చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే పండుగ ఇది. ఈ పండుగ అసలు పేరు ‘చంద్రోదయ ఉమావ్రతం’. సాధారణంగా ఈ వ్రతాన్ని స్త్రీలందరూ ఆచరిస్తారు, ముఖ్యంగా పెళ్లికావలసిన ఆడపిల్లలు ‘అందమైన భర్త రావాలి’ అనే కోరికతో ఆచరిస్తారు. నిజానికి వ్రతాలన్నీ ఆడవారికి నిర్దేశించబడినవే అయినప్పటికీ., పెళ్లికావలసిన యువకులు కూడా ఈ వ్రతాన్నిఆచరించడం ఓ విశేషం.
ఈ పండుగ ముందురోజు నుంచే ఆడపిల్లలు చేతులకు., పాదాలకూ గోరింటాకు పెట్టుకోవడంతో హడావుడిగా ప్రారంభమవుతుంది. ఎవరి చెయ్యి బాగా పండితే వారికి ప్రేమగా చూసుకునే అందమైన భర్త వస్తాడని కన్నెపిల్లల నమ్మకం. అందుకనే నా చెయ్యి బాగా పండాలంటే.., నా చెయ్యి బాగా పండాలని ఆడపిల్లలంతా పోటీ పడతారు. ఇక కన్నెపిల్లల తల్లలు మరునాడు ఉమాదేవికి నివేదన చేసే అట్లు కోసం మినగపప్పు రుబ్బుకోవడం., తెల్లవారుఝామునే తమ పిల్లలు తినే చద్దిఅన్నం.,గోంగూరపచ్చడి చేయడంలో నిమగ్నమైపోతారు. తండ్రులైతే.. మరునాడు తమ పిల్లలు ఊగడానికి కావలసిన ఉయ్యాలలను చెట్లకు కట్టడంలో బిజీగా ఉంటారు.
ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే... తెల్లవారుఝామనే నిద్రలేచి., స్నానాదులు పూర్తి చేసి., సూర్యోదయం కాకముందే చద్దిఅన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని,ఇంత నెయ్యి వేపుకుని., (ఉల్లిపాయ నంజుకుని) తినాలి. ఆ తర్వాత కమ్మటి మీగడపెరుగు వేసుకుని కడుపునిండా భుజించాలి. ఎందుకంటే., తిరిగి చంద్రోదయం అయ్యేవరకూ ఏమీ తినకూడదు. మంచినీళ్లు కూడా తాగకూడదు. ఉదయమంతా అలా ఉపవాసం ఉండి., సాయంకాలం అయ్యేవరకూ ఆటపాటలతో., ఊయలలు ఊగుతూ కాలక్షేపం చేయాలి. దీనినే ‘ఢోలోత్సవం’ అంటారు. ఈ డోలోత్సవం అయిన తర్వాత.., చీకటి పడిన తర్వాత చంద్రదర్శనం చేసుకుని., ఫోడశోపచారాలతో ఉమాదేవిని పూజించి, తోరమును కట్టుకుని, పది అట్లు నివేదన చేసి., పది అట్లు., ఒక తోరమును ఒక ముత్తయిదువుకు
వాయనమివ్వాలి. ఇలా పది సంవత్సరములు చేసిన తర్వాత పది అట్లు, గుంట పుస్తెలు గల నల్లపూసలతాడు., దక్షిణను పది మంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ఆ తర్వాత ఈ వ్రతానికి ఉద్యాపన చేయాలి. అట్లు నివేదన చేసే వ్రతం కనుక ఈ వ్రతాన్ని ‘అట్లతద్ది’ అన్నారు. ఉద్యాపన చేసిన తర్వాత కూడా ఈ వ్రతాన్ని కొనసగించవచ్చు. ఇలా ఈ వ్రతం చేసి ఫలితం పొందిన వారున్నారా.. అంటే.. ఉన్నారు అని ఈ క్రింది కథ చెప్తుంది.
పూర్వం ఓ రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ స్నేహితులు నలుగురూ ‘అట్లతద్ది’ వ్రతం ఆచరించారు. ఉదయమంతా ఈ నలుగురూ ఆటపాటలతో, ఊయలలూగుతూ కాలం గడిపారు. పరమ సుకుమారి అయిన కారణంగా ఉపవాసం వల్ల ఆకలికి తట్టుకోలేక రాజు కూతురు సొమ్మసిల్లి పోయింది. ఈమె అంటే అన్నయ్యలకు గారం.అందుచేత ఒక అన్న చింతచెట్టు కొమ్మకు అద్దం కట్టి, అందులో గుండ్రంగా ఉండే వస్తువును కనబడేలా పెట్టి..,చెల్లెలు ముఖంమీద నీరుజల్లి ఆమెను సేదదీర్చి..‘చెల్లెమ్మా..అదిగో చంద్రుడు వచ్చాడు., చూడు’ అని చెల్లెలుకు అద్దంలో నున్న గుండ్రని వస్తువును చూపించారు. రాజకుమార్తె చంద్రదర్శనం చేసాను అనే నమ్మకంతో ఆహారం భుజించి ఉమాదేవి వ్రతం ఆచరించింది. ఈ సంగతి తెలియని ఆమె స్నేహితులు యథావిధిగా వ్రతం ఆచరించారు.
ఈ నలుగురికీ యుక్తవయస్సు రాగానే వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే..రాజు కూతురుకు ముసలి వరుడు., తక్కిన స్నేహితులకు పడుచు వరులు వచ్చారు. రాజు కూతురు ముసలి వరుని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక.,ఒకరోజు రాత్రి ఇల్లు వదిలి అడవికి వెళ్లి తపస్సు చేస్తోంది. ఆమె తపస్సుకు శివపార్వతులు ప్రత్యక్షమై రాజకుమార్తె చేసిన వ్రతలోపాన్ని ఆమెకు తెలియచెప్పి, ‘ఈసారి అట్లతద్ది నోము యథావిథిగా ఆచరించి, పూజాక్షతలు నీ భర్త శిరసుమీద జల్లు’ అని సలహా ఇచ్చి అదృశ్యమయ్యారు. రాజకుమార్తె ఆ విధంగా వ్రతం ఆచరించి యవ్వనవంతుడైన వరుని భర్తగా పొంది సుఖించింది.
కనుక కన్నెపిల్లలూ..ప్రేమించే అందమైన భర్త వస్తే.. ప్రేమించే అందమైన పిల్లలు కలుగుతారు. భర్త, పిల్లలు బావుంటే జీవితం బావుంటుంది. మరెందుకు ఆలస్యం? యథావిధిగా ‘అట్లతద్ది’ నోము నోచుకోండి.. ఆనందం అనుభవించండి.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం