ఆనందాల హరివిల్లు

 

అమెరికా వచ్చి రెండు వారాలు దాటి పోయింది. లాస్ వెగాస్ చివరి మజిలీ. సెలవులకే కాదు – జీవితానిక్కూడా లాస్ వెగాస్ చివరి మజిలీ అయితే దివ్యంగా ఉంటుంది అంటారు చాలామంది. ప్రపంచం నలుమూలల నుంచీ చాలామంది బోల్డన్ని డబ్బుల్ని సంపాదించుకుని చరమాంకంలో లాస్ వెగాస్ లో రిటైర్ అవ్వడానికి వస్తుంటారు. ఇక్కా సొగసు ఏమిటంటే మనకి ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు – తినొచ్చు – తిరగొచ్చు.

ఇక్కడ జూదం – మోదం. వ్యభిచారం ఆచారం. అందాల్ని, ఆనందాల్ని అందుకోవడానికి, సమయ నిబంధన లేదు, వయసు నిబంధనా లేదు. డబ్బుంటే చాలు. అందుకే లాస్ వెగాస్ కి ‘ముద్దు’ పేరు SIN City. (పాపాల నగరం) ఎవరో అన్నారు ఈ ‘బూతు నగరం’ అందించే అద్భుతాలని మనసారా జుర్రుకోవాలంటే నాల్గింటిని ఇంటి దగ్గర వదిలేసి రావాలట. అని – సంప్రదాయం, సంకోచం, సమయం, శ్రీమతి. ఇది మరీ అతిశయోక్తిలెండి. మేం అందరం అవేమీ వదిలేయకుండా సంసార పక్షంగా లాస్ వెగాస్ చేరుకున్నాం.

మా బస , రభస ఎంజిఎం గ్రాండ్ హోటల్ లో . ఈ హోటల్ లో ఆరువేల గదులు పైనే ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్, క్యాసినోస్ అన్నీ దగ్గర దగ్గరగా ఒక రెండు మైళ్ల లోపే ఉంటాయి. ఆ రోడ్ ని “The Strip” అంటారు. హోటల్ లో ఎటు చూసినా పండగే. తళుకు బెళుకులు, నవ్వులు – నాట్యాలు, జుదశాలలు, పానశాలలలు, సందడే సందడి. లాస్ వెగాస్ అద్భుతమైన స్టేజ్ షోలకు షోలు, సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. చాలా ముందుగా టికెట్లు కొనుక్కోవాలి. టికెట్లు పెద్ద ప్రియమేం కాదు. ముచ్చటగా మూడు వందల డాలర్ల లోపే.

అంటే ఉరామరిగ్గా ఓ రెండు గంటల ప్రదర్శన చూడాలంటే ఒక్కోరికి పదివేల రూపాయలు మాత్రమే. అయినా సరే తల తాకట్టు పెట్టి అయినా ఈ షోలు చూడాల్సిందే అని మా అమెరికా వాళ్లంతా కోడై కుశారు (వెధవది ఏదో నానుడి కాని మన తల తాకట్టు పెడ్తే ఎన్ని డబ్బులొస్తాయి?) సరే చివరికి ఎలా అయితేనేం తలలు, మొలలు తాకట్టు పెట్టి రెండు షో లు చేశాం. మొదటిది BLUE, రెండోది OH. వీటి గురించి చెప్పటానికి మాటలు చాలవు. అంత ఆద్భుతం. వర్ణనాతీతం. స్టేజి మీద వందమంది పైగా నీళ్లలో డాన్స్ చేయడానికి స్విమింగ్ పూల్. క్షణంలో ఆ నీళ్ళంతా మటుమాయం. అంతలో ఇంకో సెట్టింగ్. కళ్ళు ద్\చెదిరే లైటింగ్ ఎఫెక్ట్స్. Music గురించి చెప్పనక్కర్లేదు.

