దీపావళికి మరో రూపం- తిహార్
ప్రపంచంలోని ప్రతి హిందువూ ఘనంగా చేసుకునే పండుగ దీపావళి. కాకపోతే దీనిని ఒకో చోట ఒకోలా ఆచరిస్తుంటారు. మన దగ్గర టపాసులు కాల్చుకునేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తే, ఉత్తరాదిన కాళీపూజకు ఎక్కువ మొగ్గుచూపుతారు. ఇక అసోం, సిక్కిం, డార్జిలింగ్, నేపాల్ వంటి ప్రాంతాల్లో తిహార్ పేరుతో దీపావళిను జరుపుకొంటారు. ఆ విశేషాలు ఇవిగో...
పండుగ వెనుక ఇదీ కథ
తిహార్ అనే పదం బహుశా త్యోహార్ అన్న హిందీ మాట నుంచి వచ్చి ఉంటుంది. ఈ పండుగ ఐదు రోజుల పాటు సాగుతుంది. పూర్వం యమధర్మరాజు సోదరి యమునాదేవికి తన సోదరుని చూడాలనిపించిందట. అందుకోసం యమునికి ముందు కాకి ద్వారా, తరువాత కుక్క ద్వారా, ఆ తరువాత ఆవు ద్వారా తన సందేశాన్ని పంపింది. చివరికి తానే స్వయంగా వెళ్లి సోదరుని ఇంటికి పిలుచుకువచ్చి అతన్ని తనివితీరా పూజించుకుంది. అదే ఐదురోజుల తిహార్ సంప్రదాయానికి దారి తీసిందంటారు. అందుకే ఈ అయిదు రోజుల్నీ యమపంచక్ అని కూడా పిలుచుకుంటారు. అవి ఇలా సాగుతాయి-
కాగ్ తిహార్ – దీపావళికి ముందు త్రయోదశి రోజున కాగ్ తిహార్ వస్తుంది. ఈ రోజున కాకులను పూజిస్తారు. వాటికి అందేలా ఎక్కడికక్కడ ఆహారాన్ని ఉంచుతారు. కాకులు బంధువుల ఆగమనాన్ని మాత్రమే కాదు.... మృత్యువార్తలను కూడా మోసుకువస్తాయని ప్రజల నమ్మకం. అలా మృత్యవుకి సూచనలైన కాకులని ప్రసన్నం చేసుకోవడం కాగ్ తిహార్ వెనుక అంతరార్థంగా గోచరిస్తుంది.
కుకుర్ తిహార్- ఈ ప్రకృతిలో ఉన్న జీవులన్నింటిలోకీ మనిషికి బాసటగా నిలిచే ఏకైక నేస్తం శునకం. నరకచతుర్దశినాడు ఆ శునకాలని పూజించుకుంటారు. వాటి మెడలో దండలు వేసి, నుదుటన తిలకాన్ని అద్ది, ఇష్టమైన వంటకాల్ని తినిపిస్తారు. కుక్కలు మానవులకి నేస్తాలే కాదు, కాలభైరవునికి ప్రతిరూపాలు. మృత్యువుని పసిగట్టగల దిట్టలు. అందుకే వాటిని మచ్చిక చేసుకునే సూచన ఈ సంప్రదాయంలో కనిపిస్తుంది.
గాయ్ తిహార్- దీపావళి రోజున ఉదయంవేళ గాయ్ (ఆవు)ను పూజిస్తారు. వాటి ముందు దీపాలు వెలిగించి, దండలు వేసి, ప్రసాదాలు తినిపించి శ్రద్ధగా కొలుస్తారు. ఈ సందర్భంగా వాటి నాలుగుకాళ్ల మధ్య నుంచి అవతలి వైపుకి వెళ్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఆవు లక్ష్మీదేవికి ప్రతిరూపం కాబట్టి, లక్ష్మీపూజ రోజున ఆవుని కొలుచుకోవడం సబబుగానే తోస్తుంది. ఇక సాయంత్రం వేళల్లో ఇంటిని శుభ్రంగా అలంకరించి, పేడతో అలికి, దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. మన దగ్గర దసరా సమయంలో ఎలాగైతే పాటలు పాడి ఇల్లిల్లూ తిరిగి చందాలను వసూలు చేస్తారో అక్కడ ఆడపిల్లలు ‘భాయిలో’ అనే పాటలు పాడతారు.
గోరు తిహార్- దీపావళి మర్నాడు వచ్చే ఈ పండుగనాడు కొందరు ఎద్దులను పూజిస్తారు. మరికొందరు ఆవుపేడతో గోవర్ధనగిరి రూపాన్ని చేసి దానికి పూజలు చేస్తారు. మరికొందరు తమని తాము పూజించుకుంటారు. ఇందుకోసం ఇంట్లో ముగ్గులు వేసి, పంచభక్ష్యపరమాన్నాలతో ఓ చిత్రమైన క్రతువుని నిర్వహిస్తారు. ఈ రోజుని నేపాల్ ప్రజలు తమ ఉగాదిగా భావిస్తారు. వారి నూతన సంవత్సరం ఇవాళే మొదలవుతుంది.
భాయిటీకా- యమునాదేవి తన సోదరుని కొలుచుకున్న రోజు ఇది. ఈ రోజున ఏడురకాల రంగులతో సోదరులకు తిలకం దిద్ది, హారతులిచ్చి సుష్టుగా భోజనం పెడతారు. బదులుగా సోదరులు తమ సోదరి జీవితం సుఖసంతోషాలతో సాగిపోవాలని దీవిస్తారు. నేపాల్‌లోని రాణిపొఖారి అనే శైవమందిరంలోకి ఈ ఒక్కరోజే ప్రజలకు అనుమతి లభిస్తుంది. ఏనుగుల కింద పడి మరణించిన తన కుమారుడి జ్ఞాపకార్థం ‘ప్రతాప్ మల్ల’ అనే రాజు 1670లో ఈ ఆలయాన్ని నిర్మించారట.
దీపావళి సందర్భంగా ఇలా మన చుట్టూ ఉన్న జీవులను కొలుచుకునే ఈ వింత సంప్రదాయాన్ని ప్రపంచం అంతా వింతగా చెప్పుకొంటూ ఉంటుంది. కానీ ఏదో ఒక ఆచారం పేరుతో, అంతరార్థం సూచిస్తూనో... సాటి జీవులను కలుపుకుపోయే హైందవ ధర్మంలో ఇలాంటి సంప్రదాయాలు కొత్తకాదు కదా!
- నిర్జర.