గూడు గుబులై పోయింది

గమ్మత్తుగా ఉంటుంది. ఒక చిన్ననాటి స్నేహితుడు ఏళ్ల తరబడి కనపడడు - వినపడడు. హఠాత్తుగా, రెండ్రోజుల్లో, నాలుగు చోట్ల తారసపడతాడు.. అలానే, ఒకే విషయానికి సంబంధించిన సంఘటనలు, వెంటవెంటనే ఎదురవుతాయి. మనసును తొలుస్తాయి. సోమవారం ఓ.పి. ఎప్పటిలాగే బిజీగా వుంది. డెబ్భై ఏళ్ల రెడ్డిగారు వీల్ చెయిర్ లో వచ్చారు. ఆయనకీ 'హిప్ ప్రాక్చర్' అయింది. ఆపరేషన్ చేయాలి. కానీ, ఆయనకీ నెల రోజుల కిందటే, గుండెలో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ వేశారు.

ఆ నేపథ్యంలో ఆపరేషన్ చేస్తే మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చి, ప్రాణ ప్రమాదమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ, ఆ రిస్క్ కుటుంబ సభ్యులకి చెప్పానని అన్నాను. “నాకెవ్వరూ లేరు. నేను రిస్క్ తీసుకోవడానికి రెడీ, నన్ను మళ్లీ నడిపించండి చాలు" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. తర్వాత, వెంట వచ్చిన డ్రైవర్ చెప్పాడు. “రెడ్డిగారి ముగ్గురు కొడుకులు, అమెరికాలో ఉన్నారని - తండ్రికి, తనయులకి మధ్య కొన్ని అగాదాలున్నాయని, నెక్ట్స్ ఆఫ్ కిన్ గా తనే సంతకం పెడ్తాననీ" ఆ రోజంతా గుండె బరువుగా అయిపొయింది.

ఇలాంటి ఒంటరి జీవితాలు ఎన్నో! పిల్ల (ట్ట)లు రెక్కలొచ్చి ఎగిరిపోయాక, గుండె దిగులై, గూడు గుబులైన బ్రతుకులు ఎన్నో!! ఇంగ్లాండ్ లో వున్నప్పుడు చాలాసార్లు చూశాను. వయసు మీద పడిన వాళ్ళు ఒంటరిగా ఉంటూ బాత్ రూమ్ లో పడి, హిప్ ప్రాక్చర్ అయి, కదల్లేక, అంబులెన్స్ కి ఫోన్ చేయలేక అలానే రోజుల తరబడి కృశించి, ప్రాణాలు కోల్పోవడం. మన దేశంలోనే అదృష్టం కొద్దీ ఇంకా అలాంటి దైన్య స్థితి రాలేదు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య బాంధవ్యాలు, పిల్లల బాధ్యతలు, పెద్దాళ్ళ ఆశలు, ఇద్దరి ఆలోచనా సరళిలో తేడాలు - ఇవన్నీ ఆలోచిస్తూ, ఆ సాయంత్రమే, బాపట్ల చేరాను. కోన ప్రభాకరరావు గారి స్మారక నాటకోత్సవాలకు ఆత్మీయ అతిథిగా. అక్కడ నన్ను కదిలించిన 'కానుక' నాటికలో కూడా ఇదే ఇతివృత్తం కావడం యాదృచ్చికం అనుకోవాలేమో!

పల్లెటూరి తల్లిదండ్రులు కష్టపడి కొడుకుని చదివిస్తారు. అమెరికా వెళ్ళి, బాగా సెటిల్ అయ్యాక – భార్యాపిల్లలతో, పల్లెకి వస్తాడు. సిన్మాల్లోలాగా బ్లడీ ఇండియా, డర్టీ ఇండియా అని కోడలు, పిల్లలు అంటారని ఊహిస్తాం. కానీ, ఈ నాటికలో అందరూ మంచివాళ్ళే. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ, గౌరవం ఉన్నవాళ్ళు. కానీ, అందరి మనుసుల్లో ఏదో వెలితి. తల్లిదండ్రులకేమో - పిల్లడు సుదూర తీరాలకి ఎగిరి పోయాడని, వార్ధక్యంతో ఒంతరితనం, బెంగ, దీన్నే 'ఏమ్టీ నెస్ట్ సిడ్రోమ్' అంటారు. తెలుగులో చెప్పాలంటే 'రెక్కలొచ్చి పిట్టలెగిరిపోయాక, బావురుమనే గూడు' విషయం అన్నమాట. కొడుక్కేమో - ఎంత సంపాదించి, ఎన్ని మెట్లెక్కినా అమ్మా, నాన్నకి దగ్గర లేనే, వాళ్ళకిచేదోడు అవసరమైన వయస్సులో, చాలా దూరానికి వెళ్ళిపోయానే అనే బాధతో కూడిన తపన, కానీ పరుగు తప్పదు జీవితంలో.

