జనవరి 11 నుంచి పుష్య మాసం ప్రారంభం...ఈ మాసం చేయాల్సిన పూజలు ఇవే!
జనవరి 11 నుంచి పుష్య మాసం ప్రారంభం అవుతుంది. మార్గశిర ముగిసిన అనంతరం పుష్యమాసం వస్తుంది. సనాతన ధర్మం లో ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా పుష్యమాసం వెనుక ఉన్న విశిష్టత చూసినట్లయితే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండడం వల్ల వచ్చే మాసం కావున దీన్ని పుష్యమాసం అని పిలుస్తారు. ఈ మాసంలో మిత్రులను ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పుష్య పౌర్ణమి రోజు వేద పారాయణం చేసేందుకు అనువైన కాలంగా భావిస్తారు పుష్యమాసం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శనీశ్వరుని పూజించడం ద్వారా ఆయన చూపు మన మీద పడకుండా కాపాడుకోవచ్చు అని పురాణాలు పేర్కొంటున్నాయి. పుష్య పౌర్ణమి నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడంతో పాటు నల్ల నువ్వులను సమర్పించడం ద్వారా. శని పీడ నుంచి విముక్తులు కావచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
పుష్య మాసంలోనే మకర సంక్రాంతి పండగ వస్తుంది. తద్వారా దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పవిత్ర కాలం ప్రారంభం అవుతుంది. పుష్య శుక్ల పంచమి నాడు శ్రీహరిని తులసీదళాలతో పూజించినట్లయితే మీరు అనుకున్న పనులు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పుష్య మాసంలో ప్రతి సోమవారం పరమశివుడిని ఆరాధించినట్లయితే మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి .దీంతోపాటు పుష్య బహుళ ఏకాదశిని విమల ఏకాదశి , సఫల ఏకాదశి, అని పిలుస్తారు.ఈ పవిత్ర పర్వదినాన సున్నిపిండిని ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయాలి. అలాగే నువ్వులను దానం చేస్తే పుణ్య ఫలం దక్కుతంది. పుష్య మాసంలోనే నదీ స్నానం చేయడం ద్వారా పుణ్యగతులు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాయన పుణ్యకాలంలో పితృదేవతలకు పూజలు చేయడం ద్వారా మీకు పుణ్య ఆశీర్వచనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పుష్య మాసంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేందుకు అనువైన సమయం.