దీపావళి రోజు మహాలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు?

చెడు మీద విజయమే దీపావళి పండుగ అంతరార్థమని చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. అమావాస్య చిమ్మ చీకటిని  పారద్రోలే వెలుగుల వేడుక దీపావళి. దీపావళి వెనుక ఎన్నో అర్థవంతమైన విషయాలు ఉన్నాయి. చెప్పుకున్నకొద్ది ఇవి లెక్కకు మించి కనబడతాయి. 

నరకాసురుడు అనే రాక్షసున్ని సత్యభామ వధించిన సందర్భంగా మరుసటిరోజును దీపావళిగా జరువుకుంటారని అందరికీ తెలుసు. ఈ వేడుక ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకున్నా యావత్ భారతదేశం మొత్తం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. శ్రీరాముడు లంకలో రావణాసుడిని వధించి సీతమ్మను వెంటబెట్టుకుని తిరిగి  అయోధ్యకు వచ్చిన సందర్భంగా కూడా దీపావళి నిర్వహిస్తారని కొందరు చెబుతారు. ఇవి రెండూ అందరికీ తెలిసినవి. అయితే దీని వెనుక మరొక కథనం ఉంది.

చాలామంది దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ పండుగకు మహాలక్ష్మిని పూజించడానికి గల కారణం ఏమిటి అంటే…

ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఇంద్రుడు దుర్వాస మహర్షిని ఎంతో గౌరవించి మర్యాదలు చేసాడు. ఆ అథిత్యానికి మెచ్చిన దుర్వాస మహర్షి తన తపఃశక్తి తో ఒక హారాన్ని సృష్టించి దాన్ని ఇంద్రుడికి బహుమతిగా ఇస్తాడు. నేను మూడు లోకాలకు అధిపతిని నాకు ఇలాంటి హారాలు ఒక లెక్కనా అనే అహంకారంతో దుర్వాస మహర్షి ఇచ్చిన ఆ హారాన్ని ఇంద్రుడు తన దగ్గర ఉన్న ఐరావతం మెడలో వేస్తాడు. ఆ ఐరావతం తన తొండంతో హారాన్ని లాగిపడేసి కాలికింద వేసుకుని తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి కోపం చెంది నీకు ఈ మూడు లోకాల ఆధిపత్యం ఉందని అహాంకారం కదా అది పోతుంది అని శాపం పెడతాడు. దాంతో మూడు లోకాల ఆధిపత్యం కోల్పోయిన ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకుని పరిష్కారం అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇంద్రుడు అలాగే చేయగా మహాలక్ష్మి దేవి సంతోషించి ఇంద్రుడికి మూడులోకాల ఆధిపత్యాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. అందుకే దీపావళి రోజు మహాలక్ష్మి పూజ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇంద్రుడు మహాలక్ష్మిని "తల్లి నువ్వు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?" అని ప్రశ్నించినపుడు, "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను"అని  ఆ మహాలక్ష్మి దేవి ఇంద్రుడికి సమాధానం ఇచ్చింది.  ఇందుకే దీపావళి పండుగ రోజు పిల్లలతో దీపాలు వెలించమని పెద్దలు చెబుతారు. అంతేనా పిల్లలకు దీపావళి గురించి అర్థం కావాలని ఎన్నో కథలు కూడా పండుగకు అనుసంధానంగా చెబుతారు. 

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్|

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోஉస్తుతే||

అంటూ దీపావళి పండుగ వేళ సాయంత్ర సమయంలో దీపాలు వెలిగించడం కేవలం పండుగ సంబరమే కాదు ఎన్నో విషయాలు దీని వెనుక దాగున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తేమకు పెరుగుతున్న దోమలు, క్రిమికీటకాలు ఈ దీపాలు, బాణసంచా పొగకు నశిస్తాయి. పండుగ వెనుక పురాణం, భక్తి మాత్రమే కాదు ఆరోగ్య అనుబంధం కూడా ఉంది.

                                   ◆నిశ్శబ్ద.


More Deepavali