బ్రహ్మరాక్షసి అంటే ఎవరో తెలుసా?!

Brahma Rakshasi (Demoness)

మనకు ఎవరిమీదైనా కోపం కట్టలు తెంచుకుంటే ''బ్రహ్మరాక్షసి'' అంటాం. ఇంతకీ బ్రహ్మరాక్షసి అంటే ఎవరు? ఆ కథాకమామీషు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం దూరాభారాలు వెళ్ళాలంటే కష్టంగా ఉండేది. రాజులు, మంత్రులు లాంటి గణనీయమైన వ్యక్తులు అయితే గుర్రాలను అధిరోహించి వెళ్ళేవారు. సామాన్యులు కాలినడక సాగించాల్సిందే. అందుకే ఎవరికివారు తమ పిల్లల పెళ్ళిళ్ళు ఉన్న ఊళ్ళలోనే లేదా ఇరుగుపొరుగు ఊళ్ళ వారితోనే జరిపించేవారు.కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలన్నా అంతే. అందుకే ''కాశీకి పోయినవాడు కాటికి పోయిన వాడితో సమానం'' అనే సామెత పుట్టుకొచ్చింది. అడవులు గట్రా దాటి వెళ్ళేటప్పుడు ఏ క్రూర మృగాలకో ఆహారం కాకుండా తిరిగివస్తే వచ్చినట్లు, లేదా అంతే సంగతులు.

ఈ నేపథ్యంలో ఒక బ్రాహ్మణుడు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు బయల్దేరాడు. దారిలో ఒక మర్రిచెట్టుకింద పడుకున్నాడు. అతను నిద్రలో ఉండగా భయంకరమైన అరుపులు వినిపించడంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే భీకర రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసి పైన చెట్టు మీద ఉంది. అది ఇంకా వికృతంగా ముఖం పెట్టి అరుస్తోంది. దాన్ని చూసిన విప్రుడు కాలికి బుద్ధి చెప్పాడు. ఎంత వేగంగా పరిగెత్తినా లాభం లేకపోయింది. బ్రహ్మరాక్షసి వెంటపడి పట్టుకుంది.

కానీ, ఆ బ్రహ్మరాక్షసి విప్రునికి ఏమీ హాని చేయలేదు. ''నీవు సామాన్యుడివి కావు.. నీలో ఏవో విశేష గుణాలు, మహనీయమైన శక్తి ఉన్నాయి. నీ దివ్య దర్శనంతో నేను చేసిన పాపాలు నశించిన భావన కలుగుతోంది. నీ వల్లే నాకు మోక్షం లభిస్తుంది అనే నమ్మకం కలిగింది... '' అంటూ వినయంగా నమస్కరించింది.

బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ''అంటే, నువ్వు నిజానికి బ్రహ్మరాక్షసివి కాదన్నమాట. మరి నీకు ఈ రూపం ఎలా వచ్చింది?" అని అడిగాడు ఆసక్తిగా.

''ఈ దగ్గర్లో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. కావడానికి ఆలయ పూజారినే అయినా నాలో వెతికి చూసినా మంచి అనేది లేదు. తోటివారికి మంచి చేయకపోగా మోసద్వేషాలతో మెలిగేవాణ్ణి. దొంగతనానికి పాల్పడేవాణ్ణి. ఆఖరికి వేశ్యల దగ్గరకు కూడా పోయేవాడు. భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కార్యాలకు ఉపయోగించక నా స్వార్ధానికి వాడుకునేవాణ్ణి. అన్నిటినీ మించి దేవాలయంలోనే చౌర్యానికి పాల్పడ్డాను. దేవుని ఆభరణాలను దొంగిలించి తీసికెళ్ళి కులకాంతలకు ఇచ్చేవాణ్ణి. ఒక దశలో గుడిలో అర్చన కార్యక్రమాలు మానేశాను. పూర్తిగా వేశ్యాలోలుడినై పతనంలో పరాకాష్టకు చేరాను.

''...పెద్దతనంలో నా శక్తి యుక్తి నశించాయి. నా వద్ద ఉన్న ధనం అంతా తరిగిపోయాక వేశ్యలు నన్ను తరిమికొట్టారు. నేను చేసిన ఘోరాలు క్షమించదగ్గవి కాదుగదా.. అయినవాళ్ళెవరూ నన్ను చేరనివ్వలేదు. ఆఖరి దశలో తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక దిక్కులేని చావు చచ్చాను. 

''..మరణానంతరం నరకం చేరాను. యముడు శాపం పెట్టగా ఇలా బ్రహ్మరాక్షసిగా పుట్టి, ఏ చెట్టుమీదా నివాసం ఉంటున్నాను. ఇన్నాళ్ళకి నీ దివ్య దర్శనం అయింది.. దయచేసి నాకు శాపవిమోచనం కలిగించు..'' అంటూ వేడుకుంది బ్రహ్మరాక్షసి.

అలా తన కథ వివరించిన బ్రహ్మరాక్షసి, శాపవిమోచనం పొందింది.


Big demoness , brahma rakshasi, brahma rakshasi in hindu epics, puranalu brahma rakshasi, hindu epics great demon


More Purana Patralu - Mythological Stories