ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున చాతుర్మాస్య వ్రతం
చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి 'అర్థచాతుర్మాస్యం' అనే పేరుతో చేస్తున్నారు. ఈ వ్రతాచరణకు స్త్రీపురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మున్నగువారెవరైనా చేయవచ్చును.
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతవర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః
వ్రత నియమాలు
ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.
ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.
ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.
భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.
యోగసాధన చేయడం శ్రేయస్కరం.
దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.
వ్రత వృత్తాంతము
విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించాడు. "ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస వ్రతమని చెప్పారు కదా... ఏ కారణం వల్ల దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి? విధానం ఏమిటి? అన్నీ వివరించ''మని కోరాడు. దానికి అంగీరసుడు ఇలా చెప్పాడు... "ఓ ధనలోభా విను... చాతుర్మాస్య వ్రతమంటే శ్రీ మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుడు పాన్పుగా నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. ఆ నాలుగు నెలలకే చాతుర్మాసమని పేరు. ఈ నాలుగు నెలల్లో శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జపతపాది సత్కార్యాలు చేసినవారికి పూర్ణఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకొన్నాను కాబట్టి ఆ సంగతులను మీకు తెలియజేయుచున్నాను.
మొదట వైకుంఠమునందు గరుడగంధర్వులు, దేవతలు, వేదాలచే సేవింబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఉండగా నారదమహర్షి వచ్చి నమస్కరిస్తాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత శ్రీహరి నారదమహర్షిని "లోకమంతా ఎలా ఉందని?'' ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి "ఓ దేవా! నీకు తెలియని విషయాలంటూ ఈ సృష్టిలో ఏమున్నాయి. అయినా నన్ను చెప్పమనడంలో నీ గొప్పదనం అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో సాధుపుంగవులు, మానవులు కూడా వారికి విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. మరికొందరు భుజింపకూడని పదార్థాలను భుజిస్తున్నారు. మరికొందరు పుణ్యవ్రతాలు చేస్తూ కూడా మధ్యలో వాటిని ఆపేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార పూరితులై యితరులను నిందిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవనం సాగిస్తున్నారు. మరి వీరంతా ఎలా ముక్తి పొందుతారో నాకు తెలియడం లేద''ని మహర్షి ఆవేదన చెందుతాడు. వీరందరినీ ఉద్ధరించేందుకు తగిన మార్గం ఉపదేశించమని అర్ధిస్తాడు.
అందుకా జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు కలవరపడి లక్ష్మీదేవితో పాటు, గరుడ, గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ లోకంలోని సకల జీవుల్ని పరిశీలిస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు ఇలా అన్ని చోట్ల తిరుగుతుంటాడు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేసేవారు. మరికొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని వారు ఎదురుగానే తప్పుకుతిరిగేవారు, మరి కొందరు అసలు ఈయనవంకే చూసేవారు కాదు. వారందరినీ చూస్తూ ఈ మనుషులను ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తాడు శ్రీహరి. ఈ విధంగా ఆలోచిస్తూనే ఓ రోజు శ్రీహరి నిజరూపంలో లక్ష్మీదేవితో సహా సకలదేవతాగణంతోనూ కలిసి నైమిశారణ్యముకు వెడతాడు.
ఆ వనంలో తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమాలకు వచ్చిన శ్రీహరిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, లక్ష్మీనారాయణలను పరిపరి విధాలుగా స్తోత్రాలు చేస్తారు. ఈ విధంగా మునులందరూ కలిసి లక్ష్మీనారాయణులను స్తోత్రము చేసిన తరువాత జ్ఞానసిద్ధుడనే మహాయోగి "ఓ దీనబాంధవా! వేదవ్యాసుడని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడివని, నిరాకారుడవని, సర్వజనులచే పూజింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వల్ల మేము మా ఆశ్రయములు, మా నివాస స్థలములన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా మేమీ సంసారబంధం నుండి బయటపడే మార్గాన్ని నిర్ధేశించమని వేడుకొన్నాడు. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం చేసుకోలేడు. నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలగుతుంది. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! మమ్ము కాపాడ''మని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్ధా! నీ భక్తికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన వరము కోరుకో''మని పలికాడు.
అప్పుడు ఆ జ్ఞానసిద్ధుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరమునుంచి విముక్తుడిని కాలేక సతమతమవుతున్నాను కాబట్టి నీ పాదపద్మములపై నా ధ్యానం నిలిచేలా అనుగ్రహించ''మని వేడుకొన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు "జ్ఞానసిద్ధా! నీవు కోరిన విధంగానే వరమిచ్చాను. అది కాక ఇంకొక వరం కోరుకో'' అని అన్నాడు. అప్పుడు జ్ఞానసిద్ధుడు "మా బోటి వారే సంసారబంధమునుండి తప్పించుకోలేకపోతున్నతారు. మరి సామాన్యులను కూడా ఉద్దరింప''మని కోరగా నారాయణుడు చిరునవ్వుతో "భక్తా ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తున్నారు. అలాంటి వారి పాపములు పోవడానికి ఒక వ్రతమును సూచిస్తున్నాను. ఆ వ్రతమును అందరూ ఆచరించవచ్చును. జాగ్రత్తగా విను అని చెప్పారు.
