ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఎంత ప్రాముఖ్యత అంటే, రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.

‘బతుకమ్మ’ వెనుక కథ...
బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో వున్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం ‘‘బతుకమ్మా’’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందింది. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో వుంది. ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారత దేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు తల్లితండ్రులు ఆమెకి ‘‘బతుకమ్మ’’  అని పేరు పెట్టారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను ఆనవాయితీ అయిందట.

బతుకమ్మ పండుగ.. వివరాలు...

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తూ వుంటుంది. ఈ మాసంలో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలంతో కనిపిస్తూ వుంటుంది. ఈ రెండు నెలల్లో వచ్చే అన్ని పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం వుంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం వుందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం వుంది. అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా వుంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా వుంటుంది. చెరువులన్నీ తాజా నీటితో నిండి వుంటాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో గునుక, తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. అలాగే సీతాఫలాలు కూడా విరగకాస్తాయి. మొక్కజొన్న పంట కూడా కోతకు సిద్ధమై వుంటుంది. ప్రకృతి రమణీయతతోపాటు రైతులకు కూడా సంతృప్తికరంగా వుండే వాతావరణం తెలంగాణ అంతటా వుంటుంది. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

బతుకమ్మ అంటే సంబరమే సంబరం...

బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్ళలో హడావిడి మొదలవుతుంది. బతుకమ్మ  పండుగ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి ప్రతిరోజూ సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. నయన మనోహరకరంగా వుంటుంది ఆ సన్నివేశం. ఆ రోజున పురుషులంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగ, కలువ పూలను  కోసుకుని వస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగ, తంగేడు, కలువ పువ్వుల్ని, మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు వున్నా గునుగ పూలు, తంగేడు పూలదే ఆధిపత్యం వుంటుంది.

బతుకమ్మ చేసే విధానం....

గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా వుండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు. ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా వుంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మని బయటకి తీసుకువచ్చి  ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని, వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరిస్తారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తరువాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుసెనగ లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు.

 

బతుకమ్మ వేడుకల  చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, ప్రేమతో మానవ హారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడే వేళకి  ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని  పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో, వాయిద్యాలతో కన్నుల పండుగగా వుంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత చక్కెర, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. ఆ తర్వాత ఖాళీ పళ్లెం (తాంబళం)తో ఇంటికి చేరతారు.

 


More Others