విష(మ) పరీక్షలు

పది పదిహేను రోజుల క్రితం కావ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు వచ్చాయి. 94 శాతం వచ్చాయి అన్ని సబ్జెక్టులు కలుపుకొని. హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి, తెగ ఆనందపడిపోతూ కంగ్రాట్స్ చెపితే ఆ పుల్లకుంక 'ఏంటి నాన్నా? వెక్కిరిస్తున్నావా? నేను దిగులుగా వుంటే...' అంది. తన ఫ్రెండ్ కి 97 శాతం వచ్చాయట. తనకి తక్కువ వచ్చాయని, మళ్లీ రీకౌంటింగ్ పెట్టించాలని చెప్తోంది. నాకు కాసింత సేపు అర్ధం కాలే. 94 శాతం మార్కులు తక్కువ అయిపోయాయా ఈ రోజుల్లో. నేను చదువుకునే రోజుల్లో 65 శాతం మార్కులొస్తే వాడు పులి.

70 మార్కులోచ్చాయా వాడు 'పులిరాజు'. ఎందుకిలా అయిపోయారు పిల్లలు. ప్రతి రంగంలోనూ, సక్సెస్ ని నిర్దేశించే కొలమానాలు మారిపోతున్నాయి నిజమే. కానీ, 'వందకి వందా రావాలి. అదే గొప్ప. రెండు మార్కులు తగ్గినా అది ఓటమే' అన్న భావం ఎందుకింతగా నాటుకు పోయింది ఈ కాలం పిల్లల్లో. వర్షం వస్తే చూరు కారి సెలవు ప్రకటించే సీతారామయ్య బళ్ళో చదివిన నాకు అర్ధం కాకపోవచ్చు. ఈ రోజుల్లో మంచి బళ్ళో సీటు దొరకడం కోసం తల్లిదండ్రులు పడే పాట్లు. కాకపోతే ఇరవై ఏళ్ల క్రితం పూనాలో కొంత అర్ధమయింది.

ఓరోజు హాస్పిటల్ నుంచి వస్తుంటే సాయత్రం ఆరు గంటలకి, ఓ చోట పెద్ద క్యూ కనపడింది. 'ఏమిటా'అని విచారిద్దును కదా. మరునాడు ఆ సదరు బళ్ళో ఒకటో తరగతిలో చేరడానికి దరఖాస్తులిస్తారట.. అందుకని రాత్రంతా జాగారం చేస్తూ, తల్లి దండ్రులు క్యూ కట్టారు!! పరీక్షలంటే అందరికీ భయమే. అది సహజం. కానీ ఈ భయం చావు భయం కాకూడదు. 2006 సుమారు ఆరువేల మంది పిల్లలు ఆత్మహత్యలు చేరుకున్నారని ఓ సర్వే తేల్చింది. దీనికి కారణం పరీక్షల్లో 'తక్కువ' మార్కులొచ్చాయని, రావలసిన కాలేజీలో సీటు రాలేదని. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు 'చదువులా! చావులా!!' అనే గొప్ప పుస్తకం రాశారు.

ప్రతి తల్లిదండ్రీ చదవాలీ పుస్తకాన్ని. ఆయన ముందీ పుస్తకానికి 'పద్మవ్యూహంలో' పిల్లలు' అన్న టైటిల్ పెట్టుకున్నార్ట. కానీ ఓ పదోతరగతి పిల్ల 'చదువులా, చావులా' అన్న టైటిల్ బాగుంటుందని సలహా ఇచ్చిందట. అంటే, ఆ పిల్ల మనోఫలకంలో, చదువు మీద ఎంత కౄరమైన భావోద్రేకం నిండి వుందో గమనించాలి మనం. నామినిగారి ఆ పుస్తకంలో ఓ అధ్యాయం 'తల్లీ, దండ్రీ, గురువూ - ఈ మూడు దయ్యాల భాష' అనే శీర్షికతో మొదలవుతుంది. 'చదువులో పస లేదు కానీ సోకులకేం కొదవలేదు. ఆ సుజాతను చూడు - పుట్టుక అంటే అదీ! ఆ పిల్ల చదివే స్కూలే కదా నువ్వూ చదివేది. నీ తలకాయలో వుండేది బంకమట్టి కదా....” ఇది ఓ తల్లి భాష్యం.

'కన్న నేరానికి టెన్త్ ఫేయిలవగానే, దీనికి ఎవణ్ణో ఒక వెధవను చూసి తగిలించేస్తే సరిపోతుంది' ఒక తండ్రి సుభాషితం. 'అమ్మా తల్లీ! నీ కథ నాకు తెలుసు. నువ్వు ఒక్క ఫార్ములా కూడా నేర్చుకోలేవు. నీకు పవన్ కళ్యాణ్ మీద వుండే శ్రద్ధ సబ్జెక్టు మీద లేదు' ఒక గురువుగారి ప్రవచనం. 'ఇది దెయ్యాల భాష, మనుషులు మాట్లాడకూడదు. అందుకనే ఈ పుస్తకం' అంటూ కొసమెరిపిస్తారు నామిని. పిల్లల మీద ఇలాంటి ఒత్తిళ్లకు ముఖ్య కారకులెవరు? తల్లిదండ్రులే మొదటి ముద్దాయిలు.

