Vinayaka Chavithi Special Recipes
ఉండ్రాళ్ళు
కావలసినవి:
బియ్యంపిండి లేదా బియ్యం రవ్వ- రెండు కప్పులు
బెల్లం- ఒక కప్పు
పచ్చిశెనగపప్పు- రెండు టీస్పూన్లు
నీరు- ఒక కప్పు
తయారు చేసుకునే విధానం :
బియ్యం ముందురోజు రాత్రి నానబెట్టి గుడ్డ మీద వేసి ఆరనివ్వాలి. నీరంతా ఇంకిపోయి,
బియ్యం పొడిగా అయినాక, మిక్సీలో వేసి రవ్వగా చేసుకోవాలి. బియ్యప్పిండితో ఉండ్రాళ్ళు
చేసుకొనే వారు పిండిగా చేసుకోవచ్చు. స్టౌ మీద బాణలీ పెట్టి తగినన్ని నీళ్ళు పోసి
మరిగించి అందులో బెల్లం వేసి కరిగే దాక కలియతిప్పాలి. తరువాత శనగపప్పు,
బియ్యంపిండి లేదా రవ్వ వేసి దగ్గర పడేదాక కలపాలి. దీనిని చిన్న చిన్న ఉండలు
చేసుకొని ఆవిరి మీద ఉడికించాలి అంతే... బొజ్జ గణపయ్యకు ప్రీతిపాత్రమైన తియ్యని,
కమ్మనైన ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే...!
కుడుములు
కావలసిన వస్తువులు:
బియ్యం పిండి - ఒక కప్పు
కొబ్బరి ముక్కలు - పావు కప్పు
బెల్లం - ముప్పావు కప్పు
నీళ్ళు - రెండు కప్పులు
నూనె - ఒక స్పూన్
ఏలకుల పొడి - పావు స్పూన్
తయారు చేసే విధానం:
బియ్యప్పిండిలో ఒక కప్పు నీళ్ళు పోసి కలపాలి. బెల్లంలో ఒక కప్పు నీళ్ళు పోసి కరిగించి
వడకట్టాలి. నాన్ స్టిక్ పాన్ లో కరిగించిన బెల్లం వేసి మరిగించాలి. ఇప్పుడు బియ్యం పిండి,
కొబ్బరి ముక్కలను, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై
కొంచెం గట్టి పడేవరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత సైజు ఉండలుగా
చేసుకోవాలి. వీటిని ఇడ్లీ ప్లేట్ కి కొంచెం నూనె రాసి అందులో పెట్టి 5 నుంచి 10 నిమిషాల
వరకు ఆవిరి మీద ఉడికించి దించుకోవాలి.
పప్పులో ఉండ్రాళ్ళు
కావలసిన పదార్థములు:
బియ్యం పిండి - ఒక కప్పు
నీళ్ళు - తగినన్ని
పప్పు కోసం పెసరపప్పు - ఒక కప్పు
నీళ్ళు సరిపడినన్ని
బెల్లం - అర కప్పు
యాలకుల పొడి - అర చెంచా
తయారు చేయు విధానం :
బియ్యం పిండిలో నీళ్ళుపోసి గట్టి పిండి తయారు చేసుకుని, దీన్ని చిన్న చిన్న ఉండలుగా
చేసుకోవాలి. ఈ ఉండలను మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఉడికిన ఉండలను
తీసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు లో తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన
పెసర పప్పులో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. పప్పు స్టౌ మీద ఉండగానే ఉడికిన ఉండలను
వేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి యాలకుల పొడి వేసి స్టౌ మీద నుంచి దించాలి.
పాలతాలికలు
కావాల్సినపదార్థాలు:
పాలు - ఒక లీటరు.
నీళ్లు - ఒక లీటరు.
సగ్గు బియ్యం - వందగ్రాములు.
బియ్యపిండి - వందగ్రాములు.
మైదాపిండి - రెండు టీ స్పూన్లు
పంచదార - 200గ్రా.
బెల్లం - పావుకేజి.
జీడిపప్పు - కొద్దిగా.
కిస్‌మిస్ - కొద్దిగా.
ఏలకులపొడి - ఒక టీ స్పూను.
నెయ్యి - కొద్దిగా.
తయారుచేయువిధానం:
పాలలో నీటిని కలిపి మరిగించాలి. పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.
ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి సగ్గుబియ్యం
ఉడుకుతున్న తేటతో (సగ్గుబియ్యం రాకుండా పాలు మాత్రమే) చక్కిలాల పిండిలా
కలుపుకోవాలి. ఈ పిండిని చక్కిలాలను ఒత్తినట్లు మరుగుతున్న పాలలోకి ఒత్తాలి. ఇవే
తాలికలు. ఇవి పాలలోనే ఉడుకుతాయి. ఒక తీగ మరొక తీగ మీద పడకుండా విడివిడిగా
వచ్చేటట్లు చూడాలి. ఒకదాని మీదకొకటిగా పడితే ఉడికేటప్పుడు కలిసి ముద్దవుతాయి.
తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు
ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, ఏలకుల పొడిని వేసి కలపాలి. ఇప్పుడు పైన
రెండు స్పూన్ల నెయ్యి వేసి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు,
కిస్‌మిస్‌లతో అలంకరించాలి.
పాల ఉండ్రాళ్ళు
కావాల్సినపదార్థాలు:
బియ్యం పిండి - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
ఏలకుల పొడి - పావు టీ స్పూన్
నీళ్ళు - 1 1/2 కప్పులు
తురిమిన పచ్చి కొబ్బరి - ఒక కప్పు
వేయించి పొడి కొట్టిన తెల్ల నువ్వుల పొడి - అరకప్పు
తయారుచేయువిధానం:
రెండు కప్పుల నీటిని గిన్నెలో పోసి బాగా మరగనివ్వాలి. బియ్యప్పిండిని వేసి, బాగా
కలియదిప్పి, వెంటనే గిన్నెపై మూత పెట్టాలి. సన్నని సెగమీద 4 -5 నిముషాల పాటు
ఉడకనివ్వాలి. విడిగా గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి. చిన్న ఉండలు చేసి ప్లేటులో విడిగా
పెట్టుకోవాలి. మరొక గిన్నెలో చక్కెర వేసి, నీటిని పోసి మరిగించాలి. సెగ తగ్గించి,
కొబ్బరితురుము వేసి కొద్ది సేపు కలపాలి. బియ్యప్పిండి ఉండలను కుడా వేసి బాగా
కలియ దిప్పాలి. రెండు నిముషాల తరువాత కప్పు పాలను పోసి, ఉండలను అందులో వేసి
5 నిముషాల సేపు ఉడకనివ్వాలి. మెత్తగా నూరిన నువ్వల పొడి, ఏలకుల పొడి వేసి
కలపాలి. స్టవ్ మీద నుండి దించి చల్లార నివ్వాలి.
చలివిడి
కావాల్సినపదార్థాలు:
బియ్యం - రెండు కప్పులు
బెల్లం లేదా పంచదార- కప్పు
కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు
>ఏలకులు- 5
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
నీళ్ళు - తగినంత
తయారుచేయువిధానం:
ముందుగా బియాన్ని నీళ్ళలో 8 గంటల పాటు నానబెట్టి, నీళ్ళు వంచి బియ్యాన్ని ఒక్క
పొడి వస్త్రం పై ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత గ్రైండర్ లో మెత్తని పిండిలా చేసుకోవాలి. 2
కప్పుల నీళ్ళు, పంచదార లేదా బెల్లం వేసి తీగ పాకంలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఆ
పాకంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. నెయ్యివేసి దగ్గరగా
అయ్యేదాకా ఉడికించాలి. వేరే పాన్ లో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే
వరకు వేయించాలి. ఈ ముక్కలను, ఏలకుల పొడిని చలివిడిలో కలుపుకోవాలి. అంతే
చలివిడి రెడీ.
పులిహోర
కావాల్సినపదార్థాలు:
బియ్యం - 1 cup
చింతపండు - 2 నిమ్మకాయంతవి
పసుపు - 1 tablespoon
వేయించిన వేరుశెనగపప్పు - 2 - 3 tablespoons
ఉప్పు నూనె పోపు కొరకు ఆవాలు - 1 teaspoon
పచ్చి శెనగపప్పు - 1 tablespoon
జీల కర్ర - 1 tablespoon
ఎండు మిరపకాయలు - 4
తయారుచేయువిధానం:
ముందుగ బియ్యం ని 2 cups నీళ్ళు పోసి ఉడక పెట్టుకోవాలి. ఉడికించిన అన్నం ని
పక్కన చల్లారి పెట్టుకోవాలి పసుపు , ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండు ని వేడి నీళ్ళల్లో
నాన పెట్టి రసం తీసి పెట్టుకోవాలి వేరే బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం పోసి
చిక్కగా అయ్యే వరకు ఉడక పెట్టుకోవాలి వేరే పాన్ తీసుకొని తగినంత నూనె పోసి కాగాక
ఆవాలు వేసుకోవాలి. తరువాత పచ్చి శెనగపప్పు ని వేయించాలి. వేగాక జీలకర్ర ని,
వేరుశెనగపప్పు ని, ఎండు మిరపకయాలని వేసి ఒక నిముషం పాటు వేయించాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని అన్నం లో కలపాలి. తరువాత చింతపండు రసం ని బాగా
కలపాలి.
వడపప్పు
కావాల్సినపదార్థాలు:
పెసరపప్పు - 1 కప్పు
కారం పొడి 1/2 tsp
ఉప్పు చిటికెడు క్యారట్ తురుము 1 tbsp
పచ్చిమిర్చి తురుము1/2 tsp
కొత్తిమిర తురుము 1 tsp
తయారుచేయువిధానం:
పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో కారం, ఉప్పు, క్యారట్ తురుము, /p>
పచ్చిమిర్చి తురుము,కొత్తిమిర తురుము మీకు కావలసినంత వేసి కలపండి. అంతే
వడపప్పు నైవేద్యం రెడీ.
