నాగుల చవితి రోజు ఇలా చేస్తే...
తెలుగువారికి దీపావళి ముగిసినా కూడా సంబరానికి కొదవ ఉండదు. ఎందుకంటే దీపావళి పోయిన ఒక నాలుగు రోజులకి నాగులచవితి ఎలాగూ వస్తుంది. ఆ రోజు ఉదయం నాగపూజ మొదలుకొని సాయంవేళ టపాసులు కాల్చుకోవడం వరకూ అన్నివయసులవారికీ కావల్సినంత హడావుడి ఉంటుంది.
చల్లగా చూడమంటూ
కొంతమంది నాగులచవితిని శ్రావణ మాసంలో జరుపుకొంటున్నప్పటికీ, అత్యధికులు కార్తీక శుద్ధ చతుర్ధినాడే ఈ పండుగను ఆచరిస్తారు. కార్తీక మాసంలో దీపావళి నాటికల్లా వర్షాకాలం ముగిసిపోతుంది. వాగులూ, వంకలూ ఉధృతంగా పొంగుతూ ఉంటాయి. పొలం పనులూ జోరుగానే సాగుతుంటాయి. ఈ సందర్భంగా అటు రైతులకు ప్రత్యక్షంగా ఇటు మానవాళికి పరోక్షంగా సాయపడే నాగజాతిని పూజించుకోవడం సబబుగానే కనిపిస్తుంది. పైగా ఈ పనులలో పడి తెలియక వాటి జోలికి వెళ్తే పెద్ద మనసుతో తమను మన్నించమనే అభ్యర్థనా ఉంటుంది. ‘పడగ తొక్కిన పగవాడనుకోకూ, నడుము తొక్కిన నావాడనుకొనుమూ, తోక తొక్కిన తొలగుచు పొమ్ము’ అని నాగరాజుని పూజించుకుంటారు.
మనది నాగజాతి
దక్షిణాది రాష్ట్రాలలో నాగులను పూజించడం గురించి చరిత్రలో ఎంత లోతుగా తవ్వినా తగుల్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ రాష్ట్రాలలో ‘నాగ’ శబ్దంతో మొదలయ్యే ప్రాంతాలు (నాగపట్టణం, నాగాయలంక...) చాలానే కనిపిస్తాయి. ఇక మనుషుల పేర్లయితే (నాగేశ్వరరావు, ఫణి...) చెప్పనే అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఆంధ్రులను నాగజాతివారిగా పిలవడమూ వినిపిస్తుంది. తెలుగునాట ఉన్న బౌద్ధ విగ్రహాలలో బుద్ధుడు సైతం పడగ నీడ ధ్యానం చేసుకుంటున్నట్లు కనిపిస్తాడు.
అటు ఆధ్మాత్మిక ఇటు భౌతికం
ఆధ్మాత్మికపరంగా కూడా నాగపాముకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. జాగృతమైన కుండలినిశక్తికి నాగపాముని ప్రతీకగా భావిస్తారు. ఇక భౌతికంగా చూస్తే రాహు, కుజ దోషాలు ఉన్నవారు; చెవి, కంటి సమస్యలు ఉన్నవారు; సంతానం లేనివారు... నాగపాముని పూజిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. కళ్లు, చెవులు సరిగా లేని పాముని పూజిస్తే కంటి, వినికిడి సమస్యలు తీరడం ఏమిటని వెక్కిరించేవారూ లేకపోలేదు. కానీ పాముకి ఉండే అంతర్గత చెవులు శుభ్రంగా అన్ని శబ్దాలనీ వినగలుగుతాయనీ, వాటి చూపు తీక్షణంగా ఉంటుందన్నది పరిశోధనల్లో తేలిపోయింది.
నాగులు జాగ్రత్త
నాగులచవితి రోజున ఏదన్నా పుట్టను దర్శించడాన్ని శుభంగా భావిస్తారు. వీలైతే పుట్టలో పాలు పోయడం, పసుపుకుంకుమలతో పుట్టని పూజించడం, నువ్వులతో చేసిన చిమ్మిలి వంటి ప్రసాదాలను నాగేంద్రునికి అర్పించడం చేస్తారు. అయితే మనకు సాధారణంగా కనిపించే పాములు పాలు తాగవనీ, పైగా పుట్టలను పాలతో నింపేయడం వల్ల వాటికి హాని జరుగుతుందనీ విజ్ఞులు చెబుతున్నారు. ఇక రసాయనాలతో చేసే పసుపు, కుంకుమల వల్ల కూడా సున్నితమైన వాటి చర్మానికి కీడు జరిగే అవకాశమే ఎక్కువని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శాస్త్ర ప్రకారం ఒక చారెడు పాలని పుట్టలో పోసి... నాగరాజుని ప్రార్థించుకుంటే సరి. చల్లని ఆ స్వామి చూపు మన జీవితాలని వెన్నంటి వస్తుంది.
- నిర్జర.