TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
చిన్నప్పటి నుంచీ నాకు పాటలంటే ఇష్టం. పత్రి ఒక్కరి జీవన గమనంలోనూ, ఒక్కో మజిలీలో, ఒక్కో పాట గుండెను నిమురుతుంది. అంతేకాదు కొన్ని పాటలు, కొన్ని సంఘటనలు, గుండె పొరల్లో ఇరుక్కుపోతాయి. జ్ఞాపకాల దొంతర్లో నుంచి, అడపాదడపా బయటకు వచ్చి – మనల్ని మధుర స్మృతుల్లో ముంచి తెలుస్తాయి.
అలా మొట్టమొదటిగా నన్ను కుదిపేసిన పాట”పగలే వెన్నెల జగమే ఊయలా” – పూజ ఫలంలో సి. నారాయణరెడ్డి గారి కవిత్వం. అప్పుడు నాకు పదేళ్లుంటాయేమో! సరోజిని అత్తయ్య అని నా మేనత్త. తనంటే నాకు చాలా ఇష్టం. ఆమెకి పెళ్లయిన రోజు, ఆ రోజు, బాపట్లలో, ఆరుబయట చల్లటి గాలిలో, వెన్నెల రాత్రిలో, అందరం మంచాల మీద కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు మా అత్తయ్య పాడిందా పాట. ఆ తర్వాత “ఆధా హై చంద్రమా... రాత్ ఆధీ” అనే నవరంగ్ లో పాట పాడింది. అ రెండు పాటలు అంతకు ముందు నేను విన్నదీ లేదు. వాటిని సంగీత పరంగా, సాహిత్య పరంగా వెలకట్టే వయసూ కాదు.
కానీ నాకత్యంత ఇష్టమైన వ్యక్తి గొంతులోంచి అ కమ్మని రాత్రి వేళ, ఆ పాటలు జాలు వారడం నా గుండెలో చెరగని ముద్ర వేసింది. బహుశా ఆ రాత్రే నేను సంగీత అభిమానిగా మొదలెట్టిన ప్రయాణం మొదటి అడుగు పడిందేమో! తర్వాత రేడియోలో ప్రతి బుధవారం రాత్రి వచ్చే బినాకా గీత్ మాలా కోసం తెగ ఎదురు చూస్తే వాడిని. అప్పుడు మా ఇంట్లో ఓ చిన్న సూట్ కేస్అంత మర్ఫీ రేడియో వుండేది. రేడియో సిలోన్ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది. అప్పుడు ఎఫ్ఎమ్ వుండేది కాదనుకుంటా. రిసెప్షన్ సరిగ్గా లేక రెండు స్టేషన్లు కలిపి, మిమిక్రీ టైపులో వచ్చేవి.
అయినా సరే తెగ ఆనందించే వాడిని. అప్పుడప్పుడు క్రికెట్ కామెంటరీ దొరికితే పండగే. అదో స్టేటస్ సింబల్. మా నాన్నయితే తెలుగులో ఇంగ్లీష్ లో ఎప్పుడూ న్యూస్ పెట్టేవారు. నాకు బాగా గుర్తు. “వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్” అన్న గొంతు. ఆదివారం మధ్యాహ్నం ‘సంక్షిప్త శబ్ద చిత్రం’ అని సిన్మా వేసేవాళ్లు. మా అమ్మ, పక్కింటి వాళ్లు చాలా మంది చేరిపోయేవాళ్లు. రేడియోలో సిన్మా వినడం అంటే ఇప్పటి తరం వాళ్లు పడిపడి నవ్వుకుంటారేమో! రేడియోలో ఇంకో ఇష్టమైన ప్రోగ్రాం బాలల కార్యక్రమం.
‘తేనెల తేటల పాటలతో మన జాతి మాతనే కొలిచెదమా’ అనే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మకావ్యగీతం, ఆరోజుల నుంచీ గుర్తు. కార్యక్రమం చివరలో ‘ఇక చాలు ఇళ్లకు పోదామా? మళ్ళీ వచ్చే వారము కలుద్దాము’ అనే బృందగానం కూడా ఇంకా గుర్తే. నేను ఆరో తరగతి మా అమ్మమ్మ వాళ్లింట్లోనే చదివాను. మా నాన్న ఓసారి సెలవులకు వచ్చి – ‘ఒరేయ్ నువ్వూ గాడిదలాగా తిగుతున్నావ్. ఈ పద్యం రేపటికల్లా కంఠస్తం పట్టి చెప్పు’ అని హుకుం వేశారు. మనుచరిత్రలోని ‘అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి...” అనే పద్యం అది.