ఈ మానసిక వ్యాకులతని, ఆ పాత్రల అంతర్ముఖాన్నీ అద్భుతంగా నాటకీయం చేశాడు దర్శకుడు. కొడుక్కి పదే పదే బాల్యం గురించి గుర్తొచ్చే స్మ్రతుల్లో పాలగుమ్మి విశ్వనాథం విరచితమైన 'అమ్మదొంగా - నిన్ను చూడకుంటే నాకు బెంగ' అన్న పాట. వాళ్ళమ్మ చక్కటి గొంతుతో పాడుతూంటే ఆ పాట, అమెరికాలో కూడా, అతనికి హాంటింగ్ మేలోడిగా వుండిపోతుంది. రైలెక్కిపడుకున్నానేగానీ, చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు. గుండె అంతా బరువు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేస్తారో! పిల్లలు భవిష్యత్తు కోసం దూరతీరాల పయనం సహజమేనా? లేక గుద్ది దీపంతోనే ఉండిపోవాలా? ఏది సమ్మతం? ఏది సత్యం? ఏది అనివార్యం? ఏది ఆచరణీయం?? మా అమ్మ అంటూంటుంది.

“ఇంగ్లాండులో ఉన్నప్పుడే నాతో ఎక్కువ గడిపే వాడివి, సెలవుల కొచ్చినప్పుడన్నా. ఇప్పుడు మరీ నల్లపూస అయిపోయావురా" అని. నిజమే. నాది చాలా బిజీ జీవితమే. అయినా, అమ్మానాన్నల కోసం టైం లేదా నా దగ్గర? లేక ప్రయార్టీస్ మారాయా? వాళ్ళు నా దగ్గర్నుంచి ఏమీ అడగరే - కాస్తంత సమయం తప్ప. నాలాగా, ఈలాంటి మీమాంసలో పడి కొట్టుమిట్టాడే కుమారా రత్నాలు కోట్ల మంది ఉండుంటారు. నా జీవన గమనంలో రెండు రకాలైన పిల్లలూ తారసపడ్డారు. కొంత మంది, ఎన్నో అవకాశాలని వదులుకుని, ఆశలను చంపుకుని, తల్లి తండ్రులకి సేవ చేసుకుంటూ ఉండిపోయారు.

మరి కొంత మంది, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, అద్భుతమైన విజయాలని సొంతం చేసుకుంటూ, ఒక్కో గోల్ కొట్టుకుంటూ తల్లిదండ్రులకు చాలా దూరం వెళ్ళిపోయారు. ఇద్దరికీ తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు ఉన్నాయనే విశ్వసిస్తాను నేను. ఈ ఇద్దరిలో నేనెవర్ని? బయట రైలు ఇంజను రొద. లోపల గజిబిజి ఆలోచనల సొద. అంతలో గుంటూరొచ్చింది. దిగిపోయి, అమ్మా, నాన్నలని చూసి వెళ్దామని మనసు తహతహలాడింది. కాని మర్నాడు, హైదరాబాద్ లో రెండు మీటింగ్స్, మరి కొన్ని పనులు ఉండిపోయాయి మళ్లీ అదే మీమాంసం. అదే చర్చ.

అదే తికమక, గుండెలో పొంగే కోరిక తీర్చాలా? లేక మెదడు నియంత్రించిన బాధ్యతలను ఆచరించాలా? చివరికి, ఎప్పటిలాగే ప్రాక్టీకాల్టీ గెలిచింది. రైలు వేగం పుంజుకుంది. నేనూ, నా ఆలోచనలూ అతివేగంగా అమ్మానాన్నల నుంచి దూరంగా జరిగిపోయాం. దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తల్లిదండ్రులందరికీ, ఇంద్ర ధనుస్సుల వేటలో, మీనుంచి భౌతికంగా దూరమైనా, మా అందరి మనస్సులో, మీ పై అవాజ్యమైన ప్రేమానురాగాలు పదిలంగా వున్నాయని విన్నవించుకుంటూ - ఎగిరిపోయిన పిల్లలందరి తరుపునా, నా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను.