Rating:             Avg Rating:       970 Ratings (Avg 2.94)

ప్లోరీడాలో మజిలీ...

న్యూయార్క్ మజిలీ చివరికి వచ్చేసింది. అపుడే వారం రోజులయిపోయింది. చివరి రాత్రి శిరీష (మా హోస్టేన్), నేను బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాం.సీతారామ శాస్త్రిగారి సాహిత్యం గురించి, బాపు బొమ్మల గురించి, గజల్ శ్రీనివాస్ గజల్స్ గురించి, అమెరికాలో జంపాల చౌదరి నడుపుతున్న అద్బుతమైన ‘తెలుగునాడి’ పత్రిక గురించి –

ఇలా ఎన్నో మా ఇద్దరికీ నచ్చిన విషయాలు. సాహిత్య, సంగీత పైత్యం (మావిడ మాటల్లో) ఉన్న ఇద్దరు కలిస్తే – కాలం ఆగిపోక తప్పదు కదా.

“To meet & depart is the sad tale of many a heart” అన్నాడో కవి.

ఎంత నిజం! ఆత్మీయుల దగ్గర నుంచి వీడ్కోలు తీసుకోవడం ఎంత బరువైన విషయమో!

“Best Couple”, Bestest Hosts” లాంటి వీరతాళ్ళని విరివిగా మధు, శిరీష మెడల్లో వేసేసి, ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ కి విమానం ఎక్కేశాం.

అమెరికా ప్రయాణం ప్లాన్ చేస్తున్నప్పుడే, నేను చాలా తెలివిగా వారానికి ఓ బలి చక్రవర్తిని (మీరు బలి పశువు అని చదువుకున్నా నాకభ్యంతరం లేదు) సెలక్ట్ చేసేశాను. ఇప్పుడు రెండో వారం – ప్లోరిడాలో ఆ భాగ్యాన్ని ఇద్దరు దంపతులకి పంచాం. మొదటి సగం – శివ ప్రసాద్ - సాయి విజయ. రెండో సగం – రేణుక – ప్రసాద్. శివ ప్రసాద్ Haemoncologist. అంటే బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట. విజయ గుండె డాక్టర్. వీళ్ళిద్దరి లవ్ స్టొరీ ఏమీ మార్పులు లేకుండా తీస్తే ఓ బ్లాక్ బస్టర్ సినిమా కాక తప్పదని నా గట్టి నమ్మకం.

గత పదేళ్ళుగా, వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను సిన్మాకి హక్కులిస్తారేమోనని. వీళ్ళిద్దరూ బాల్యం నుంచీ ఎడాపెడా ప్రేమించేసుకుని, చీరాలలో పెద్ద పార్క్ లు లేవని, సముద్రం ఒడ్డులో పొదరిళ్ళు లేవని – అమెరికా వచ్చేశారు. ఇంకా ప్రేమించుకుంటూనే వున్నారు. అందుకోసమే, సముద్రం ఒడ్డులో ఓ పొదరిల్లు కట్టుకున్నారు.

“ఇది మన ఇల్లు – ఈ ఇంటిని ఎవరన్నా చూడాలంటే మన కళ్ళు అప్పు తీసుకొని చూడాల్సిందే” అని జగజీత సింగ్ గజల్ వొకటి వుంది. అలానే విజయ, శివప్రసాద్ ల ఇల్లు, వాళ్ళ కళ్ళు అప్పు తీసుకుని చూసి తెగ ఆనందిచాం. ఉషోదయంలో మెరిసే అలల పక్కన కూర్చుని, స్నేహ మాధుర్యం గ్రోలుతూ, ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఆ క్షణాలు – అమెరికా ప్రయాణంలో మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే మధుర స్మృతులు.

మర్నాడు ఉదయానే, అందరం రెండు గంటల ప్రయాణం చేసి Key Largo కి వెళ్ళాం. ఇక్కడ గ్లాస్ బాటమ్ బోట్ లో వెళ్ళి సముద్రంలోని కోరల్స్ చూశాం. కోరల్ రీఫ్ చూడాలంటే ఆస్ట్రేలియాలో చూడాల్సిందే. లోతు తక్కువ సముద్రపు నీళ్ళలో న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నచోట్లలో, జీవరాసులు సమిష్టిగా ఉత్పత్తి చేసే కాల్షియం సముదాయాలు అద్భుతమైన రంగులు సంతరించుకుని, కోరల్ రీఫ్ అని పిలవబడతాయి. 

ఫ్లోరిడా ఎంతో అందమైన స్టేట్. అమెరికాలో దక్షిణాన ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్నో అందమైన సముద్ర తీరాలు, సంవత్సరం పోడుగంటా చక్కటి వాతావరణం. వాళ్ళ ఎండాకాలం – కొంచెం మన ఎండాకాలంలా ఉంటుంది. తేడా అల్లా ఓ పది డిగ్రీలు. ప్లోరిడా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఓర్లాండో. ఈ పట్టణంలో లేని అద్భుతం లేదు.

బోల్డన్ని థీమ్ పార్కులకు నిలయం. 1971లో వాల్డ్ డిస్నీ ఇక్కడ డిస్నీ వరల్డ్ కట్టాడు. లాస్ ఏంజెల్స్ లో ఒంకోటి ఉంది. దాన్ని డిస్నీ లాండ్ అంటారు. చాలా మంది డిస్నీ లాండ్ పిల్లలకే అనుకుంటారు. కానేకాదు. నిజం చెప్పాలంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఎవరో తెలుసా – పెద్దోళ్ళు వాళ్ళలో దాక్కున్న పిల్లలే. కొన్ని వందల ఎకరాల్లో కట్టిన ఈ డిస్నీ వరల్డ్ లో అద్భుతమైన విషయం ఏమిటంటే రోజుకు 80 వేలమంది టూరిస్ట్ లు సందర్శించినా ఎక్కడా చెత్తగాని, కంపు కొట్టే టాయ్ లెట్స్ కానీ, రంగు వెలసిన గోడకానీ కనపడదు.

ఇక్కడ రెండ్రోజులున్నాం. ముందే చెప్పాగా – రెండో భాగంగా మా హోస్ట్స్ డాక్టర్ ప్రసాద్ – రేణుక అని. డాక్టర్ ప్రసాద్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. అంటే పేగుల డాక్టర్ అన్నమాట. ప్రసాద్ మితభాషి (నాలాగే!!) కానీ బుర్ర చాలా పెద్దది. ఏ విషయం అయినా చక్కగా, సునిశిత దృక్పథంతో అవగాహన చేసుకోగలడు. ప్రసాద్ శ్రీమతి – రేణుక. మా ఆవిడకి “ఒసే – చచ్చిన దానా” టైపు స్నేహితురాలు. ఆ పిల్ల ప్రసాద్ కంటే తెలివి గలది. అందుకనే డాక్టరీ చదవలేదు. హోం సైన్స్ చేసి, ప్రస్తుతం జీతం, సెలవులు లేని ఉద్యోగం చేస్తోంది – అదేనండీ బాబూ – హౌస్ వైఫ్ ఉద్యోగం. రేణు సెన్సాఫ్ హ్యూమర్ అద్భుతం. తను, మావిడ చిన్ననాటి కబుర్లలో పడి, మమ్మల్ని మరిచిపోయారు. మనకి కావాల్సింది అదే కదా.

రెండోరోజు ఎంజిఎం స్టూడియోకి వెళ్ళాం. నా సుపుత్రుడు సిన్మా పిచ్చోడు. ఆరోజు వాడికి పండగే. ఈ థీమ్ పార్కులో ఎటు చూసినా, సిన్మా కతలే. ఎంజిఎం తీసిన సూపర్ డూపర్ సినిమాల తాలూకు విషయాలు – కథా కమామీషులు – చాలా గొప్పగా ప్రదర్శించారు. హాలీవుడ్ సిన్మా షూటింగ్ లు ఎలా తీస్తారో, సెట్స్ ఎంత గొప్పగా వేస్తారో చూపించే ఓ షో చాలా బాగుంది. హారిసన్ ఫోర్ట్ నటించిన ఇండియానా జోక్స్ సినిమా షూటింగ్ నమూనా చూపించారు. చాలా చాలా బాగుంది. ప్రతి యాక్టర్ లోనూ మిస్ అయిపోయిన ఓ డాక్టర్ ఉన్నట్లు – ప్రతి డాక్టర్ లోనూ నిద్రపోయే ఓ యాక్టర్ ఉంటాడన్న మాట వాస్తవం.

అలానే నాలోనూ నిద్రాణమైన ఓ నటనాశక్తి, ఆరోజు ఎంజిఎం స్టూడియోలో మేలుకొంది. ఫలితం షిప్ ను ముంచేసే ఓ సీన్ లో (కొంప ముంచేసే సీను కాదు) నేను కూడా నటించి, జీవించి ఎంజిఎం స్టూడియోని ధన్యం చేసేశాను. ఆ తర్వాత వారం రోజుల దాకా టెన్షన్. స్పీల్ బర్గ్ ఫోన్ చేసి, సిన్మా ఛాన్స్ ఇచ్చేస్తాడేమోనని. టెన్షన్ ఎందుకంటారా? మీరు భలేవారండీ బాబూ – నేను అక్కడే సెటిల్ అయిపోతే – మనదేశంలో మోకాళ్ళన్నీ ఎంత బాధపడతామో తెలీదా!!?

చివరికి ఎలాగయితేనేం స్పీల్ బర్గ్ ను తప్పించుకుని, మా బలి చక్రవర్తులయిన ప్రసాద్, రేణు, శివప్రసాద్, విజయలకి జేజేలు కొట్టి టెక్సాస్ కు బయలుదేరాం. బకాసురుడికి రోజుకొకడు బకరా అయినట్లు – టెక్సాస్ లో ఆ అదృష్టం ఎవరికో అని మీరందరూ కుతూహలంగా ఉన్నారని తెలుసు. ఈ టెక్సాస్ బకరాకి ఓ స్పెషాలిటీ ఉంది. తను నాకు చాలా సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ జీవితాన్ని పరమార్ధం చేసుకున్న వ్యక్తి – నా చిన్న తమ్ముడు.