అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలు
అతి పురాతనమైన ఈ ఆలయం వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని అయినవోలు గ్రామంలో వుంది. విశాల ప్రాంగణంలో, కాకతీయ శిల్ప కళా తోరణాలతో, విశాలమైన నృత్త మండపంతో అలరారే ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ పరిపాలనలో వారి మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తున్నది. అయ్యన్న ఈ ఆలయాన్ని నిర్మించటంవల్ల ఈ ప్రాంతం అయ్యన్నవోలుగా పిలువబడి, కాలక్రమేణా అయినవోలు అయివుండవచ్చు. 1077-1129 మధ్య రాజ్యపాలనచేసిన పశ్చిమ చాళుక్యరాజైన ఆరవ విక్రమాదిత్యుడికాలంనాటి శాసనంలో కూడా ఈ పట్టణమును అయ్యన్నవోలుగా పిలిచినట్లు చెప్పబడింది. క్రీ.శ. 1369 ప్రాంతంలో అనపోతనాయుడు ఎంతో భక్తి శ్ర్రధ్ధలతో ఈ దేవుని పూజించి ఎన్నో యుధ్ధాలలో విజయం సాధించాడని శాసనంద్వారా తెలుస్తోంది.
అయినవోలు మల్లన్నగా పిలువబడే ఈ దేవుడు మైలారు దేవుడంటారు. ఈ మైలారు దేవుళ్ళు కాకతీయులపాలనలో వున్నారు. ఈ దేవుడు యుధ్ధ వీరుడు. ఈయనని ఖండేల్ రాయుడని, ఖండేల్ రావని పిలిచేవారు. ఒక చేతిలో ఖడ్గం, వేరొక చేతిలో త్రిశూలం, డమరుకం, తలపై కిరీటం, మూతిపై మీసంతో చొక్కా ధరించి వుంటాడు ఈయన. ఇలాంటి విగ్రహమే వరంగల్ జిల్లాలోని కొమరువోలులో కూడా వున్నది.
ఈ దేవుణ్ణి యాదవులు, కుర్మలు, బలిజలు తమ ఇలవేల్పుగా కొలుస్తారు. యాదవుల ఆడబడుచు గొల్లకేతమ్మ, బలిజల ఆడబడుచు మేడలమ్మ ఈ స్వామి దేవేరులు. ఈయనని శివుని అవతారంగా కొలుస్తారు.
ఆలయంలో దేవేరులతో వున్న పెద్ద మల్లికార్జున విగ్రహం ముందు లింగాకారంలో మల్లికార్జునస్వామి పూజలందుకుంటున్నాడు. ఇక్కడ లింగానికి అర్ధ పానవట్టం వుంటుంది. అందువలన విశేషమైనదిగా పరిగణించబడుతుంది. ఈ లింగానికి ప్రతి రోజూ శైవాగమన పధ్ధతి ప్రకారం అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి.
ఇక్కడ భక్తులు తీర్చుకునే మొక్కులు, బోనాలు, పట్నం వెయ్యటంవగైరాలు ఒగ్గు పూజారులు జరిపిస్తారు. భక్తుల సకల కోరికలూ తీర్చే ఈ స్వామికి భక్తులు సంతానంకోసం కొబ్బరికాయ ముడుపు కడతారు. గండాలు తీరితే గండదీపం పెడతామనీ, కోరికలు తీరితే కోడెను కడతామనీ మొక్కుకుని, తమ కోరికలు తీరగానే మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ స్వామివారికి బండారి అంటే పసుపు వాడతారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి చేతిలోవున్న పసుపును ఎంతో పవిత్రమైనదిగా తలుస్తారు.
కాకతీయులకాలంనుంచీ మార్నేని వంశస్తులు, కుర్మలు, శైవారాధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆలయాన్ని అభివృధ్ధి చెయ్యాలనే ఆకాంక్షతో 1968లో ప్రభుత్వాధీనం చేశారు. నానాటికీ అభివృధ్ధి చెందుతున్న ఈ ఆలయానికి వచ్చే భక్తులకోసం సకల సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నారు.
దర్శన సమయాలు: ఉదయం 6 గంటలనుంచీ 12 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 గం. ల నుంచీ 7 గం. ల దాకా.
ఆఫీస ఫోన్ నెంబరు 08711 - 235230
- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)