నేడు ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై నిద్రకు ఉపక్రమిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి నిద్ర లేస్తాను. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్య వ్రతమని అంటారు. ఈ కాలంలో త్రిసంధ్యలలో చేసే పూజలు, వ్రతాలు నాకు ఎంతో ఇష్టం. ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తూ, ఇతరులచేత చేయిస్తారో వారంతా నా సన్నిధికి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ దశమి నుండి కూరలు, శ్రావణ శుద్ధ దశమి నుంచి పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి పాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానివేయాలి. నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకు నేను ఇలా శయనింస్తా''నని తెలిపి శ్రీమన్నారాయణడు శ్రీమహాలక్ష్మితో పాలసముద్రమునకు వెళ్ళి శేషపానుపుపై పవళించెను.
ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించాడు. ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ, పురుష బేధము లేదు. అందరూ చేయవచ్చుఅని చెప్పాడు. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళారని తెలిపారు.
చాతుర్మాస్య దీక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం
మానవ జీవితాన్ని క్రమబద్దికరించేది చాతుర్మాస్యవ్రతం. ఆషాడం నుండి కార్తిక మాసం వరకు ప్రకృతి లో అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ కాలం లో బావుల్లో, నదుల్లోకి కొత్త నీరు చేరి తాగితే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ ఋతువులో ఆషాడం నుండి నాలుగు నెలలు పాటు ఆచరించవలసిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాస్యము అంటారు. ప్రతి సంవత్సరం ఆషాడ శుక్ల ఏకాదశినాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి మరుసటిరోజు చాతుర్మాస్య వ్రతానికి సంకల్పం చేసి దాన్ని ఆరంభిస్తారు. కార్తిక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశిని పాటించి మరుసటి రోజు (ద్వాదశి) చాత్రుమాస్య వ్రతాన్ని పూర్తి చేస్తారు. వర్షఋతువు ప్రారంభమయ్యే కాలం ఎక్కువ ఉష్ణమగును,కావున ఉష్ణము చేయు ఆహారమును వర్జించమన్నారు మన పెద్దలు. దీనినే శాక వ్రతం అన్నారు. ఆషాడ మాసం లో కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా పండుతాయి.
ఇవి భూమిలో ఉండే ఉష్ణ సహాయముతో పెరుగుతాయి. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు భూమిలో ఉండే వేడి ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమప్పుడు , భూమికి నీరు చేరి, లోపలి అత్యుష్ణము సస్యముల మూలకంగా విసర్జింపబడుతుంది. ఈ సస్యముల నుండి లభించే కూరగాయలు, ఆకు కూరలు ఈ నెలలో తినడం వలన శరీరంలో ఉన్న వేడి, తక్కువ అవడానికి అవకాశం లభించదు. మనము తినే ఆహారం మూలకంగానే అనేక రోగాలు వస్తాయి. ఆహార నియామాలని ఉల్లంఘిస్తే అనేక విధములైన రోగాలు కాల క్రమేణా దాపరిస్తాయి. అందుచే ఈ కాలంలో భూమి నుండి బహిర్గతమవు వేడి శాక పత్రములందు ఎక్కువగా ఉండుటవలన, ఈ కాలంలో వాటిని సేవించ కూడదని మన పెద్దలు చెప్పారు. మరి మనుష్యునికి కావలసిన కొద్దిపాటి వేడి ఇతర ఆహార పదార్దములనందున్నదే, ఈ కాలానికి చాలునన్నారు.
ఆషాడశుద్ద ఏకాదశి మొదలుకొని కార్తిక శుద్ద ఏకాదశి వరకు ఏ విధమైన కాయగూరలు, ఆకు కూరలు భోజన పదార్ధములుగా వాడరాదు. ఏ పదార్ధములు తిన్నా పప్పు పదార్దములతో వండినవే అయ్యి ఉండాలి. చివరకు పోపు సామాన్లలో వాడే కరివేపాకు, కొత్తిమీర కూడా వాడరు. అంతేకాదు కారము కొరకు మిరియాలు, జీలకర్ర తప్ప తక్కిన సుగంధ ద్రవ్యాలను వాడరు ఈ వ్రాత కాలం లో ఉసిరిక వరుగు, మామిడి వరుగు, వేప పూత (ఎండిన పువ్వులు) పచ్చళ్ళుగా వాడుకోవాలి. నిమ్మకాయ, గుమ్మడి కాయ, ముల్లంగి, రేగుపళ్ళు, పొట్లకాయ, చెరుకు, చింతపండు, మినుములు, ఉలవలు తెల్లఆవాలు, అలచందలతో చేసిన పదార్ధాలను తినకూడదు. ఈ విధమైన ఆహార నియమం మనస్సును స్థిరపరచడానికి దైవధ్యానానికి, ఆరోగ్యానికి తోడ్పడతాయి.