌ను కూడా ప్రజలు హరిహరసుతునిగానే భావించడం ఆశ్చర్యం. బహుశా ఆ అయ్యప్పకు ప్రతిరూపంగానే ఈ అయనార్‌ను కూడా కొలవడం ప్రారంభించి ఉండవచ్చు. మరికొన్ని సందర్భాలలో ఈయనను శివపార్వతుల తనయునిగా పేర్కొంటారు. తమిళనాట అతి ప్రాచీన గ్రంథమైన శిలప్పదిగారంలో సైతం ఈ అయనార్‌ ప్రస్తావన కనిపిస్తుంది. వేల సంవత్సరాల నాటి రాళ్ల మీద అయనార్‌ను కీర్తించే మాటలను గుర్తించారు. దీంతో అయనార్‌ ఆరాధన ఈనాటిది కాదని రుజువు అవుతోంది.

 

 

ఊరూరా

తమిళనాడులో పర్యటించేవారికి, లేదా తమిళ సినిమాలు చూసినా అందులో ఊరి చివర ఉండే దేవాలయాలు కనిపిస్తాయి. ఆ దేవాలయం బయట టెర్రకోటతో చేసిన గుర్రపు ప్రతిమలనూ గమనించవచ్చు. ఇవి ఎక్కువగా అయనార్‌ గుళ్లే అయి ఉంటాయి. అయనార్‌ తమ గ్రామ ప్రజలనే కాదు... ఆ గ్రామంలోని పంటలను, పశువులను రక్షిస్తాడని నమ్మకం. పైగా తమ గ్రామం వంక ఎలాంటి దుష్టశక్తులూ, శత్రువులూ కన్నెత్తి చూడకుండా కాపాడతాడని విశ్వాసం. అలా అయనార్‌ తమ కోసం యుద్ధం చేసేందుకు వీలుగా, ఆయన ఆలయాలకు వెలుపల గుర్రపు ప్రతిమలను నిలుపుతారన్నమాట! ఇక అయనార్‌ చేతిలో ఖడ్గమో, త్రిశూలమో, శూలమో... ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉంటుంది.

 

పూజలు

అయనార్‌ స్వామికి తమిళ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాదికాలను నిర్వహిస్తూ ఉంటారు. జాతరలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక గ్రామదేవత అనగానే, బలులను సమర్పించే ఆచారం సహజమే! అయితే ఈ అయనార్‌ బలిని స్వీకరించకపోవడం ఒక విశేషం. అయనార్‌ గుడికి దగ్గరలోనే ఉండే కరుప్పుస్వామి వంటి మరికొందరు గ్రామదేవతలకే బలిని ఇస్తారు. అయనార్‌ ఆరాధన కేవలం తమిళనాడుకే పరిమితం కాదు. తమిళనాట నుంచి వలస వెళ్లిన వారు తమతో పాటుగా ఈ నమ్మకాలను మోసుకువెళ్తారు.

 

ఇక కేరళలో కూడా చాలా ప్రాంతాలలో ఈ అయనార్‌ ఆరాధన ఉండేదనేందుకు రుజువులు ఉన్నాయి. అక్కడ అయనార్‌ను ‘షష్ట’ అనే పేరుతో పూజించేవారట. అయితే అయ్యప్ప ఆరాధన విస్తృతం కావడంతో, కేరళలో అయనార్‌ సంప్రదాయం తగ్గుముఖం పట్టింది. కానీ తమిళనాట మాత్రం ఇప్పటికీ అతిముఖ్యమైన గ్రామదేవతగా అయనార్‌ అందరి పూజలందుకుంటున్నాడు.    

 

- నిర్జర.


More Punya Kshetralu