Rating:             Avg Rating:       733 Ratings (Avg 3.02)

టెక్సాస్ లో కౌబాయ్ కలలు – ఫినిక్స్ లో ఎడారి శిలలు

చెప్పానుగా. నా తమ్ముడికి, రాముడు, లక్ష్మణుడి కిచ్చిన స్టైల్ లో సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చానని. మా చిన్నోడు వయసులోనే నాకంటే చిన్నకానీ ఆలోచనల్లో అవగాహనలో నాకంటే చాలా పెద్దోడు. వాడు ఐఐటిలో చదివి టెక్సాస్ లో కంప్యూటర్స్  ప్రొఫెసర్. వాడి బ్రెయిన్ కి, మన బ్రెయిన్ కి కొంచెం క్వాలిటీలో తేడా వుందిలెండి. అసలు మావిడ మాటల్లో నేను ఎదగడం మానేసి (మానసికంగా) చాలా రోజులయిందంతోంది.

ఎందుకంటే ఇంకా చిన్నపిల్లాడిలా, చిన్నచిన్న బొమ్మలు, బొమ్మ కార్లు కొనుక్కుంటానని. నాకేం బాధలేదు. అసలు అన్నడిగితే, ప్రతి ఎదిగిన మనిషిలోనూ, అంతరాంతరాల్లో ఓ బుడతడు దాక్కుని వుండాలంటాను. అప్పుడే పనికిరాని భేషజాలు వదిలేసి, అప్పుడప్పుడూ జీవితంలో చిన్నచిన్న గొప్ప ఆనందాలు అనుభవించవచ్చు. ఓ వర్షంలో తడవడం, రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తు కొనుక్కుని తినడం, కాక హోటల్లో కూచుని, వేడివేడి మసాలా టే తాగడం, సైకిల్ మీద త్రిబుల్స్ వెళ్ళడం, ఫ్రెండ్స్ తో కలిసి, శంకర్ విలాస్ బయట సొల్లు కొట్టడం ఇలాంటివి.

టెక్సాస్ స్టేట్ అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వాళ్ళూరు. ప్రతి ప్రెసిడెంటు దిగిపోయినాక, వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో వాళ్ళ పేరు మీద ఓ పెద్ద లైబ్రరీ ఓపెన్ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. దాంట్లో ప్రెసిడెంట్ జ్ఞాపికలు, వాళ్ళు నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోటోలు ఉంటాయి. పొలిటికల్ సైన్స్ విద్యార్దులకి ఈ లైబ్రరీ లు ఎంతగానో ఉపయోగ పడుతాయి. అలాంటి సీనియర్ బుష్ లైబ్రరీ మావాడు పని చేస్తున్న A & M యూనివర్సిటీ లో ఉంది. లోపల చూడ్డానికి టైమ్ కుదరలేదు కానీ బయట నుంచి చూశాం. అక్కడ బెర్లిన్ వాల్ ముక్క ఒకటి పెట్టారు తోటలో మానవ స్వాతంత్య హక్కులకి గుర్తుగా.

టెక్సాస్ కౌబాయ్ లకి, రాంచ్ లకి ప్రసిద్ది. పాత ఇంగ్లిష్ సినిమాల్లో చూసే ఉంటారు. అక్కడ మైళ్ళ తరబడి రోడ్డు ప్రక్కన రాంచ్ లు (వ్యవసాయ క్షేత్రాలు) ఒక్కోడికి 500 వెయ్యి ఎకరాల భూమి ఉంటుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలు ఊహియించుకుని, మీరందరూ ముర్చపోవద్దు. అక్కడ లాండ్ చాలా చీప్. మనందరం ఎంచక్కా ఓ వందెకరాలు కొనుక్కోవచ్చు. ఒట్టు. ఈ రాంచ్ ల్లో కొన్ని వందల ఎకరాలు వ్యవసాయం మొక్కజొన్నో, బంగాళదుంపలో ఇలాంటివి- కొన్ని ఎకరాలు గుర్రాలకి, కొన్ని ఎకరాలు పశుగణానికి  

ఓ మూల చిన్న కుటీరం లాంటి ఇల్లు, ఇన్ని వందల ఎకరాలు నడపడానికి - ఓ వందమందో, రెండు వందలమందో ఉంటారనుకుంటాం. ఉహు పట్టుమని ఓ కుటుంబం అంటే ముగ్గురో నలుగురో అంతే. పనులన్నీ పంట నాటడం, నీళ్ళు పెట్టడం, పంట కోయడం, ప్యాక్ చేయడం లాంటివన్నీ మేషీన్లే చేస్తాయి. నాకయితే, అక్కడ వుండిపోయి ఓ చిన్న రాంచ్ కొనుక్కుని బ్రతికేద్దామనిపించింది. కానీ మావాడు, మావిడ, నాకు సేవలు చేయమని ఖచ్చితంగా చెప్పేశారు. అలా అయితే కుదరదని మానేశాను.

