Rating:             Avg Rating:       838 Ratings (Avg 2.98)

పాటలా బ్రతుకు సాగితే చాలు...

ఈరోజుల్లోనే, “వట్టి పాటలేనా ప్రేమించేదేమన్నా వుందా” అనుకుంటూ ఓ సిటీ పిల్ల ప్రభంజనంలా నా జీవితంలోకి వచ్చేసింది. మనకు అప్పటిదాకా, తెలుగు, అడపాదడపాహిందీ పాటలు మాత్రమే పరిచయం. ఇంగ్లీష్ పాటల మాధుర్యం తెలియని ఎర్రబస్సు గాడిని. ఈ పిల్ల ఉదయ్ శంకర్ హోటల్ లో ఫ్రూట్ సలాడ్ పెట్టించి, పరిచయం చేసింది.

అక్కడితో ఆగక, హైదరాబాద్ వాళ్లింటికి లాక్కెళ్లి, గ్రాంఫోన్ రికార్డ్ వినిపించేది. సాన్యోలో విన్న పాటలకి, అదిరిపోయే సౌండ్ క్వాలిటి వున్న ఈ ‘మట్టి’ రికార్డ్స్ పాటలకీ, కాకా హోటల్ కి, ఫైవ్ స్టార్ హోటల్ కి వున్న తేడా వుండేది.

“తారలెంతగా వేచేనో చందురుని కోసం” అనే రఫీ పాట ఇక్కడ విన్నదే. ‘చల్తే చల్తే’ లో పాటలూ ఇక్కడ విన్నవే. ఇలా ఆ పిల్ల పెట్టిన ఫ్రూట్ సలాడ్ లు తింటూ తింటూ వినిపించిన పాటలు వింటూ వింటూ, ప్రేమలో పడిపోయాను. ఆ పిల్లే నా అర్ధాంగి భవాని. పెళ్లయిన తర్వాత “ఏవీ ఆ రికార్డులు?” అని అడిగితే.. “అవిప్పుడు అవుట్ ఆఫ్ ప్యాషన్ మొగుడా – నీకు సీడీలు కొనిపెడ్తాలే” అని ఓదార్చడం ఇంకా గుర్తే. మెడికల్ కాలేజీలో వున్నప్పుడు కమల్ హాసన్ హవా నడుస్తూ వుండేది. ‘వయసు పిలిచింది’, మన్మధలీల’, సొమ్మొకడిది సోకొకడిది’, ‘మరో చరిత్ర’, ‘అంతులేని కథ’, ‘ఇది కథ కాదు’, ‘సాగర సంగమం’, ఎర్రగులాబీలు’, ‘స్వాతిముత్యం’, అన్నీ కళాఖండాలే. వయసు పిలిచిందిలో ‘మబ్బే మసకేసిందిలే’ పాట ఊపుకి, సాగర సంగమంలో ‘మౌనమేలనోయి’ కైపుకి ప్రతీకలుగా మా అందరి నోళ్లలో నానుతూ వుండేవి.

రాత్రి పదింటికి, అప్పటి నుంచి ఇప్పటిదాకా అంచలంచ సంగీత భక్తుడిగా నీరాజనం చేసుకునే ప్రోగ్రామ్ ఛాయాగీత్. ఆ మధురమైన పాటలు, మధ్యలో తేనెలూరే వ్యాఖ్యానం – రాత్రి ప్రశాంతతలో వింటుంటే, తాదాత్మ్యం, తన్మయత్వం. తర్వాత పూనెలో. అక్కడ తెలుగు పాటలు దొరికేవి కావు. టివిలో దూరదర్శన్ లో హిందీ పాటలు వచ్చేవి. దేవానంద్ మెడని ఓ పక్కకి విరగ దీసుకుని ‘ప్యార్ కా గీత్ సునో’ అని పాడుతుంటే, తెగ సంతోషం వేసేది. అప్పుడే థిన్ క్యాసెట్ టేప్ రికార్డర్ వచ్చింది. ఒక టేప్ ని ప్లే చేయడం – దాంట్లో సెలక్టేడ్ సాంగ్స్, ఇంకో టేప్ లో రికార్డ్ చేయడం – నా కుటీర పరిశ్రమ. అప్పట్లో అలా కల్ల పాటలు, మనసు పాటలు, వెన్నెల పాటలు రికార్డ్ చేసేసి, సంగీత కళామతల్లికి నా వంతు సేవ చేస్తున్నట్లు ఫీల్ అయ్యే వాడిని. ఆదివారాల్లో ‘మహాభారత్’ వచ్చేది టివిలో. రోడ్లన్నీ నిర్మానుష్యం. పెళ్లిళ్లు, వేరే ఫంక్షన్లు ఏవీ ఆ టైమ్ లో పెట్టేవాళ్లు కాదు. అంత ఊపేసింది జనాన్ని. సిడి విన్నది మొట్టమొదటి సారిగా ఇంగ్లండ్ లో. ఇంగ్లండ్ వెళుతూఓ పెట్టెలో బట్టలు, ఓ పెట్టెలో casette లు మోసుకెళ్ళాను. Tape నలిగి, అలిగి A side పాట, B side పాట కలిసిపోయి అరవ యుగళ గీతంలా వినబడే రోజుల్లో – అద్భుతమైన clarity ఉన్న CD లు వినేసరికి మనసు చెదిరిపోయింది. అదృష్టం కొద్దీ – అప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుని, సిడి ప్లేయర్ కొనుక్కోగలిగే పరిస్థితి ప్రసాదించాడు దేవుడు. 1990 లో కొన్ని సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఇప్పటికీ నా దగ్గర వుంది. మర్ఫీ రేడియోతో మొదలైన బ్రతుకు ఇన్ని మజిలీల తర్వాత ఐపాడ్ దగ్గర ఆగింది. నా అదృష్టం కొద్దీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో ప్రాక్టీసు పెట్టాక – ఎంతో మంది గొప్ప కళాకారులతోటి, కళా పోషకులతోటి పరిచయాలు అయ్యాయి. శాంతా బయోటెక్ అధినేత, పద్మభూషణ్ పరప్రసాద్ రెడ్డిగారు ‘హాసం’ పత్రిక నడుపుతున్నప్పుడు పరిచయం అవ్వడం నా సుకృతం. ఆయన సాన్నిధ్యంలో నేను, తెగ ఆరాధించే బాపు గారితో, ఎస్పీ గారితో కలిసి భోంచేసాను.గుండెలో పదిలంగా దాచుకునే క్షణాలు అవి. సకల కళలలో ఆరితేరిన మృణాళినిని పరిచయం చేసింది కూడా ఈ కృష్ణదేవరాయలే.

