హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప కొలువైన ద్వారపూడి
అయ్యప్ప దీక్షలు ముమ్మురంగా జరిగే రోజులు ఇవి. నిష్టాగరిష్టులైన భక్తులు గజగజ వణికించే చలిని కూడా లెక్కచేయక తెల్లవారుఝామునే లేచి, చన్నీటి స్నానం చేసి ఆ అయ్యప్పస్వామి కరుణా కటాక్షాలకోసం భక్తితో ఆయనను పూజిస్తారు. దీక్షాకాలంలో కఠోర నియమాలు పాటించి, భగవన్నామస్మరణతో గడిపి దీక్ష పూర్తయ్యే సమయానికి శబరిమల యాత్ర సాగిస్తారు. అయ్యప్పస్వామి దీక్షేకాక శివ దీక్ష, ఆంజనేయ దీక్ష, భవానీ దీక్ష ఇలా అనేక రకాల దీక్షలతో భక్తులు తమ ఆరాధ్య దైవాలను సేవిస్తున్నారు. ఏ దీక్ష అయినా, మన మనసు, శరీరం పవిత్రంగా వుంచుకోవటానికి చేసేదే. దీక్షాకాలంలో దైవానుగ్రహం కోసం పాటించే నియమాలలో కొన్నయినా అందరూ తర్వాత కూడా పాటిస్తే ప్రపంచంలో అశాంతి అడ్రసు లేకుండా పోతుందికదా. అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్ర ప్రారంభించే ముందు ఇరుముడి కట్టుకోవటానికి సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయానికి గానీ, ఇంకేదయినా ఆలయానికిగానీ చేరుకుంటారు. మరి మనంకూడా ఈ సమయంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దర్శించాలికదా. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరలో వున్న ద్వారపూడిలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శిద్దామా? ఇది కేవలం అయ్యప్పస్వామి ఆలయమే కాదు. విశాలమైన ప్రాంగణంలో అనేక దేవీ దేవతలు ఇక్కడ కొలువుతీరి వున్నారు. ప్రశాంతమైన పరిసరాల్లో వున్న ఈ ఆలయ సమూహాన్ని దర్శించినవారికి మనసు సేద తీరుతుంది.
ద్వారపూడి
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కి.మీ. ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే తోవలో వున్న ద్వారపూడిలో వెలిసిన ఈ ఆలయ సముదాయంలో అయ్యప్ప దేవాలయంతోబాటు, సాయిబాబా, శివాలయాలు కూడా వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు దర్శకులను అమితంగా ఆకర్షిస్తాయి. అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిలో కొందరు కారణాంతరాలవల్ల శబరిమలదాకా వెళ్ళి స్వామి దర్శనం చెయ్యలేకపోవచ్చు. అలాంటివారు ఇక్కడికి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించుకుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలనుంచేకాక ఒరిస్సానుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రతిష్టింపబడ్డ అయ్యప్పస్వామి విగ్రహం పంచలోహాలతో తయారు చేసినది. 1989 లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిచే ప్రతిష్టింపబడినది. ఈ స్వామి సన్నిధికి చేరటానికి ఏర్పాటు చేసిన పధ్దెనిమిది మెట్లకి కూడా ఒక విశేషం వున్నది. ఈ పధ్దెనిమిది మెట్లనూ తమిళనాడులోని తురుమూరునుంచి తెప్పించిన ఏక శిలపై చెక్కి, బంగారంతో తాపడం చేయించారు. ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అనుమతిస్తారు. ఆలయ ప్రాంగణంలో వున్న హరిహరుల విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి. పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు. అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది. బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న పెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది. ఆస్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా పాలరాతితో నిర్మించబడిన నాలుగంతస్తుల శ్రీ ఉమా విశ్వేశ్వరస్వామి ఆలయం దర్శించుకోవచ్చు.
ఈ ఆలయానికీ కొన్ని విశేషాలున్నాయి. ఇక్కడి శివ లింగం చాలా పొడుగ్గా పై అంతస్తు దాకా వుంటుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి. అంతేకాదు .. గంగోత్రి, యమునోత్రి, కేదారనాధ్, బదరీనాధ్, బ్రహ్మకపాలం, అమరనాధ్, ఓంకార్, కాశీ, ఋషికేశ్, హరిద్వార్ మొదలగు క్షేత్రాలనుంచి తెచ్చిన 18 శివలింగాలను అన్ని అంతస్తులలో ప్రతిష్టించారు. పై అంతస్తులోని చతుర్మఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి ఈ 18 శివలింగాలపై ఆ అభిషేక ద్రవ్యాలు పడి కన్నుల పండుగగా గోచరిస్తుంది. శివాలయం ముందు పెద్ద ఆంజనేయస్వామి, నటరాజు విగ్రహాలున్నాయి. అయ్యప్ప దేవాలయానికి ఈశాన్యంగా భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం వున్నది. ఇక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయ ప్రవేశానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. ఇంతకీ ఈ ఆలయ నిర్మాత గురించి కూడా తెలుసుకోవాలికదా. 1969లో తమిళనాడునుంచి శ్రీ ఎస్.ఎల్. కనకరాజు అనే ఆయన వస్త్ర వ్యాపారం నిమిత్తం ద్వారపూడి వచ్చి స్ధిర పడ్డారు. ఆయన అయ్యప్పస్వామికి మొక్కుకున్న ఫలితంగా తనకి కొడుకు పుట్టాడని సంతోషంతో ఇక్కడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ఆయన సంకల్పానికి భక్తులూ, దాతలూ ఇచ్చిన విరాళాలు తోడయి 1983 లో ఆలయ శంకు స్ధాపన జరిగింది. అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీపడుతూ ఆకర్షణీయంగా వున్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసినదే.
- పి.యస్.యమ్. లక్ష్మి