టెక్సాస్ లో రాంచ్ కొనాలనే ఆశని అణగదొక్కి ఆ దుఃఖంలో హృదయ విదారకంగా ఏడ్వాలని నిర్ణయించి, సరైన బాక్ గ్రౌండ్ ఉంటే ఇంకా బాగుంటుందని విశ్లేషించి అరిజోనా అనే ఎడారి స్టేట్ కి బయలుదేరాను. ఈ స్టేట్ లో ఫినిక్స్ అనే ఊళ్ళో ప్రపంచ ప్రఖ్యాతి నొందిన Mayo Clinic అనే ఆస్పత్రిలో లివర్, కిడ్నీలు మార్చుకుంటూ నా ఒకే కంచం, ఒకే మంచం, ఒకే స్కూటర్, ఒకే పర్స్ స్నేహితుడోకడున్నాడు సుధాకర్ అని. ఒంగోలు వాస్తవ్యుడైన వీడికి నా చివరి బకరా అయ్యే భాగ్యం కలిగింది.

నేనెప్పుడూ అంటుంటాను ప్రతి ఒక్కడూ ఆ నలుగురుని ముందే సెలక్ట్ చేసి పెట్టుకోవాలని. నలుగురంటే మనం పోయినాక మోయడానికి కావలసివచ్చే నలుగురు. ఆ- మరీ చోద్యం. ఈ కాలంలో అవన్నీ ఎందుకండీ అంబులెన్స్ లో (అది కూడా స్పెషల్ శవ శకటం) పడేసి ఎలక్ట్రిక్ క్రిమటోరియం అడ్రస్ చెప్తే సరి. అరగంటలో చిన్న కుండలో బూడిద హోమ్ డెలివరీ అయిపోతుంది అంటారు మీలో కొందరు. అయినా ఏంటో, నామట్టుకు నాకు నలుగురిలో బ్రతకడం అన్నా, నలుగురితో పంచుకోవడమన్నా ఆఖరికి నలుగురితో మోయించుకోవడమన్నా చచ్చేంత ఇష్టం. ఇంతకీ ఈ సొదంతా ఎందుకంటే ఈ సదరు సుధాకర్ గాడికి, ఆ నలుగురిలో ఒక జాబ్ ఇచ్చేశాను.

వాడి శ్రీమతి ప్రసన్న కూడా మా కాలేజే. వీళ్ళది కూడా ప్రేమ వివాహమే. అన్నట్లు ప్రేమ వివాహాల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం మనం. చెప్పాగా ముందే మనకి చుట్టూ నల్గురు లేకపోతే గాలి ఆడదని. అందుకే చికాగో నుంచి శారద (నా క్లాస్ మేట్, ఆ నల్గురిలో రెండో పోస్ట్). వాళ్ళాయన రమేష్, ఇంగ్లండ్ నుంచి ప్రతాప్, విజయ దిగిపోయారు. పది సంవత్సరాల తర్వాత పదిమంది స్నేహితులు కలిస్తే ఎలా వుంటుందో ఊహించుకోండి.

ఇక్కడ, మీ అందరికీ నాదో చిన్న విన్నపం. ఈ గానుగెద్దు జీవితంలో మునిగిపోయి, ఈ పరుగులో అలిసిపోయి, ఈ పందెంలో సొలసిపోయి చాలా మందిమి, మన పాత స్నేహితుల్ని, వాళ్ళతో గడిపిన మధుర స్మృతుల్ని మరిచి పోతున్నాం. ఒకసారి మీలో మీరు అవలోకించండి. ఎన్నాళ్ళయింది మీరు, మీ కాలేజీ స్నేహితులని కలిసి. ఒకే ఊళ్ళో ఉన్నా, ఎవరి బ్రతుకులు వాళ్ళవే. తలా ఓ దీవిలో, బావిలో బ్రతుకుతుంటాం. అడపాదడపా, పాత స్నేహాల్ని మనసు పొరల్లోంచి బయటకు తీయండి. పాత ఫోటోల దుమ్ము దులపండి. ఓ శనివారం రాత్రో, ఓ ఆదివారం ఉదయమో నలుగురు నేస్తాల్ని కలవండి. పాత రోజులు నెమరు వేసుకోండి. మనసు పొందే ఆనందం వర్ణనాతీతం. ఇలాంటి పనులకి డబ్బు అక్కరలేదు. మనసుంటే చాలు. ఆ పాత రోజులు, ఆ తీపి జ్ఞాపకాలు, ఆడపిల్లలకు లైన్ వేసిన యవ్వనపు చిలిపితనాలు, గురువులకు పెట్టిన పంగనామాలు, ప్లాష్ బాక్ లో అనిర్వచనీయమైన అనుభవాలు, అనుభూతులు  ఎన్నెన్నో.