ఉహకందని ప్రకృతి ఆద్భుతం

ఉదయాన్నేరెండు కార్లలో Grand Canyan కి బయలుదేరాం ఫినిక్స్ నుంచి. కార్ల షికార్ల రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల దాకా కారులో మంచి సీట్ కోసం, నచ్చిన వ్యక్తి పక్కన కూచోడం కోసం బోల్డన్ని లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి లావాదేవీలు, సిఫార్సుల నేపధ్యంలో, నాలాంటి అమాయక, అర్భక జీవి బలి అవ్వక తప్పదు కదా. ఫలితం –ఓ కారులో – ముగ్గురు ఆడాళ్ళ మధ్య ఇరుక్కుపోయాను.

“ఇదేంటి – వీడు – ఆడపిల్లలతో – చుక్కల్లో చంద్రుడిలాగా వెలిగిపోయే ఛాన్స్ వస్తే – ఇలా ఏడుస్తున్నాడేమిటి” అని మీరు అబ్బుర పడకండి.

నా బాధకి కారణాలు ఎన్నో. ఒకటి – ఆ ముగ్గురు వారి వారి మొగుళ్ళ నిరంకుశత్వాన్ని ఎదిరించి, ఆ ‘మగ చచ్చినాళ్ళ’ పురుషాహంకారాన్ని ఖండించి, స్వతంత్ర నారీమణులుగా పేరు తెచ్చుకున్న సబలలు. (అందుకనే, ఆ సదరు మొగుళ్ళు రాజకీయం చేసి, రెండో కార్లో సెటిల్ అయిపోయారు అన్న సంగతి మీరు గమనించాలి). మూడు – ఆ ముగ్గురిలో ఇద్దరికీ మహాశుచి ఎక్కువ. మనం అరటి పండు తిన్నామే అనుకోండి - ఆ తొక్క ఎక్కడా వేయడానికి లేదు – బయట సరే- కారు లోపల కూడా వేయకూడదు. చేత్తో పట్టుకుని – డస్ట్ బిన్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఒకవేళ అది కష్టం అనిపిస్తే తొక్క కూడా నమలాల్సిందే.

నాలుగు – మాములుగా, ఓ నల్గురమ్మాయిలు వినడానికి వుంటే – మనం పులి అయిపోయి మావిడ మీద బోల్డన్ని జోకులు, చెణుకులు వేసి Oh! He is so funny’ అని కాంప్లిమెంట్స్ తెచ్చుకుంటుంటాను. అలాంటి అదృష్టం కూడా లేదీరోజు. ఎందుకా? ఆ ముగ్గురిలో ఒకరు – నా భార్యరత్నం కాబట్టి. అమెరికాలో డాక్టరీ చేస్తున్న శారద డ్రైవింగ్. ఆమెకు దారి చెప్పడానికి మా ‘అందరికీ – అన్నివేళలా’ దారిచూపే మావిడ ముందు సీట్లో. ఇంగ్లండులో చిన్నసైజు రాణి జీవితం గడుపుతూ, ఇపుడు మాలాంటి సామాన్యులతో ప్రయాణించవలసిన కర్మ పట్టిన విజయ వెనక సీట్లో. ఆ ప్రక్కనే మూలగా ఒదిగి, నేను. ఈపాటికి మీ అందరికీ – నా మీద బోల్డంత సానుభూతి వచ్చుండాలి.

అయ్యయ్యో! కళ్ళేమ్మట నీళ్ళు కూడా వస్తున్నాయా. అయితే సరే – ఇక గ్రాండ్ కాన్యాన్ కి వెళ్ళిపోదాం. గ్రాండ్ కాన్యాన్ ప్రపంచ వింతల్లో ఒకటి. ఏడు వింతల్లోనా, పధ్నాలుగు వింతల్లోనా అని తర్కించద్దు. ప్రకృతి అద్భుతాల్లో అది ఒకటి. ఈ గ్రాండ్ కాన్యాన్, కొలరాడో నది ఒరిపిడి వల్ల సుమారు ఆరు మిలియన్ల సంవత్సరాల క్రింద ఏర్పడిన కొండ చరియల సముదాయం. ఈ నది, 446 కిలోమీటర్ల పొడవు, 7 నుంచి 24 కిలోమీటర్ల వెడల్పుతో, అష్టం వంకరలు తిరగుతూ, పరవళ్ళు తోక్కుతుంటుంది. గ్రాండ్ కాన్యాన్ లో కొన్ని పర్వత శ్రేణులకి, మన దేవుళ్ళ పేర్లు పెట్టారు.

బ్రాహ్మ పాయింట్ అని, విష్ణు పాయింట్ అని, ఇండియన్ గార్డెన్స్ అని. ముందే అన్నాగా – ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే – మనవాళ్ళో, దేవుళ్ళో ఉండక తప్పదని. హెలికాప్టర్ గ్రాండ్ కాన్యాన్ ని చూడ్డం వొళ్ళ గగుర్పొడిచే అనుభూతి. గమ్మతేమిటంటే – ఎన్ని ఫోటోలు తీసినా, వీడియోలు తీసినా, చూసినా గ్రాండ్ కాన్యాన్ grandness ని అనుభవించలేం – కళ్ళతో చూడాలే తప్ప. ద్రాండ్ కాన్యాన్ లో సుర్యాస్తమయం కానీ, సూర్యోదయం కానీ చూడకుండా వెళ్ళకూడదట. అంత అద్భుతం ఆ దృశ్యం. సూర్యుడు పడమటి కనుమలలోకి జారుకునే సమయానికి అందరం గ్రాండ్ కాన్యాన్ వ్యూయింగ్ పాయింట్ కి చేరుకున్నాం.

ఆకాశం దేవుడు రకరకాల రంగులతో వేసిన కాన్యాసు లాగుంది. సూర్యుడు, ఆ వినీలాకాశం పొత్తిళ్ళలో ఒదిగిపోతూ, నిద్ర పోవడానికి సిద్దం అవుతున్న పసిపాపలా ఉన్నాడు. గ్రాండ్ కాన్యాన్ పర్వత శ్రేణులు, లోయలు, ప్రకృతి రహస్యాల్ని మర్మ గర్భంగా గుండెల్లో దాచుకున్న మునుల్లాగా ఉన్నాయి. ఆ లోయల్లో, లోతుల్లో, మెలికలు తిరుగుతూ, పరవళ్ళు తొక్కుతున్న కొలరాడో నది, తెలుగింటి అమ్మాయి ఎదమీద పయ్యెదలాగుంది. ఇంత భావుకతలో ఆ ప్రకృతి అందాల్ని తిలకిస్తూ వెనక్కి తిరిగే సరికి చిన్న షాక్.

నా సుపుత్రుడు, ‘చదువుకోరా’ అంటే ఎంత విరక్తిగా ముఖారవిందాన్ని చిన్నబుచ్చుకుంటాడో – అంతే విరక్తిగా ‘బోరింగ్’ అని గొణుక్కుంటూ కనబడ్డాడు. వాడి లేమితనానికి జాలి పడుతూ, ఈ కాలం కుర్రాళ్ళకి ఊత పదమయిన “బోరింగ్’, ఆ రోజుల్లో మనమెప్పుడూ అనుభవించలేదెందుకు అని ఆలోచిస్తూ – రాత్రి గడిపేశాను. మర్నాడుదయం, కోడి కూయకముందే లేచి, నేనూ, శారద, సుధాకర్ గ్రాండ్ కాన్యాన్ లోయల్లోకి ట్రెక్కింగ్ మొదలెట్టాం. నాకూ, శారదకి ప్రకృతిలో పరవశం అవ్వడం పిచ్చి. సుధాకర్ గాడికి నడవడం, ఇంకా చెప్పాలంటే పరుగెత్తడం పిచ్చి. వాడు, ఇంట్లో పాటలు వింటూ – ఏదన్నా మంచిపాట వస్తే మూడ్ వచ్చేసి, రన్నింగ్ కి వేల్లిపోతాడనీ, ఓ రెండు గంటల తర్వాత కానీ ఇంటికి రాడనీ వాడి భార్య ప్రసన్న నిన్న రాత్రే కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది.

తాగితే, తాగుబోతు అంటారు తిరిగితే తిరుగుబోతు అంటాం. మరి వీడ్ని ఏమనాలో? ‘ పరుగుబోతు’అనొచ్చు!! లోయల్లో కిందికి దిగడం సులువు. (జీవితంలో కూడా అంతే కదా – దిగజారడానికి అట్టే ప్రయత్నం అక్కరలేదు. పైకి ఎక్కడానికే కష్టం అంతా) ముగ్గురం, మా పాతరోజులు నెమరు వేసుకుంటూ, అలవోకగా ఓ గంటపాటు నడిచాం. ముప్పయి ఏళ్ళ స్నేహబంధంలో విరిసిన పువ్వుల్ని ఏరుకుంటూ, కురిసిన నవ్వుల్ని పంచుకుంటూ, ఆ ప్రశాంత ఉదయంలో ప్రకృతి ఒడిలో గడిపిన ఆ క్షణాలు ఎద లోయల్లో కలకాలం నిలిచిపోయే జ్ఞాపకాలు. లోయల్లోంచి వెనక్కి బయలుదేరాం.

ముందె చెప్పాగా పైకి ఎక్కడ కష్టం అని. ‘ఈ ఉదయం – నా హృదయం’ అని పాడుకుంటూ దిగిన నేను, ఎక్కేటప్పుడు ‘ ఈ ఉదయం – నా ఉబ్బసం’ అని రొప్పుకుంటూ, కుంటుకుంటూ బయటపడ్డాను. ఆ రాత్రి, మావిడ “నా మాంగల్య బలం కాపాడిందండి ఆయన్ని – ఎంత గండం తప్పిందో” అని అందరికి చెపుతుండగా నిద్రలోకి జారుకున్నాను. ఇంతకీ మంగళసూత్రం గొప్పదా? Salbutamol inhaler గొప్పదా?