మనకు ఉన్నంతమంది దేవతలు ఇతర ఏ మతంలోనూ లేరు. విఘ్నేశ్వరుడు, వేంకటేశ్వరుడు, మహాశివుడు, విష్ణుమూర్తి - ఇలా అసంఖ్యాకమైన దేవతామూర్తులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, ముక్కోటి దేవతలు ఉన్నారు. ఇందరు దేవుళ్ళలో వేంకటేశ్వరునికి ఒక విశిష్టత ఉంది. వేంకటేశ్వరుడు దేవతలు అందరిలోకీ మహా ధనవంతుడు. పేద, ధనిక తేడా లేకుండా ఎవరి శక్తికి తగ్గట్టు వారు ఏడుకొండల బాలాజీకి కానుకలు సమర్పించుకుంటారు.
తిరుమల వేంకటేశ్వరునికి పూర్వం నుండి కానుకలు వచ్చిపడుతూనే ఉన్నాయి. తలనీలాలు మొదలు స్వర్ణాభరణాల వరకూ ఎన్ని కానుకలో! చిన్న చిన్న దక్షిణలు మొదలు భూరి విరాళాల వరకూ అనంతంగా సంపదలు వస్తున్నాయి. వేంకటేశ్వరునికి ఆరో, పదహారో నగలు కాదు ఏకంగా 11 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
తిరుమల వేంకటేశ్వరుని ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. వేసవి సెలవలు, పర్వదినాలు మొదలైన సందర్భాల్లో అయితే ఆ సంఖ్య రోజుకు లక్ష దాటుతుంది. ఈ భక్తుల కానుకలతో తిరుమల తిరుపతి దేవస్థానం కోట్ల ఆస్తులను కూడబెడుతోంది. నల్లధనం మూలుగుతున్న పెద్దలు కొందరు లక్షల సొమ్మును మూటకట్టి గోప్యంగా హుండీలో వేయడం లాంటి సంఘటనలు వార్తల్లో చూస్తుంటాం.
తిరుమల వేంకటేశ్వరునికి 12వ శతాబ్దం నుండి కానుకలు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి.
తంజావూరు రాజులు పాండ్యన్ కిరీటాన్ని కానుకగా సమర్పించారు.
14వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు 8 సార్లు తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకుని, కానుకలు సమర్పించినట్లు శాసనాలు ధృవీకరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిన ఎనిమిదిసార్లు ఏమేం సమర్పించారో వివరాలు చూద్దాం..
1. వజ్రాలు, వైడూర్యాలు, పచ్చలు, నీలాలు, కెంపులు, మాణిక్యాలు, గోమేధికాలు మొదలైన నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటం
2. మూడు పేటల కంఠహారం, స్వర్ణ ఖడ్గం, రత్న ఖచిత ఖడ్గం, నిచ్చెన కఠారి, భుజకీర్తులు, 30 తీగల పతకం, ఉడుధార
3. ముత్యాల హారం
4. శ్రీవారికి రెండు బంగారు పాత్రలు
5. బంగారు పళ్ళేలు
510,000 వేల వరహాల శ్రీవారి ఆలయ ఖర్చు నిమిత్తం
అమూల్య రత్నాలు పొదిగిన కంఠహారాలు, ప్రభావళి, పతకాలు
మొదలైనవి రాణులు, శ్రీవారికి సమర్పించారు
6. 30,000 బంగారు నాణాలతో శ్రీవారికి కనకాభిషేకం
7. 30,000 వరహాలతో బంగారు విమానమలకు పూత పూయించాడు
8. ప్రతి గురువారం శ్రీవారి పులికప్పు సేవ నిమిత్తం 1000 వరహాలు, ఆనంద విమానం పూత నిమిత్తం మాన్యాలు ఇచ్చారు.
తిరుమల కొండకు దిగువన రేణిగుంట సమీపంలో ఉన్న కరంబాది గ్రామం శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనే శ్రీవారికి మాన్యంగా ఇవ్వడం జరిగింది.
భక్తులు శ్రీవారికి సమర్పించే తలనీలాలు వేలం వేస్తారు. విగ్గులు, బొమ్మలు, ఇతర అలంకరణ సామగ్రి రూపొందించే విదేశీ సంస్థలు వీటిని కొనుగోలు చేస్తారు. కేవలం ఈ తల నీలాల ద్వారా వచ్చే సొమ్మే సుమారు 50 కోట్లు. ఇలాంటి వేలంపాట ఏడాదికి నాలుగుసార్లు జరుగుతుంది.
|