పిల్లలు బాగా చదవాలని కోరుకోవడంలో తప్పులేదు. తల్లిదండ్రులు ప్రేమతో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎంత అవసరమో నచ్చజెప్పాలి. దీనికై కృషి చేయమని హితవు చెప్పాలి. అంతేగాని, తోటి పిల్లల్తో పోటీ పెట్టడం, తప్పడం నేరమని, తప్పితే ఇక జీవితమే దండగ అని ఇత్యాది 'దెయ్యాల పనులు' చేయడం మహా పాపం. పరీక్షల్లోనూ, జీవితంలోనూ తప్పడం అనేది సహజం ఏదో ఒకసారి. ఆ మాటకొస్తే 'జీవితంలో తప్పులు లేవు' ఉన్నవన్నీ పాఠాలే' అన్నాడు ఓ జ్ఞాని. పరీక్షలకు, ఫలితాలకూ, అనారోగ్యకరమైన ప్రాముఖ్యతనిచ్చి, పిల్లలని ట్యుటోరియల్ కాలేజీలు అనబడే సెంట్రల్ జైల్స్ లో పడేయడం అమానుషం.

గవర్నమెంటు ఉద్యోగి అయిన నా స్నేహితుడొకడు, ఈ మధ్యే 'ఓ ఆరునెలలు మెడికల్ లీవుకి సర్టిఫికేట్ కావాలి' అంటూ వచ్చాడు. 'ఎందుకురా' అని వాడి సమాధానం విని షాక్ అయ్యాను, వాడు కొడుకు నైన్త్ క్లాస్ లో వున్నాడు, వాడికి నాల్గేళ్ల తర్వాత ఐఐటిలో సీట్ కోసం రామయ్య కాలేజీలో చేరాలట. ఆ రామయ్యలో సీటు సంపాదించటానికి 'సుబ్బయ్య' కోచింగ్ సెంటర్ లో చేరాల్ట. ఆ సదరు 'సుబ్బయ్య'లో సీటు సంపాదించటానికి 'వెంకయ్య' దగ్గర ట్యూషన్ అవ్వాల్ట.

ఆ వెంకయ్య ఉదయం మూడు గంటల నుంచి మొదలు పెడ్తాడట. కాబట్టి, మావాడు ఆరునెలలు సెలవు పెట్టి, వెంకయ్య ఇంటి దగ్గరగా ఇల్లు మారి, కొడుకుని చదివించడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాడు. పాత రోజుల్లోలాగా పిల్లలు ఎండాకాలం సెలవులు, ఆటలు, పాటలు అన్నీ మరిచిపోయారు. తల్లిదండ్రుల జీవితాలన్నీ పిల్లల పరీక్షల చుట్టే తిరుగుతున్నాయి. పిల్లలు ఎంసెట్, అమ్మానాన్నలు అప్ సెట్. ఎక్కడో చదివాను. “Colleges are the places where pebbles are polished and diamonds are dimmed” అని. ఇప్పటి కాలేజీలు ఇంకా ఘోరం. నామిని అన్నట్లు ఓ కోళ్ల షెడ్డుంటే చాలు, కాలేజీ కింద మార్చడానికి, సౌకర్యాలు నాస్తి. ఓ ఆటస్థలం నాస్తి.

ఇరవై మందికి కలిపి ఓ టాయిలెట్. సగం మంది పిల్లలు మలబద్దకం, నడుంనొప్పి మానసిక ఒత్తిడితో నరకయాతన పడ్తుంటారు. నామిని అన్నట్లు 'పిల్లలు చదువుకుని ర్యాంకులు తెచ్చుకోకుంటే వాళ్ల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళన చెందే లక్షలాది తల్లిదండ్రులారా! మీ ఆందోళన కాస్త కట్టి పెట్టండి' పిల్లలు పెద్దయ్యాక బతకలేకుండా పోరు. వాళ్లకి ప్రేమ, ఆత్మస్థైర్యం, కాలు తడబడినా నిలవరించుకొని, జీవితం మెట్లు ఎక్కగల గుండె దిటవూ అందించండి. అప్పుడు వాడె ఒక్కో గోలు కొట్టుకుంటూ, చాలా ఎత్తుకి ఎదుగుతాడు. దయచేసి వాడిని, విష(మ) పరీక్షలకు గురి చేయకండి.