సన్నజాజి తీగలోయ్... సంపంగి పూవులోయ్....

చిలిపి సింగారులోయ్ - పాపలు సిరులొలికే చిన్నారులోయ్... పిల్లల గురించి అనురాగం సిన్మాలో భానుమతి పాడిన పాట వింటున్నాను. “The Child is the message of God that the world should go on” అన్న నానుడి ఎంత నిజం. పిల్లల వల్ల ప్రపంచంలో ఎంత ఆనందం నిండి వుందో కదా. ఎంత శ్రమించి ఇంటికొచ్చిన తండ్రికయినా, ఓ బోసి నవ్వు పాపాయి స్వాగతం పలికితే, శ్రమంతా మటుమాయమే కదా! “చక్కదనము లేల – సంపద లేల – విద్య యేల – భూము విరివి యేల – పుత్ర పదవి కంటే పుట్టునే పదవులు?” అంటాడు వేమన.

 

“మమ లాలస్య మానన్య పుత్రార్ధం నాస్థినై సుఖమ్" అంటూ పరితపిస్తాడు దశరథుడు. దశరథుడి అర్తినీ, దుఃఖాన్నీ, విశ్వనాధగారు, రామాయణ కల్పవృక్షంలో అద్భుతంగా వర్ణించారు. “ఉయ్యాలలో పడుకున్న పసిబిడ్డ చిటికె వేయగానే బోసినవ్వు నవ్వితే, ఇంటికి వెళుతుండగానే, కాళ్లకి అడ్డం పడి మోకాళ్లపైకి ప్రాకి, ఎత్తుకోమని బిడ్డ చేతులందిస్తే ఓహ్ - ఎంత పుణ్యం చేస్తే దంపతులు ఈ మహత్తరమైన అనుభవాన్ని పొందుతారో కదా" అని దశరథుడు తలపోసేవాడట.ఇటీవల నా పిల్లలిద్దరి పుట్టిన రోజులు జరిగాయి. ఆదర్శ్ కి ఇరవై, కావ్యకి పదహారు వసంతాలు నిండాయి. నిన్నకాక్క, మొన్న, నా పొట్ట మీద పడుకొని (చదువుతూ బోర్లించిన పుస్తకంతో పోల్చారు ఇలా పడుకొనే పిల్లల్ని), జోలపాతలతో నిద్రపోయిన చిన్నారులేనా వీళ్లు? కళ్ల ముందే పెరిగిపోయారు.

మళ్లీ వాళ్ల చిన్నతనం రోజులు వస్తే బాగుండు.ఎన్ని తీపి జ్ఞాపకాలో!! డాక్టరుగా, మేమిద్దరం, మొదటి మెట్లు ఎక్కడానికి కిందా మీదా పడుతున్న రోజుల్లో, వాళ్ల బాల్యానికి సంబధించిన అలనా పాలనా, మా ఇద్దరికీ ఇంకో బాధ్యత, కొన్ని సార్లు చాలా కష్టపడ్డాం. కుటుంబ బాధ్యతని, ఉద్యోగ ధర్మాన్ని సమతూకం చేయడానికి. అయినా, వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ బాధలు, భయాలు, ఆ సందేహాలూ, సమస్యలు కూడా స్మ్రతి పథంలో అపురూపంగా మిగిలిపోయాయి.ఆదర్శ్ బాల్యం అంతా పూనెలో, తర్వాత ఇంగ్లాండ్ లో. వాడికీ నా వెన్నెల పిచ్చి సంక్రమించిందనుకుంటా. రాత్రి పూట చందమామని చూపిస్తే గానీ అన్నం తినేవాడు కాదు. ప్లాట్స్ లో చందమామ దొరకదు కదా! మా చిన్నత్తయ్య, వాడ్ని బయట పార్క్ లోకి తీసుకెళ్లి గోరు ముద్దలు పెట్టేది.

హాస్పిటల్ నుంచి నా రాక కోసం ఎదురు చూస్తూ, వాడు బాల్కనీలో నిల్చొని, రోడ్డుకేసి చూస్తుండే వాడు.మనో ఫలకం నుంచి చెరిగిపోని కొన్ని దృశ్యాలుంటాయి ప్రతి జీవితంలో, ఆదర్శ్ ఎదురు చూపులు, నా జీవితంలో అలాంటి దృశ్యమే! ఒక్కోసారి, హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఆలస్యమయ్యేది. అయినా, అలానే, అక్కడే, వుండేవాడు. వాడికి, స్కూటర్ మీద ఒక రైడ్ ఇచ్చి, తండ్రిగా, ఆ రోజు నా బాధ్యత నిర్వర్తించే వాడిని. అప్పుడు వాడి కళ్లలో ఆనందం - ఈ రోజు క్కూడా గుర్తే.ఇంగ్లాండ్ వెళ్లేసరికి వాడికి మూడేళ్ళు. అక్కడ శని, ఆదివారాల్లో వాడితో గడపడానికి సమయం దొరికేది. ఓసారి వాడికి, ఉడతలు చూపొంచడానికి squirrel park కి వెళ్లి, రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాం.