ఆ పద్యం ఇప్పటికీ పొల్లు తప్పుపోకుండా అనర్గళంగా చెప్పగలను. కానీ, మిగతావేమీ గుర్తులేవు. ఇలా కొన్ని ఉదంతాలు జీవితాంతం గుర్తుండిపోవడానికి శాస్త్రీయమైన కారణాలు ఏమిటో!? నేను ఇంటర్మీడియట్ వుండగా, మొట్టమొదటిగా టేప్ రికార్డర్ చూశాను. నాన్న అమెరికాలో మూడేళ్ళుండి వస్తూ తెచ్చిన మ్యూజిక్ పెట్టె అది. దాంట్లో మొదటిగా విన్న టేప్ ఘంటసాల పుష్ప విలాపం. “ఊలు దారాలలో గొంతుకురి బిగించి, గుండెలో నుండి సూదులు గుచ్చి. కూర్చి....” కరుణశ్రీ సాహిత్యంలోని తేనె జుర్రుకునే వయసొచ్చేసింది అప్పుడే.
అప్పుడు బాపట్లలో పాత సిన్మాలు వస్తుండేవి. ఆరాధన. డా.చక్రవర్తి మనసుకు హత్తుకు పోయిన సిన్మాలు. ఎందుకంటే హీరో డాక్టర్ కదా. ఆరాధనలోని “వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా” అనే సుశీల పాట ఈ రోజుకి నాకు నచ్చిన టాప్ టెన్ పాటల్లో ఒకటి. ఆ మాటకొస్తే పాత బ్లాక్ అండ్ వైట్ సిన్మాల్లోచిత్రీకరించిన ప్రతి వెన్నెల పాటా నాకు తెగ ఇష్టం. ఆ నిండు చంద్రుడు, టెర్రస్ గార్డెన్, చల్లటి గాలికి ఎగురుతున్న హీరోయిన్ (ముఖ్యంగా సావిత్రి) ముంగురులు. ఆ చిత్రీకరణ ఎంతో అద్భుతంగా వుండేదంటే నైట్ క్వీన్ సుగంధ మాధుర్యాలు కూడా ముక్కుపుటాలకు సోకినట్లు అనిపించేది
“ఆకాశ వీధిలో అందాల జాబిల్లి”, “వినిపించని రాగాలే కనిపించని అందాలె”, ఈ రేయి తీయనిది, ఈ హాయి మాయనిది, “ఇంతకు మించి ఏమున్నది”, అందెను నేడే అందనిజాబిల్లి, నా అందాలన్నీ అతని వెన్నెలలే”, “పులకించని మది పులకించు” ఇలా ఎన్నని ఉదహరించను. తర్వాత మజిలీ గుంటూరు మెడికల్ కాలేజీ. అప్పుడు సాన్యో వాళ్ల బుజ్జి టేప్ రికార్డర్ తెగ పాపులర్. ఉన్న పాకెట్ మనీ అంతా దాని బ్యాటరీలకి చాలక, ప్రతినెలా అప్పుచేస్తుండే వాడిని. టెర్రస్ మీద పాటలు వింటూ, చాలా రొమాంటిక్ గా ఫీల్ అయ్యే వాడిని.
ఎంబిబిఎస్ లో భార్గవి అని నా క్లాస్ మెంట్ వుండేది. తను గొప్పగా పాటలు పాడేది. ఇక ఫంక్షన్ లోనయినా, పిక్నిక్ లోనయినా తను పాడేదాకా వదిలేవాళ్లం కాదు. దేవులపల్లి రచన “మధుదయంలో – మంచి ముహూర్తం మాధవీలతకు పెండ్లి” భార్గవి పాడితే వినాల్సిందే. మీరు వినాలనుకుంటే పామర్రు (కృష్ణాజిల్లా) వెళ్ళిరండి. అక్కడ ఆమె “పాడానంటేపాపలే బయటకు రావాలి” అని పాడుకుంటూ, అనస్తిషియా ఇవ్వనక్కర లేకుండా ప్రసూతి వైద్యం చేస్తోంది.
|