ఎవరి శాపం కారణంగా ద్వారక సముద్రంలో మునిగిపోయిందో తెలుసా!


శ్రీకృష్ణుని పేరు వెంటే ద్వారక, ద్వారక పేరు వెంటే శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకను చాలా ప్రేమించాడు. ఆయన  యాదవుడు అయినా ద్వారకను ఒక రాజులా పాలించాడు.  ఈ కారణంగానే ఆయనను ద్వారకాధీశుడు అని అంటారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తూ విష్ణు రూపమే అయినా.. ఆయన ద్వారకలో  నివసించినా.. ద్వారక ఆయనకు చాలా నచ్చిన నగరం అయినా.. ద్వారకను మాత్రం ఆయన కాపాడలేకపోయాడు.  ద్వారక నీటిలో మునిగిపోవడానికి శాపమే కారణం.  ద్వారక ఎవరి శాపం వల్ల నీటిలో మునిగిపోయింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తెలుసుకుంటే..

పురాణాల ప్రకారం జరాసంధులు ప్రజల పై చేసిన దురాగతాలను ఆపడానికి శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టి సముద్ర తీరంలో ఒక దివ్య నగరాన్ని స్థాపించాడు. ఈ నగరాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టంతో నిర్మించాడు.  దీనికి ద్వారక అని పేరు కూడా పెట్టాడు.

మహాభారత యుద్దం ముగిసిన 36 ఏళ్ల  తరువాత ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. ఇలా జరగడానికి కారణం శ్రీకృష్ణుడికి ఉన్న శాపమే.. శ్రీకృష్ణుడు స్థాపించిన రాజ్యం తన కళ్ల ముందే నాశనం అవుతుందని, శ్రీకృష్ణుని వంశస్తులు అందరూ ఒకరిని ఒకరు చంపుకోవడం వల్ల యాదవ వంశం అంతం అవుతుందని శ్రీకృష్ణుడికి శాపం ఉంటుంది.

శ్రీకృష్ణుడికి శాపం పెట్టింది కౌరవుల తల్లి గాంధారి.  మహాభారత యుద్దంలో కౌరవులు అందరూ నాశనం అవుతారు.  తరువాత హస్తినాపురంలో యుధిష్టిరుడికి పట్టాభిషేకం జరుగుతుంది.  ఈ పట్టాభిషేకానికి శ్రీకృష్ణుడు కూడా హాజరవుతాడు.  ఈ పట్టాభిషేకం సందర్భంగా కౌరవుల తల్లి అయిన గాంధారి తన కౌడుకులు అందరూ మరణించిన దుఃఖంలో మహా భారత యుద్దానికి కృష్ణుడే కారణం అని, తన నూరు మంది కుమారులు మరణించడానికి కూడా కృష్ణుడే కారణం అని  కృష్ణుడి మీద నిందలు వేస్తుంది.

కుమారులు మరణించారనే దుఃఖంలో కోపోద్రిక్తురాలై.. నేను పతివ్రతను అయితే.. నా వంశం ఎలాగైతే నాశనం అయిందో అలాగే నీ రాజ్యం, నీ వంశం కూడా నాశనమవుతుంది.  నీ కళ్ల ముందే యాదవ వంశస్తులు అందరూ ఒకరిని ఒకరు చంపుకుని యాదవ వంశం అంతరించి పోయేలా చేస్తారు.  అని శాపం పెడుతుంది. ఈ కారణంగానే ద్వారక సముద్రంలో మునిగిపోయిందని,  యాదవ వంశస్తులు అందరూ శ్రీకృష్ణుని కళ్లముందే ఒకరిని ఒకరు చంపుకోవడం ద్వారా యాదవ వంశం నాశనం అయిందని పురాణ కథనాలు చెబుతున్నాయి.  దీని వల్లే గాంధారి శాపం అనే మాట కూడా వాడుకలోకి వచ్చింది.  గాంధారి పెట్టిన శాపం అంత శక్తివంతంగా పనిచేసిందని దాని అర్థం.


                                         *రూపశ్రీ. 
 


More Enduku-Emiti