అదే మన దేశంలో అయితే, పైసా ఖర్చు కాకుండా ఎన్ని ఉడతలు కనపడేవో కదా!! చిన్నప్పుడు వాడు అంతా గుడ్ బాయ్ లాంగుండేవాడు (నాలాగా?)కానీ, రెండు విషయాల్లో మటుకు సుత్తేసే వాడు. ఒకటి ఉదయం అంతా ఆడి, ఓ చిటికెన వేలు సైజు బొమ్మకున్న చీమ తలంత కాలో, చేయో పారేసి, రాత్రి పడుకునే ముందు, అది కావాలని మారాం చేసేవాడు. ఇక చూడండి, ఇల్లంతా, నేనూ, మా ఆవిడా గంటల తరబడి వెతకాల్సి వచ్చేది.

రెండోది ఎక్కడయినా ప్రయాణానికి వెళ్లే ముందు, “ఆ ఒక్క పని పూర్తి చేయరా" అంటే వినేవాడు కాదు. తీరా, మోటార్ వే మీదికి వెళ్లగానే, జలనృత్యం మొదలు పెట్టేవాడు .అక్కడేమో మనూర్లో లాగా, రోడ్డు ఆపి ఆ పని కానిచ్చే సదుపాయం లేదాయే. వీడివల్ల ఓ సారి, పోలీసులకి దొరికిపోయాం కూడా. “మోటార్ వే మీద కారు ఎమర్జెన్సీ వుంటేనే ఆపాలి" అని పోలీస్ నాకు క్లాస్ తీయబోయాడు. “అంతకంటే ఎమర్జెన్సీ ఇంకేముంటుంది నాయనా" అని తప్పించుకున్నాను. కావ్య ఇంగ్లాండ్ లో పుట్టింది. పిల్లల్ని పెంచడం, మన దేశంలో ఎంత సులువో, ఆ దేశాల్లో ఎంత కష్టమో, మాకు స్వానుభవంతో తెలిసివచ్చింది. ఇక్కడయితే ఆదర్శ్ చిన్నప్పుడు సహాయం చేయడానికి ఎంతమంది వుండేవారో! అక్కడ, అన్ని పనులూ భవానీయే చేసుకోవాల్సి వచ్చేది.నేను చేతనయినంత సహాయం చేయడానికి ప్రయత్నించే వాడిని. నిజం నమ్మాలి మీరు. FRCS పాస్ అవ్వడానికి పడ్డ కష్టం కంటే ఎక్కువ కష్టం పడి, కావ్య Diapers మార్చె వాడిని అడపాదడపా. కావ్యకీ, చిన్నప్పుడు ఆస్తిపరులలో ఘంటసాల పాడిన "చిట్టి అమ్మలూ, చిన్ని నాన్నలూ - మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు" అనే పాట తెగ ఇష్టం. ఎంత ఏడ్పులోనైనా ఆ పాట పెడితే ఆపేసేది. ఆఫ్ కోర్స్ ఘంటసాలకి బదులు నేను పాడడం మొదలు పెడితే, మళ్లీ గుక్కపట్టి ఏడ్చేదనుకోండి.

అది వేరే సంగతి. “లిటిల్ సోల్జర్స్" సిన్మాలో బన్నిగా నటించడానికి వాళ్ల పెద్దమ్మ (ప్రొడ్యూసర్)తో పాటు ఇండియా వచ్చినప్పుడు కావ్యకి మూడేళ్లు. కావ్య, ఆదర్శ్ ఇక్కడ, మేమిద్దరం అక్కడ. నాలుగు నెలలు నాలుగు యుగాల్లాగా గడిచాయి. తర్వాత కావ్య జాతీయ స్థాయిలో 'ఉత్తమ బాలనటి' అవార్డు గెలుచుకున్నప్పుడు ఆ బాధలన్నీ మరిచిపోయాం అనుకోండి. చాలామంది కంటే మేం అదృష్టవంతులం. పిల్లలిద్దరి బాల్యాన్ని, సంపూర్ణంగా అనుభవించాం, ఆస్వాదించాం, ఆనందించాం.

పాపం - చాల మంది తల్లిదండ్రులకి, ముఖ్యంగా డాక్టర్లకి, వృత్తిపరమైన ఒత్తిడి వల్ల పిల్లలకి దూరంగా వుండాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు పడే తపన వర్ణనాతీతం. జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం. వీళ్ళకి సుఖం పాలు ఎక్కువయిందనుకున్నాడేమో దేవుడు - కావ్యకి, 12 ఏళ్ల వయస్సులోనే కొంత అస్వస్థత వల్ల అంతులేని ఆందోళనకు గురయ్యాం. మళ్లీ ఆ దేవుడి దయవల్లే, కావ్యకి పూర్తిగా నయం అయి, మళ్లీ మామూలు మనిషయ్యింది.

మా అమ్మ ఓ సామెత చెపుతుంటుంది. “పుణ్యం కొద్దీ పురుషుడు - దానం కొద్దీ బిడ్డలు" అని. అలా అయితే, మేమిద్దరం, పూర్వజన్మలో గొప్ప దానాలు చేసి వుంటాం ఖచ్చితంగా. మళ్లీ వచ్చే జన్మంటూ వుంటే, ఈ పిల్లలే కావాలి. అందుకోసం ఈ జన్మలో ఎన్ని దానాలు చేయడానికయినా, మేం తయారుగా వున్నాం.