లాస్ వెగాస్ లో ఉన్న ప్రతి హోటల్ ఏదో ఒక థీమ్ ప్రకారం కట్టబడింది. ఒకటి ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ లాగా, ఒకటి పిరమిడ్లలాగా, ఒకటి న్యూయార్క్ లాగా, బెలాజియా అనే హోటల్ లో డాన్సింగ్ ఫౌంటెన్స్ షో ఆద్భుతం. సంగీతానికి అనుగుణంగా, ఫౌంటెన్స్ డ్యాన్స్ చేస్తాయి. నేను సూపర్ డూపర్ అని తెగ ఆనందిస్తుండగా మా సుపుత్రుడు ‘మన తెలుగు సిన్మాలో ఎక్స్ ట్రాలు చేసే డ్యాన్స్ ఇంకా అద్భుతం

నాన్నా’ అని నా సంతోషం మీద చెంబుడు నీళ్ళు గుమ్మరించేశాడు. “LOSS వెగాస్ లోజూదం ఆడకపోతే హైదరాబాద్ లో ట్రాఫిక్ లైట్ రెడ్ వచ్చినప్పుడు ఆగడం అంత మహా పాపం. అలాంటి పాపంలో పాలు పంచుకోకూడదని తలచి, నేనూ మా ఆవిడ బ్లాక్ జాక్ ఆడాం. మన కర్మ. మావిడ ఓ 50 డాలర్లు సంపాదించింది. దానికి కర్మ ఎందుకంటారా మనం ఓ 200 డాలర్లు పోగొట్టాం.

‘అప్రాచ్యుడా – నిన్నెలా పెంచానురా అ;అలాంటిది ఇలా జూదానికి బానిసయిపోతావా’ అని మా నాన్న గొంతు వినిపించిందని పించింది. ఆ దెబ్బకి జూదం ఆపేసి రూంకి చేరాం. లాస్ వెగాస్ లో 24 గంటలు జూదకేంద్రాలు (క్యాసినోలు) నడుస్తూనే ఉంటాయి. అవే కాదు, టాప్ లెస్ డ్యాన్సులు, కాబరే నృత్యాలు, ఇలా రకరకాల విన్యాసాలు. ఎటు చూసినా ‘ప్రపంచంలో ఆనంద మంతా మాదే సొంతం’ అనుకుంటూ జనం ఒకటే సందడి. కొందరికి ఇది విచ్చలవిడి తనంగానూ విశృంఖలత్వానికి నిదర్శనంగానూ అనిపిస్తాయి.

ఏది ఏమైనా వీలుంటే ఒక్కసారి లాస్ వెగస్ చూసిరండి. మీరేం తాగనక్కర్లేదు. జూదం ఆడక్కర్లేదు. శీలం పోగొట్టుకోనక్కర్లేదు. దేవుడికి పోటీగా, మనిషి కూడా ఎన్ని అద్భుతాలని సృస్టించ గలడో తెలుసుకోవడానికి వెళ్తే చాలు. అన్నట్లు లాస్ వెగాస్ లో ఇంకో గొప్ప సదుపాయం ఉంది. విడాకులు వారం రోజుల్లో తీసుకోవచ్చు. చాలా మంది రసిక మారాజులు ఓకే కారులో ముందు సీట్లో వర్తమాన పెళ్ళాన్ని, వెనక సీట్లో భవిష్యత్తు పెళ్ళాన్ని కూర్చోపెట్టుకుని లాస్ వెగాస్ కివస్తారట, వారం రోజుల్లో చట్టపరంగా పాత భార్యకు బై చెప్పి కొత్త భార్యకు సాయి చెప్పే సౌకర్యం కోసం.

మావిడ శా సౌకర్యాన్ని వాడుకుంటుందేమోనన్న భయంతో నేను లాస్ వెగాస్ లో నాలుగు రోజులు మాత్రమే ఉండి తిరుగు ముఖం పట్టాను. అమెరికాలో మూడు వారాలు, మూడు క్షణాలుగా గడిచిపోయాయి. ఎంతమంది స్నేహితులతో, ఎంత మంది ఆత్మీయులో. ఈ మూడు వారాలు మా హోస్ట్స్ అందరూ మధు, శిరి, శివప్రసాద్, విజయ, ప్రసాద్, రేణు, సుధాకర్, ప్రసన్న, రమేష్, శారద – మమ్మల్ని ప్రేమాభిమానాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

నేనెప్పుడూ అంటుంటాను. నాకన్నా, ధనవంతుడు ఎవ్వరూ లేరని. నాకూ నావాళ్ళు పంచిన స్నేహధనం, విలువ కట్టలేని మూల్యం, సదా నా గుండెలో పదిలం.