గణపతి బప్పా…"మోరియా" అసలు కథ

 

వినాయక చవితి వేడుకలు అంబరాన్ని అంటుంతుంటాయి. వీదులు అన్ని  గణపతి నామస్మరణలో మునిపోయి ఉంటాయి. ఎక్కడ చూసినా వినిపించేవి "జై భోలో గణేష్ మహరాజ్ కి జై" అనే ఆనంద హేళలు, "గణపతి బప్పా మోరియా" అనే భక్తి పారవశ్య నినాదాలు.  మన పురాణాల ప్రకారం ప్రతి మాట వెనుక, పిలుపు వెనుక కూడా ఒక కథ ఇమిడిపోయి ఉంటుందనేది ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. అలాంటిదే "గణపతి బప్పా మోరియా" అనే నినాదం వెనుక ఒక గమ్మత్తైన కథ దాగుంది. ఇందులో మోరియా అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? అసలు దానికి అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏంటి అంటే…..

మోరియా అసలు కథ:

15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడట. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. మెలకువ వచ్చాక మోరియా గోసాని గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించాడట. తరువాత ఆయన గణపతి చెప్పినట్టు దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్లి, ఆ నదిలో దిగి గాలించాడు. నిజంగానే మోరియా గోసాని కి గణపతి విగ్రహం లభించడంతో గణపతి తనకు స్వయన్గ్ కనిపించి అనుగ్రహించాడని మోరియా మహానందభరితుడయ్యాడు. మోరియ గోసాని కి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసిన కొందరు ఆశ్చర్యపోయి, ఆ విషయాన్ని తెలిసిన అందరికి చెప్పారు. అలా ఆ నోటా, ఈ నోటా ఈ విషయం అందరికి తెలిసిపోయింది.

అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేసారు. మోరియా గోసాని గణపయ్య విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకెళ్లాడు. అలా అతను తీసుకెళ్తుంటే అక్కడున్న రాజలు అందరూ, "మోరియా గోసాని ఎంత గొప్ప భక్తుడొ కదా!! సాక్షాత్తు గణపతే తన గూర్చి చెప్పి దర్శనం ఇచ్చాడు" అనుకుంటూ గణపతి బప్పా మోరియా" అని గట్టిగా పిలవడం మొదలుపెట్టారు. 

మోరియా కు దొరికిన ఆ గణపతి విగ్రహానికి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ ఉత్సవాలలో భక్తులు అందరూ గణపతితో పాటు మోరియా గోసాని ని కూడా గుర్తు చేసుకుంటూ, "గణపతి బప్పా మోరియా" అనే నినాదాన్ని ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నారు.  భక్త వల్లభుడైన వినాయకుడి సేవలతో మోరియా గోసావి తరిస్తూనే ఉన్నాడు.

ఇదీ మోరియా పదం వెనుక ఉన్న గమ్మత్తైన కథ!!

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Vinayaka Chaviti