నాగపంచమి రోజు ఏం చేయాలి?
హిందూ సంప్రదాయంలో నాగపూజకి చాలా ప్రాముఖ్యత కనిపిస్తుంది. సంతానం కలగాలన్నా, కుజదోషాలు తొలగిపోవాలన్నా, వినికిడి సమస్యలు రాకుండా ఉండాలన్నా... ఆ నాగదేవత అనుగ్రహం ఉండాలని చెబుతారు. పైగా సర్పాలు పంటలు నాశనం కాకుండా కాపాడతాయని రైతుల నమ్మకం. సర్పాన్ని జాగృతం అయిన కుండలినికి సూచనగా భావించేవారూ లేకపోలేదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి వాటిని పూజించేందుకు ఒక పండుగ ఉండటంలో ఆశ్చర్యం ఏముంది!
శ్రావణమాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుచుకుంటాము. ఈ నాగపంచమి పండుగ వెనుక బోలెడు కారణాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు కాళియమర్దనం చేసింది ఈ రోజే అని చెబుతారు. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకి బదులుగా... ఈ రోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు, విష్ణుమూర్తిని కోరుకున్నట్లూ చెబుతారు. ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. నాగపంచమిని ఎలా జరుపుకోవాలో కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి.
నాగపంచమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలారస్నానం చేయాలి. ఇంటి ముందు ముగ్గువేసి, గడపకి పసుపుకుంకుమలు అద్దాలి. వీలైతే ఇంటి గుమ్మానికి ఇరువైపులా నాగదేవతని ఆహ్వానిస్తూ ఐదు, ఏడు లేదా తొమ్మిది పడగల పాములని చిత్రించాలి. ఇంట్లో కూడా ఇలాంటి నాగుల ప్రతిమను కానీ, చిత్రాన్ని కానీ పూజించాలి. నాగేంద్రునికి సంబంధించిన స్తోత్రాలతో స్వామిని ప్రసన్నం చేసుకోవాలి. ఎర్రటి పూలతో కనుక ఈ పూజ సాగితే మరింత మంచిదని చెబుతారు. ఇక స్వామికి ఇష్టమైన చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్లను నివేదన చేయాలి.
నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసే ఆచారమూ ఉంది. దగ్గరలో ఉన్న పుట్టని దర్శించి ఆ స్వామికి పాలు, గుడ్లు, చిమ్మిలి, పళ్లని నివేదిస్తారు. ఈ అవకాశం లేనివారు నాగరాయి ఉన్న ఏ గుడిలో అయినా పూజ నిర్వహించవచ్చు. ఇందుకోసం ముందుగా నాగరాయిని నీటితో శుభ్రంగా కడిగి, ఆపై ఆవుపాలతో అబిషేకించాలి. ఆ తర్వాత తిరిగి నాగరాయిని శుభ్రం చేసి దాన్ని పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించాలి.
పుట్టకి కానీ, నాగరాయికి కానీ పాలు పోయాలనుకునేవారు తప్పకుండా కొన్ని నియమాలని పాటించాలని చెబుతుంటారు పెద్దలు. పాలు పోసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. వస్త్రం తగలకుండా కటిక నేల మీదే నిదురించాలి. నాగుల చవితి రోజున భూమిని దున్నడం, గోతులు తీయడం, కూరలు తరగడం, కాయలూ పళ్లూ కోయడం నిషిద్ధమని చెబుతున్నారు. సర్పాలు నేల మీద కానీ, చెట్ల మీద కానీ ఉంటాయి కాబట్టి.... వాటికి హాని కలిగించకుండా ఉండేందుకు ఈ నియమం ఏర్పరచి ఉంటారు.
నాగపంచమి రోజున నాగేంద్రుని పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివునికానీ, ఆదిశేషుని మీద కొలువై ఉన్న విష్ణుమూర్తిని కానీ, సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వరుని కానీ కొలిచినా మంచిదే! ఇలా చేస్తే కుజ, రాహుదోషాలు ఉన్నవారు; వినికిడి సంబంధమైన సమస్యలు ఉన్నవారు; సంతానం లేనివారు... తప్పక మంచి ఫలితాలని పొందుతారన్నది పెద్దల మాట
- నిర్జర.