రక్షించువా రెవ్వ రను కొనెను. పూర్వసుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిరబుద్ధి కలిగెను. అప్పుడు
శా|| లా వొక్కింతయు లేదు ధైర్యము విలోల౦బయ్యె ప్రాణ౦బులున్
ఠావుల్ దప్పెను, మూర్చ వచ్చే,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవేతప్ప నిత:పరం బెరుగ, మన్నింప పందగుం దీనునిన్
రావే! యీశ్వర!కావవే వరద!సంరక్షింపు భద్రాత్మకా!
అని మొరపెట్టుకొనెను. ఆ మొర విని విష్ణుదేవుడు కరిగిపోయేను. తాను విశ్వమయుడు గాన, గజేంద్రుని రక్షింపదలచెను.
అహంకారము జీవలక్షణము. అది జీవుని అంత త్వరగా వదలదు.
అది ఉండుట, అవసరమే అయినను మితి మీరకూడదు. ఆత్మరక్షణకై సకలజీవులు ప్రయత్నించెను. అది తప్పు కాదు. తానే బలవంతుడ నను అహంకారము అనర్ధము తెచ్చును. గజేంద్రుడు తన్నుతాను రక్షించుకొనుటకై పోరాడునంత కాలము శ్రీనాథుడు పట్టించుకోలేదు. మన యవసరము లేదు లెమ్మని యూరకున్నాడు. ద్రౌపది విషయంలో గూడా ఇంతేకదా! దుశ్శాసనుడు చీర లోలుచుచు౦డగా ఆత్మరక్షణకై చాలా ప్రయత్నించిన దామె. శత్రువుముందు తమ బలము చాలదని గ్రహించిన తరువాతనే వారు దైవమును శరణు వేడిరి . అంతవరకును చూచుచు ఊరకుండిన శ్రీహరి అప్పుడు రంగంలోనికి దిగినాడు.
అది అతని శరణాగత రక్షణ గుణమునకు పరాకాష్ట. సర్వమునకు దైవమే శరణ్య మని నమ్మిన భక్తులను అయన ఆత్మీయులుగా భావించి రక్షించును.
శ్రీహరి గజరాజు మొర వినగానే ప్రక్కనున్న లక్ష్మితో గూడా చెప్పకుండా పరుగుల మీద వచ్చి చక్రాయుధముతో మొసలిని జంపి గజరాజును కాపాడినాడు.
అని శుకముని పరీక్షిత్తునకు జెప్పి, “రాజా! గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడను రాజు . విష్ణుభక్తుడు. ఒకనాడు అతడు శ్రీహరి ధ్యానములో నుండగా అగస్త్యుడు అక్కడకు వచ్చెను . రా జతనిని జూడలేదు. అందుచే ఆ ముని కోపించి “ నీవు మదముతో నాకు మర్యాదలు చేయవైతివి కావున మదగజమవై పుట్టు “ మని శపించెను. పుజి౦పదగిన మహాత్ములను పూజించకుండుట శ్రేయోభంగకరము గదా!
అట్లు ముని శాపమున ఆ రాజు గజరాజై పుట్టెను. పూర్వజన్మవాసన చేత మనసులో హరిభక్తి అంకురించి విష్ణుదేవుని యనుగ్రహమునకు పాత్రుడయ్యేను.
మొసలి, హుహు అను గంధర్వుడు . దేవలుని శాపముచే అట్లాయ్యెను.శ్రీహరి చక్రధారచే చచ్చి పుణ్యగతికి బోయేను.
విషమ పరిస్థితులలో చిక్కుకొన్న వా రేవ్వరైనను ఈ గజేంద్రమోక్షణ కథను భక్తితో చదివినను, విన్నను సర్వాపదలు తొలగిపోయి సుఖపడుదురు.
ఉత్తమగతిని గజేంద్రునివలె పొందుదురు. |