నేను డాక్టరీ ఎందుకు చదివానంటే?

సిన్మా హీరోలా, నాకు ఆరేళ్ళప్పుడు సంగతులు ఏవీ గుర్తులేవు. జబ్బుపడ్డ చెల్లెలు అంతకంటే లేదు. మరి నేనెందుకు డాక్టర యినట్లు?! మొదట్లో ట్యూబ్ లైట్ కోసం, తర్వాత గ్లామర్ కోసం. నా చిన్నప్పుడు మా బోంట్ల మధ్యతరగతి ఇళ్ళల్లో రాత్రులు బల్బుల సాయంతో వెలిగేవి.

ఆ 40 వాట్ల కిర్సనాయిలు లాంతరు కంటే కొంచెం అటూ, ఇటూగా ఉండేవి. అదే బయట బజార్లో, సిన్మాహాల్లో ట్యూబ్ లైట్లు వుండేవి. వాటి వెలుగు తెల్లగా, దివ్యంగా వుండేది. ఆ రకంగా ఆ రోజుల్లో బల్బులు దిగులుతనానికి, ఇరుకుతనానికి, గుర్తుగా, ట్యూబ్ లైట్లు ఆహ్లాదానికి, ఆనందానికిప్రతీకగా నా మనసులో నిలిచిపోయాయి.

అలాంటి రోజుల్లో ఓ సారి, బాపట్లలో పెద్ద డాక్టరయిన యార్లగడ్డ కృష్ణమూర్తి గారి హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. విష జ్వరంతో కాదులెండి. ఆ కన్సల్టింగ్ రూం నాకింకా గుర్తుంది. చుట్టూ తెల్లని గోడలు, వాటి మీద అందమైన బుడతల బొమ్మలు (మర్ఫీ రేడియో కాలెండర్ అనుకుంటా) తెల్లటి పాల నురగలాగా కాంతులీనుతూ రెండు ట్యూబ్ లైట్లు మధ్యలో చిరు మందహాసంతో డాక్టరుగారు. డాక్టరయితే ఇలాంటి అద్భుతమైన వాతావరణం సొంతం చేసుకోవచ్చన్న మాట-

ఒక రూమ్ లో రెండు ట్యూబ్ లైట్లు పెట్టుకోవచ్చన మాట” ఈ అమాయక ఆలోచనే నా మొదటి ప్రేరణ. మా అమ్మకూడా, తనకు క్షయ, క్యాన్సర్ లాంటి సిన్మా రోగాలేవీ లేకపోయినా, నేను డాక్టరవ్వాలనే కోరిక వుండేది. నా ట్యూబు లైటు ప్రేరణతోటి, మా అమ్మ కోరికతోటి, నేను రిక్షా తొక్కకుండానే, పెరిగి పెద్దవాడినయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, ఎంబిబిఎస్ ఎంట్రన్స్ కోచింగ్ కని గుంటూరు రవి కాలేజీలో దిగిపోయాను. మా రోజుల్లో మెడికల్ కాలేజీలో చేరాలన్న దురాశ వున్న ప్రతి ఒక్కరి గమ్యం రవి కాలేజీకే. సివిఎన్ ధన్ గారు ప్రిన్సిపాల్. విశ్వనాథన్ అనే సున్నితమైన పేరును కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేందుకు వీలుగా, ‘ధనా ధన్’గా మార్చుకున్న ఈ చీఫ్ జైలర్ విగ్రహం చూడాల్సిందే.

కంఠం వినాల్సిందే. రాయ నా తరం కాదు. ఆరడుగుల ఎత్తు నిమ్మకాయ నిలబెట్టగలిగే గుబురు మీసం, చేతిలో ఓ లాఠీ, “ఒరేయ్ నిన్న క్లాస్ కి రాకుండా ఎక్కడ చచ్చావురా” లాంటి లలిత పదజాల ప్రయోగం – ఓహ్- మెడిసిన్ కోసం కాకపోయినా, ఈయన్ని చూడడానికన్నా రవి కాలేజీలో చేరాల్సిందే. బయట బండలు, లోపల పగిలే ఈ మండు టెండల్లో గుంటూరు, బ్రాడీపేట నాల్గవ లైను సందడిగా మారిపోయేది. ఆ రెండు నెలల పాటు రకరకాల లఘు పరిశ్రమలకు ఆటపట్టు అయ్యోది.

