ధనత్రయోదశితో సంపద, ఆయుష్షు, ఆరోగ్యం!
ధనత్రయోదశి అంటే ఇప్పుడంతా బంగారం కొనుక్కొనేందుకు మంచి రోజన్న భావనలోనే ఉండిపోతున్నారు. ధనత్రయోదశి నాడు ఏదన్నా కొత్త వస్తువు తీసుకోవడం శుభసూచకమే కానీ ఈ పండుగలో అంతకు మించిన విశేషాలు ఉన్నాయంటున్నారు పెద్దలు. అసలు చాలా ప్రదేశాలలో దీపావళి పండుగ సంబరాలు ధనత్రయోదశి నుంచే మొదలవుతాయి.
లక్ష్మీదేవి పుట్టినరోజు (సంపద)
ధనత్రయోదశినాడే లక్ష్మీదేవి క్షీరసాగరమధనం నుంచి ఉద్భవించిందంటారు. అందుకే లక్ష్మీదేవి ఆవిర్భావానికి సూచనగా ఆమె చిహ్నాలైన బంగారపు వస్తువులను కొందరు పాలతో కడుగుతారు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం సంపద మాత్రమే కాదు కదా! సంతానం, విద్య, అధికారం, కీర్తి... ఇలా ఈ సంసారాన్ని దాటేందుకు అవసరమయ్యే సాధనాలన్నింటినీ ఆమె ప్రసాదిస్తుంది. అంతటి లక్ష్మీదేవి ఈ రోజున తమ ఇంటికి వచ్చి ఆశీస్సులను అందించాలని కోరుకుంటారు. శుభ్రత ఉన్నచోటే ఆమె ప్రవేశిస్తుంది కాబట్టి, ఇంటిని శుభ్రపరచుకొని గుమ్మం దగ్గర రంగురంగుల ముగ్గులు వేస్తారు. అమ్మవారికి తమ ఇంటికి దారిచూపేందుకు, దుష్టశక్తులను దూరంగా ఉంచేందుకు నూనె దీపాలను వెలిగిస్తారు. కొందరైతే అమ్మవారిని లోపలకు ఆహ్వానిస్తూ కుంకుమ, బియ్యపుపిండితో కలిపిన చిన్నచిన్న పాదాలను ముద్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని ఆరాధిస్తూ భజనలు చేయడం, పాటలు పాడటం సరేసరి! లక్ష్మీదేవి సంపదను అందించే తల్లి కాబట్టి ఈవేళ వెండి, బంగారం వంటి ఆభరణాలను కానీ ఇతరత్రా కొత్త వస్తువులను కానీ తీసుకోవడం శుభం అని నమ్ముతారు. అయితే విలువైన వస్తువులే కొనాలని కానీ, ఏ వస్తువన్నా కొని తీరాలని కానీ ధార్మిక గ్రంథాలలో ఎక్కడా కనిపించదు. గోమాత కూడా లక్ష్మీదేవికి ప్రతిరూపమే కనుక చాలా ప్రాంతాలలో ఈ రోజున గోపూజ చేసే సంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారపరమైన లెక్కలను చూసుకునేందుకు కూడా ఇది శుభకరమైన రోజుగా భావిస్తారు.
యమదీపం (ఆయుష్షు)
యమునికి ప్రసన్నం చేసుకునేలా ధనత్రయోదశి రాత్రివేళంతా దీపాలను వెలిగించే ఆచారం కూడా ఉత్తరాదిన విస్తృతంగా కనిపిస్తుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం హిమరాజు తనయుడికి పెళ్లయిన నాలుగో రోజున పాముకాటుతో మృత్యుగండం ఉందని జ్యోతిషులు చెబుతారు. ఈ విషయం తెలిసిన పెళ్లికూతురు ఆ రోజు రాత్రి తన ఆభరణాలన్నింటినీ రాశులుగా పోసి అవి ధగేలుమని మెరిసేలా దీపాలను వెలిగించి, ఆపై కోటలో ఎవ్వరూ నిద్రపోకుండా ఉండేలా కథలు చెబుతూ ఉండిపోయిందట. రాజకుమారుని జాతకం ప్రకారం అతడిని పాము రూపంలో కాటేసేందుకు వచ్చిన యముడికి... ధగధగా మెరిసిపోతున్న ఆభరణాలను చూసి కళ్లు బైర్లు కమ్మాయి. రాత్రంతా వేచి చూసినా కోటలోపలకి వెళ్లే అవకాశం దొరక్కపోవడంతో నిరాశగా వెనుతిరిగాడట. అప్పటి నుంచి ఈ దీపాన్ని వెలిగించే ఆచారం మొదలైందంటారు.
ధన్వంతరి జయంతి (ఆరోగ్యం)
ధనత్రయోదశి నాడు వచ్చే మరో ముఖ్యమైన సందర్భం- ధన్వంతరి జయంతి. అపర వైద్యుడు ధన్వంతరి కూడా క్షీరసాగరమధనంలో, ఈ రోజునే ఉద్భవించాడని నమ్మిక. అసలు ధనత్రయోదశి అన్న పేరు ధన్వంతరి నుంచే వచ్చిందని వాదించేవారూ లేకపోలేదు. భూలోకంలో అనారోగ్యంతో ఉన్నవారికి తగిన ఔషధులను సూచించేందుకు, ఆ విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందాలన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యనుంచైనా తక్షణం తేరుకోవాలన్నా ధన్వంతరిని ప్రార్థిస్తే ఫలితం ఉంటుందట. ఆయుర్వేదానికి వైద్యానికి ధన్వంతరి ఆదిగురువు కాబట్టి, ఈ రోజున వైద్యులంతా ఆయనను తల్చుకోవడం పరిపాటి.
- నిర్జర.