పానకం
కావాల్సినపదార్థాలు:
నీళ్ళు - ఒక గ్లాసు
బెల్లం - వంద గ్రాములు
రియాల పొడి - ఒక టీ స్పూన్
ఏలకుల పొడి - అర టీ స్పూన్
తయారుచేయువిధానం:
బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. కరిగాక అందులో
మిరియాల పొడిని, ఎలకుల పొడిని వేసియా కలపాలి.
తీపి గారెలు
కావాల్సినపదార్థాలు:
మినపప్పు- రెండు కప్పులు
బెల్లం తురుము- 11/2 కప్పులు
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - రుచికి కొద్దిగా
నీళ్ళు - రెండు కప్పులు
నూనె- గారెలు వేయించడానికి తగినంత
తయారుచేయువిధానం:
మినప్పప్పుని నీటిలో వేసి రెండు గంటల పాటు నాననివ్వాలి. పప్పుని నీటిలో శుభ్రంగా
కడిగి, నీళ్ళు తక్కువగా వేసి గట్టిగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బెటప్పుడే రుచికి తగినంత
ఉప్పు వేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో బెల్లం తురుము, నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి తీగ
పాకం వచ్చే వరకూ మరగనివ్వాలి. కొద్దిగా మిరియాల పొడి వేసి, స్టవ్ మీద నుంచి దించి
చల్లారనివ్వాలి. బాణలిని స్టవ్ మీద పెట్టి గారెలు వేయించడానికి తగినంత నూనె వేయాలి.
చేతులు కొంచెం తడి చేసుకుని మినప్పిండిని నిమ్మకాయ సైజులో ఉండలు చేసి ప్లాస్టిక్
పేపర్ మీద కానీ, అరటి ఆకు ముక్కపై వుంచి గుండ్రంగా తట్టాలి. మధ్యలో చిన్న రంధ్రం
చేసి, మరుగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేగిన
గారెలను కాగాబెట్టి ఉంచుకున్న బెల్లం పాకంలో వేయాలి. రెండో వాయి గారెలు వేగిన
తరువాత పాకం గిన్నెలో ఉన్న గారెలను తీసి, వేరే పళ్ళెంలో విడి విడిగా పేర్చుకోవాలి.
అలా గారెలన్నింటినీ పాకంలో ముంచి తీసిన తర్వాత, మిగిలిన పాకాన్ని గారెల మీద వేసి,
సర్వ్ చేయండి. కరకరలాడే తీపి గారెలు రెడీ.
బొబ్బట్లు
కావాల్సినపదార్థాలు:
శెనగపప్పు - అరకేజీ
ప౦చదార - అరకేజీ
మైదాపి౦డి - అరకేజీ
యాలకులు - పదిహేను
నూనె - పావుకేజీ
నెయ్యి - పావుకేజీ
తయారుచేయువిధానం:
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని
పెట్టుకోవాలి. మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి
కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే
నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా
బొబ్బట్లు వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి
గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ
పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ
నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి
ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని
పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి. పప్పు
చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.రుబ్బిన పిండిని తీసి
చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి . ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న
పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి
మద్యలో పెట్టాలి.ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి. ఇప్పుడు ఒక
పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా
నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.అలా
వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.
కేసరి పూర్ణాలు
కావాల్సినపదార్థాలు:
బొంబాయి రవ్వ - అరకిలో
పంచదార - అరకిలో
నెయ్యి - 100గ్రాములు
మైదా - పావుకిలో
నూనె - పావుకిలో
ఏలకులు -6
బెల్లం - 50గ్రాములు
తయారుచేయువిధానం:
బొంబాయి రవ్వ దోరగా ఏపుకోవాలి. మందపాటి గిన్నెలో రవ్వ ఒకటికి రెండు చొప్పున
నీళ్ళు పోయాలి. నీరు మరుగుతున్నప్పుడు పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి. నీళ్ళు
రెండు పొంగులు రానిచ్చి బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి.
సన్నని సెగపై ఉంచి ఉడికించాలి. ఉడికిన తర్వాత దింపి చల్లారనిచ్చి చిన్న చిన్న ఉండలు
చేసి పళ్ళెములో వేయాలి. మైదా పిండిలో కొద్దిగా తినే సోడా వేసి కొద్దిగా బెల్లం తరిగి వేసి
నీళ్ళు పోసి బజ్జీల పిండివలె కలపాలి. పిండిలో కొంచెం ఉప్పు వేస్తే రుచిగా ఉంటుంది.
బాండీలో నూనె వేసి కాగానిచ్చి ఒక్కొక్క ఉండని కలిపిన పిండిలో ముంచి నూనెలో
వేయాలి. చక్కగా వేగిన తర్వాత తీసి మరొక వాయి వేయాలి. ఇవి రెండు, మూడు రోజుల
వరకు ఉంటాయి. శెనగపప్పు పూర్ణాలకంటే తేలికగా తయారు చేసుకోవచ్చు.