ఉదాహరణకు ఈ కాలేజీ బయటే, ఓ ప్యూచర్ అంబానీ ఓ చిన్న బిజినెస్ పెట్టేవాడు. ప్రతి ఏడూ ఓ చాపా, ఓ పీపా(కుండ), ఓ ప్లాస్టిక్ బకెట్, ఓ మగ్, ఓ దిండు, ఓ దుప్పటి – అన్నీ చాపలో చుట్టి అమ్మేవాడు. అక్కడో పెద్ద క్యూ ఉండేది. ఇంకో చోట క్యూ చాలా గమ్మత్తుగా వుండేది. అది గీతాకేఫ్ లో. రాత్రి భోజనం వేళలో మాలాంటి కౌబాయ్ డాక్టర్ల జనమేమో వేలల్లో. అక్కడ బల్లలేమో వందకంటే తక్కువే. ఒకడు తింటుంటే, వాడి వెనకే నల్గురయిదుగురు క్యూ. అఅంటే ముందు భోజనం, వెనక జనం అన్నమాట. అలా “గీతా’ కేఫ్ లో పంక్తి భోజనం, ధన్ తోటి తిట్ల ఫలహారం, మండుటెండల్లో చెమటల హాహాకారం- ఇన్ని కష్టాల్లో నాకళ్ళేప్పుడు ఇద్దరి కోసమే ఎదురుచూస్తూ వుండేవి.

అప్సర, అశ్విని కోసం. ‘కళాపోషణ ఇంత చిరుత ప్రాయం నుంచేనా గురూ’ అని మీరు నా పాతివ్రత్యానికి మచ్చు ఆపాదించ వలదు. గుంటూరు మెడికల్ కాలేజీ హాస్టల్ లో బస్సుల పేర్లవి. అప్సర, అశ్విని, నాకయితే అవి ఇంద్రలోకం నుంచే వచ్చినట్లు, దాంట్లో వున్న వాళ్లందరూ దేవతలే అయినట్లు అనిపించేది. కానీ కాలేజీలో చేరిన తర్వాత కానీ తెలియలేదు. అవి దేవతలా రథాలు కానే కావని కనీసం కొత్త బస్సులన్నా కాదని, తోయకపోతే తప్ప స్టార్ట్ అవ్వని ముసలి శకటాలని. ముందే చెప్పాగా ఎంబిబిఎస్ లో చేరడానికి నా రెండో ప్రేరణ గ్లామరని... అది తెల్లకోటు గ్లామరు. అసలు ఆ తెల్లకోటు కోసమే, వీర ప్రయత్నాలు చేసి, చివరకు సీటు సాధించాను.

ఆరోజు బాగా గుర్తు. బాపట్ల పోస్ట్ ఆఫీసుకు వెళ్లాను, చలాను కట్టడానికి. కాలు నేలమీద ఆనడం లేదు. కళ్లు నెత్తికెక్కి చాలా రోజులయింది. బాపట్లలో జనం అంతా నా లెవల్ కి తక్కువగా కనబడుతున్నారు. లాగులో వున్న ఓ బక్క అర టిక్కెట్టు గాడు, నా దగ్గరకు వచ్చి “సార్ – మీకు ఎంబిబిఎస్ సీటు వచ్చిందట కదా- మీరేనా గురువారెడ్డీ!” అని అమాయకంగా అనాగరికంగా అడుగాడు.

వాడిని ‘ఓ చీమ కిందో, దోమ కిందో చూస్తూ ‘ఎస్, నేనే ఆ నెంబర్ వన్’ అని బరువైన డైలాగ్ వదిలాను. ‘నాక్కూడా సీటు వచ్చింది సార్’ అని ఆ సదరు క్షుద్ర బాలుడు వేసిన తిరుగు డైలాగుతో, మయసభలో దుర్యోధనుడు భంగపడిన దానికంటే ఎక్కువ పడి, ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. నేనెక్కడ? విడెక్కడ? కనీసం ప్యాంట్లన్నా వేసుకునే వయసూ, సొగసూ లేని ఈ అల్పజీవితో కలిసి నేను ఎంబిబిఎస్ చదవాలా?!” ఇలాంటి ఆలోచనతో అహంకారంతో కాలేజీలో చేరాను.

ఇంతకీ ఆ అరటిక్కెట్టు ఎవరో తెలుసా? కాలేజీలో వాడి బుర్రతో అందరినీ అదరగొట్టి, పెద్ద పెద్ద ఎండి, డిఎం డిగ్రీలు సంపాదించి, మా అందరి కంటే ముందుకు దూసుకెళ్లి, విజయవాడలో న్యూరాలజీస్టుగా, సూపర్ ప్రాక్టీసు చేస్తూ, ఎంతో మంది బీదవాళ్లకు ఫలాపేక్ష లేకుండా క్యాంప్స్ ద్వారా సేవ చేస్తూ ‘బ్రదర్ థెరిస్సా’ అని పిలవబడే, గోపాళం శివనారాయణ. (ఇప్పుడు డైలాగులు తప్ప లాగులు మానేశాడు లెండి) మొదటి రోజు తెల్లకోటు వేసుకున్నప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం.