అప్పు తీసుకునువాడు వైద్యుడు

అసలు 'అప్పు' అంటే ఏమిటి అన్న ప్రాథమిక ప్రశ్న తరచు ఉదయిస్తూ ఉంటుంది నా బుర్రలో. కాకపొతే ఈ మధ్యే సమాధానం దొరికింది. ముని మాణిక్యం నరసింహారావు గారు రాసిన "అప్పులు చేయడం - తీర్చడం" అనే పుస్తకంలో. 'మనకు ఏదో అవసరం కలిగినప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి గానీ, గ్రామస్థుల నుంచి గాని, లేక ఓ బ్యాంక్ లాంటి సంస్థలో గానీ మళ్లీ ఇస్తామనే భ్రమ పెట్టి, తీసుకొనిన ధనమునకు గాని ధనేతరమునకు గాను 'అప్పు' అని పేరు' అని. ఆహా! ఎంత గొప్పగా చెప్పారు మునిమాణిక్యం గారు. పై నిర్వచనంలో నాకు తెగ నచ్చింది 'మళ్లీ ఇస్తామనే భ్రమ పెట్టి' అన్న వాక్యం.

అప్పులు చేయని వాళ్లు చాలా తక్కువ మంది వుంటారేమో! నన్నడిగితే ప్రతి వాడికీ కొద్దోగొప్పో అప్పు వుండాలని తీవ్రంగా వాదిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో అప్పు తీరిందంటే టపా కట్టేసే సమయం వచ్చిందన్న మాట. ఇంకో ముఖ్యమైన విషయం - మనం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేది మనకు అప్పు ఇచ్చిన వాళ్లే. కాబట్టి, మనం ఆరోగ్యంగా వుండాలంటే, కనీసం రెండు మూడు చోట్లన్నా అప్పు చేయడం ఎంతైనా ఆరోగ్యకరం. దేవుడి దయవల్ల, నాకు చిరుత ప్రాయంలోనే, ఈ కళ అబ్బింది. ముళ్లపూడి నుంచి మునిమాణిక్యం దాకా పుస్తకాలు రాసేసారు 'అప్పులు ఎలా చేయాలి? ఎవరి దగ్గర చేయాలి? ఎలా ఎగ్గొట్టాలి' అని.

కాని నేను ఈ పుస్తకాలు ఏవీ చదవనక్కర్లేకుండానే బోల్డంత అనుభవం సంపాదించాను అని వినమ్రంగా చెప్పుకుంటున్నాను. బాపట్ల మాయా బజరులో, సీతారామయ్య బళ్లో చదువుతున్నప్పుడు బఠానీలు అమ్మే అవ్వ దగ్గర, నా అప్పుల ఆరంగ్రేటం జరిగింది. అర్ధ రూపాయి అప్పర్ లిమిట్. వారం రేజులు లోన్ పీరియడ్. అవ్వ చాలా స్ట్రిక్ట్గా వుండేది. తర్వాత హైస్కూలులో ఖర్చులు పెరిగాయి. దాంతో అప్పులు కూడా పెరగక తప్పదు కదా! ముఖ్యంగా రెండింటి కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. ఒకటి బజ్జీలు తినడానికి, రెండోది తన్నులు తినకుండా వుండడానికి.

ఈ సందర్భంగా మీ అందరికీ పనికొచ్చే ఓ అద్భుతజీవిత సత్యాన్ని మీతో, అప్పేమీ అడక్కుండా పంచుకోబోతున్నాను. వీలైనంత వరకూ అమ్మాయిల దగ్గర అప్పు చేయాలి. ముందస్తుగా అమ్మాయిలు చాలా మంది, సున్నిత హృదయం కలిగి వుంటారు. సో! మన కష్టాలు వినగానే వాళ్ల గుండెలు, మొహమాటం లేకుండా కరిగిపోతాయి. రెండోది అమ్మాయిల దగ్గర దాచుకున్న డబ్బులు చాలా వుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన ఇంకో సదుపాయం ఏమిటంటే - 'తిరిగి ఎప్పుడిస్తావ్' అని అడగనే అడగరు. ఈ సదరు విజ్ఞానాన్ని ఉపయోగించి, ఆనాటి స్నేహితురాళ్లు మృణాళిని. నిమ్మి, శాంతి, సువర్చల, మాలతి అందరికీ నాకు అప్పు ఇచ్చే అదృష్టాన్ని, అనుభూతిని, ఆనందాన్నీ పంచి ఇచ్చాను. తల్లుల్లారా మీరెక్కడున్నా సుఖంగా వర్ధిల్లండి.

అదే సిద్ధాంతానికి కట్టుబడి, చెల్లి దగ్గరా, భార్య దగ్గరా, ఇప్పుడిప్పుడే కూతురి దగ్గరా అప్పులు చేస్తూనే వున్నాను. తిరిగి ఇచ్చారా? అని అడగొద్దు. మీకు అనవసరమైన విషయం. మునిమాణిక్యం గారన్నట్లు 'అప్పు తీర్చకపోతే ఏమి పుట్టి మునిగింది? ఇంకొకరి దగ్గర ఉండాల్సిన సొమ్ము నా దగ్గర వున్నది. అంతేగా! మద్ది సుదర్శనం గారి దగ్గర ఉండాల్సిన సొమ్ము మద్దాలి శేషగిరి రావు దగ్గర వుంటే జాతికి వచ్చిన నష్టం ఏమిటి? దేశానికి వచ్చిన నష్టం ఏమిటి?' నేను ఇంత నిష్టగా, అనురాగ మూర్తులయిన అతివల దగ్గరా, మోచేతి ఎముకలు లేని మగువల దగ్గరా మాత్రమే అప్పులు చేస్తూ, ఆనందంగా జీవితం గడిపేస్తుండగా, ఓ ఘోరం జరిగిపోయింది.

ముక్కు మొహం తెలియని ఓ అపరిచితుడి దగ్గర చేయి చాపాల్సి వచ్చింది ఓ సందర్భంలో. గుంటూరు మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు. అప్పటికే భవానీ ప్ర్రేమ సముద్రంలో నిండా మునిగిపోయాను. ఓసారి, తనను చూడ్డానికి, హైదరాబాద్ వెళ్లాను. ఆనవాయితీ ప్రకారం, నా తిరుగు ప్రయాణం స్పాన్సర్ చేసే భాగ్యం భావానికి కలిగించాను, రైలు టిక్కెట్టుకు పోగా, జేబులో ఇరవై రూపాయలున్నాయి ఇంకా. చాలా రిచ్ ఫీలింగ్. రైలులో పొద్దుపోక అటూ, ఇటూ తిరుగుతుండగా ఓ ఆసామీ లొట్టలేసుకుంటూ, బ్రెడ్ ఆమ్లెట్ తింటూ కనపడ్డాడు.

అసలే మనకి జిహ్వ చాపల్యం ఎక్కువ కదా. ఎందుకయినా మంచిదని, ముందు జాగ్రత్తగా, 'ఎంత' అని అడిగాను. 'సిక్స్ టీన్ రూపీస్' అని సమాధానం వచ్చింది. “వారెవ్వా! డబుల్ ఆమ్లెట్, బ్రెడ్ ఇంత చవకగా ఇస్తున్నారే - హాట్స్ ఆఫ్ టు రైల్వేస్, అనుకొని ఆర్డర్ పారేశాను. బిల్లు పదహారు రూపాయలు పోగా, ఇంకా నాలుగు రూపాయలుంటాయి. గుంటూరులో సిటీబస్ కి సరిపోతాయి.” అని లెక్కలేసుకుంటూ బ్రెడ్ ఆమ్లెట్ లాగించేశాను.

బ్రేవ్ మని తీనేస్తుండగా, బిల్ ఇచ్చాడు. చూద్దును గదా - షాక్. అది సిక్స్ టీన్ రూపీస్ కాదు, సిక్స్ టీ రూపీస్. నా జిహ్వ చాపల్యానికి, నా అంగ వైకల్యం (చెవుడు)తోడై నన్నీ దౌర్భాగ్య పరిస్థితిలో పడేశాయి. రైలంతా తిరిగాను, 'తెలిసిన వెధవ ఒక్కడన్నా దొరకడా' అనే ఆశతో. లాభం లేకపోయింది. ఇది విధి పన్నిన కుట్ర అని మీకీ సరికి అర్థమయి వుంటుంది. పోనీ - పప్పు రుబ్బి అప్పు తీరుడ్డామా అంటే ఇదేమో - శంకర్ విలాస్ కాదాయె. మా 'అప్పారావ్'లకి అగ్రజుడైన మునిమాణిక్యం గారు అన్న మాటళు గుర్తు తెచ్చుకున్నాను.

'అప్పు ఎవర్ని అడగవలె అనే విషయంలో చెప్పదగిన మాట ఒక్కతే వున్నది. ఏమిటీ అంటే అడుగు దగిన వారూ, అడుగు తగని వారూ అంటూ ఎవరూ లేరు. ఎవ్వరిని బడితే వారిని అడగవలసిందే. అప్పు అడగడానికి అందరూ సమానులే' అని. ఆ బంగారు వాక్యాల్ని మననం చేసుకుంటూ, నా సీటు ఎదురుగా వున్న ఓ వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి సంగతంతా వివరించి, ఓ ఫీప్టీ అప్పు చేసి, బయటపడ్డాను.

ఆ కుర్రాడికి సిన్సియర్ గా వెంటనే మనీ ఆర్డర్ చేశానన్న విషయం మీరు నమ్మి తీరాలి. ఆడవారి దగ్గర తప్ప అప్పు చేయని నా వ్రతం భంగ పడినందుకు బాధపడ్డాను. ఈ అపరిచితుడికి నాకు అప్పిచ్చే భాగ్యాన్ని కలిగించినందుకు ఆనంద పడ్డాను. ఇప్పుడు ఎవ్వరి దగ్గరా అప్పు చేయడం మానేశాను. బ్యాంక్ ల నుంచి మాత్రమే తీసుకుంటున్నాను, మళ్లీ ఇస్తానని భ్రమ పెట్టి.' అహ్హా!! హ్హా....