అహంభావనకు అహంకు తేడా??
అహంభావన పడిపోయినప్పటికీ ఏది లయించకుండా ఉంటుందో అదే నేను. ‘అహం’ అనే పదం చేత చెప్పబడుచున్నది. మరి అక్కడా నేను అన్నాం. ఇక్కడా నేను అంటున్నాం. ఏమిటి ఈ రెంటికి తేడా?
(1) అక్కడిది 'అహంభావన' లేదా 'అహంవృత్తి'. ఇక్కడ చెప్పింది 'అహం'. ఈ అహమే తాను.
(2)అహంభావన అనేది అజ్ఞానంలో పుట్టింది. అహం ఎల్లప్పుడూ జ్ఞానంలో ఉండేది.
(3) అహంభావన అనేక ఇదంభావనల పుట్టుకకు ఆధారమవుతుంది. అహం అనేది ఏ భావనలు లేని భావశూన్య సద్భావస్థితి.
(4) అహంభావన జ్ఞానంతో నశించిపోయేది. అహం ఎట్టి నాశనం లేనిది. చావుపుట్టుకలు లేని నిత్య సత్యం.
(5) అహంభావన కర్తృత్వం, భోక్తృత్వం, ప్రమాతృత్వం (నేను తెలుసుకుంటున్నాను) వీటిని తనపై ఆపాదించుకుంటుంది. అహంకు కర్తృత్వం గాని భోక్తృత్వంగాని, ప్రమాతృత్వం గాని ఏమీ ఉండవు. ఈ అహం కేవలం నిర్లిప్తం.
(6) అహంభావన జననమరణ సంసార చక్రంలో ఇరుక్కోవడానికి కారణమౌతుంది. కాని అహంకు జననమరణాలనేవి ఉండవు. అది నిత్యం, శాశ్వతం.
ఈ అహంను రమణమహర్షి 'తాను' అని పలుకుతూ ఉండేవారు.
అందుకే ఆయన "నే నడంగినచోట 'నేనునేన'నుచు తానుగాదోచును తాను పూర్ణంబు" - అని.
అహంభావన అణగినచోట నేను నేను అంటూ తాను స్వయంగా వ్యక్తమవుతుంది. తాను పూర్ణము అని. (చిత్ స్వరూపం. సత్స్వరూపం).
రమణమహర్షి వద్దకు ఒక చిన్న బిడ్డతో సహా ఒక తల్లి వచ్చి, మహర్షికి నమస్కరించింది. ఆ బిడ్డ మహర్షిని చూచి తాతా తాతా అని పిలిచింది. దానికి తల్లి తప్పు అలా అనకూడదు అని బిడ్డను మందలించింది. అప్పుడు మహర్షి ఆమెతో, ఎందుకు ఆ బిడ్డని కోప్పడతావు? అందులో తప్పేముంది. అసలు సత్యాన్నే చెప్పిందే ఆ బిడ్డ. తా తా అంటే తాను తానే అనే. అహంభావన పడిపోతే మిగిలేది తాతా. పూర్వ కాలంలో బుర్రకథలు వినే ఉంటారు. “తందానా తందానా తాన తందనానా" అని పాడతారు తాన తానే తాన్ తానే తానే తాన్ తానే అనే పదాలు కలిసి పోయినవి అంతే.
ఏ సత్యమైతే మోడరన్ ఫిజిక్స్కు మింగుడు పడలేదో అదే సత్యాన్ని పురాతన కాలంలో భారతదేశపు గ్రామీణ వీధులలో పెద్దగా చదువుకోని వారు, అక్షర జ్ఞానం కూడా లేని వారు అయిన కథకులు పాడుకుంటూ వుండేవారు. అంతా నశించిన దశలో ఏముందో తెలియటం లేదు. దేని నుండి ఈ ప్రపపంచం వచ్చిందో, దేనికారణంగా ఈ ప్రపంచం నిలిచిందో, ఎక్కడ ఇదంతా లయమౌతుందో తెలుసుకోలేక “సంధింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్" అని చెప్పి సైన్స్ వదిలివేసిన చోట భారతీయ వేదాంతం చెబుతున్నది.
ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల నుండు లీనమై
ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైనవా
డెవ్వడు వాని నాత్మ భవునీశ్వరునే శరణంబు వేడెదన్.
సర్వము అహం వృత్తిలో లయమై పోగా ఆ అహంవృత్తి నశించిన చోట 'నేను నేను' అంటూ స్వయంగా 'తాను పరిపూర్ణ సద్రూప చైతన్యం ప్రకాశిస్తున్నది అని. ఇదే విషయాన్ని వీధులలో తిరిగే బుర్రకథ చెప్పేవారు పలుకుతున్నారు. ఇది నిజంగా బుర్రకథ కాదు, బుర్ర ఉన్నవాడి కథ, బుర్రలోని కథ, బుర్రలో ఉండాల్సిన కథ.
మనస్సులోని సమస్త సంకల్ప వికల్పాలు ఆగిపోయిన తర్వాత, వీటిని తయారు చేసిన 'అహంభావన' కూడా నశించిపోయిన తర్వాత, శరదృతువులో మేఘాలు తొలగిన తర్వాత ఆకాశం ఎలా నిర్మలంగా కనిపిస్తుందో అలాగే అహంభావన అనే అజ్ఞాన మేఘాలు తొలగిన తర్వాత హృదయాకాశం నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు ఏకంగా, అద్వయంగా, అఖండంగా, కేవలంగా, సత్ రూపంగా, చిత్ రూపంగా, ఆనంద స్వరూపంగా సమస్తము తానే అయి భాసిస్తుంది. అదే సచ్చిదానంద స్వరూప ఆత్మచైతన్యం. అదే బ్రహ్మం. ఇప్పటి వరకు కర్తగా, భోక్తగా, ప్రమాతగాఉన్న అహంభావన అన్ని భావనలను, అస్థిత్వాన్ని పోగొట్టుకొని కేవలం 'అహం'గా 'తాను'గా ఆత్మగా మిగిలిపోతుంది.
◆ వెంకటేష్ పువ్వాడ