సుతి మెత్తని మల్లెపూవు లాంటి కవిత్వం, సంగీతం కలగలిపి అందించే కలగా కృష్ణమోహన్, అలాంటి మల్లెపూలని తేనెదారాలతో అల్లి, గొంతులో మార్దవం పలికించే గాయని సురేఖా మూర్తి. వరప్రసాద్ గారి ద్వారా లభ్యమైన పరిచయాలే. కలగా, సురేఖ, ఎస్పీ గార్లతో వరప్రసాద్ గారు రెండు అద్భుతమైన సిడిలు తెచ్చారు. ‘ఎక్కడిదీ ఇంత హాయి’, ‘కాలం చిరుకొమ్మ మీద’ అనే CD లు తెలుగు సాహిత్యంలో, సంగీతంలో లాలిత్యాన్ని వెదుక్కునే ప్రతి సంగీతాభిమాని వినాల్సిన పాటలు ఇవి. ఎంఎస్ రామారావు పాడినట్లు, ప్రశాంత, ఏకాంత సౌధంలో వినాల్సిన పాటలివి. నా తోడల్లుడు గుణ్ణం గంగరాజు సిన్మ మనిషి అవ్వడం వల్ల (లిటిల్ సోల్జర్స్, ఐతే, అనుకోకుండా ఒకరోజు, అమ్మచెప్పింది) ఆయన ద్వారా నేను ఆరాధించే సిరివెన్నెల గారి పరిచయం మరో పూర్వజన్మ సుకృతం. ఆయన తన పుట్టినరోజు రాత్రి మా అందరికీ పంచిన కవితా కుసుమాల హారాలు ఎన్ని జన్మల పుణ్యఫలమో! అలాగే ‘జాము రాతిరి జాబిలమ్మ’, ‘తుమ్ మిలే’ లాంటి హాంటింగ్ మెలోడీస్ ని, ప్రతి ఏడాదీ అందించే కీరవాణి నా బంధువు అవడం – నా అదృష్టం, ఆనందం, గర్వ. సర్జన్ జీవితం

ఎన్నో టెన్షన్ లకు ఆలవాలం. ఆ ప్రెజర్ కుక్కర్ ప్రపంచంలోకి అడపాదడపా వీచే ఈ సాహిత్య, సంగీత తెమ్మెర గాలులే నాకు ఆక్సిజన్ అందిస్తాయి. అందుకే, ఏ మూల పాట కచేరీ వున్నా, ఏ నేల సాహిత్య సభ వున్నా అక్కడ వాల్తాను. నా అభిరుచి తెలిసి, చాలా మంది స్నేహితులు, కొత్తగా అచ్చయిన తెలుగు పుస్తకాలు పంపుతూ వుంటారు. అలా పోయిన వారమే నాకందిన ఓ పుస్తకం గురించి ముచ్చటించి ముగిస్తాను. ఆంధ్రజ్యోతిలో నిన్న మొన్నటిదాకా పనిచేసి ఇప్పుడు సాక్షిలో ఉన్న మహమ్మద్ ఖదీర్ బాబు ‘మన్చాహే గీత్’ అనే తెలుగు పుస్తకంలో హిందీ పాటలు, ప్రసిద్దుల పరిచయాలు రాశాడు. ఆయన పద లలిత్యానికి ఓ ఉదాహరణ... “గాయం చేయని వాడు అసలు గాయకుడే కాదు, మనల్ని వెంటాడి వేధించడం చేత కానిది పాటా కాదు. దిగుళ్లతోనో, మనసు గుబుళ్లతోనో, వెన్నెల రాత్రుళ్లలోనో, ఒంటరి సాయంత్రాలలోనో, ఏ వ్యపకమూ లేని అనుత్సాహకర సమయాలలోనూ ఆత్మీయంగా మన ఒళ్లంతా తడిమి సేద దీరుస్తుంటాయి. జోల పాడుతాయి. నిద్ర పుచ్చుతాయి” అలాంటి పాట వింటూ, వినిపిస్తూ, చివరిదాకా పాటలా బ్రతుకు సాగితే చాలు.