వినాయక చవితి స్పెషల్

 

 

 

ఉండ్రాళ్ళు

 

 

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి            -   ఒక కప్పు (మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి)
నువ్వులు                 -  అర కప్పు
కొబ్బరి తురుము       -  ఒక కప్పు
యాలకల పొడి          -  అర టేబుల్ స్పూన్
ఉప్పు                      -  సరిపడా

 

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్ళు, బియ్యం పిండి, నువ్వులు వేసి బాగా కలిపి ఉప్పు కూడా వేసి  ఉడికించుకోవాలి.   పది నిముషాలు ఉడికించు కున్న పిండిని స్టవ్ మీద నుంచి కిందికి దించుకుని చల్లార్చి చిన్ని చిన్ని ఉండలుగా చేసుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నీళ్ళు వేసి మరిగించి ఇందులో కొబ్బరి తురుము మరిగించాలి తర్వాత బియ్యం పిండితో చేసిన చిన్ని ఉండలను ఈ మిశ్రమం లో వెయ్యాలి.

 

 

 

పాలతాలికలు

 

 

కావలసిన వస్తువులు
‌పాలు     -   ఒక లీటరు.
‌సగ్గు బియ్యం     -   ‌వందగ్రాములు.
‌జీడిపప్పు     -   కొద్దిగా.
‌కిస్‌మిస్‌     -   కొద్దిగా.
‌యాలకుల పొడి     -   ఒక టీ స్పూను.
నెయ్యి     -  కొద్దిగా.
బియ్యపిండి     -   వందగ్రాములు.
మైదాపిండి     -   రెండు టీ స్పూన్లు
పంచదార     -   200గ్రా.
‌బెల్లం     -   పావుకేజి.

 

తయారు చేసే విధానం:
ముందుగా పాలలో నీటిని కలిపి మరిగించాలి. పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి సగ్గుబియ్యం ఉడుకుతున్న తేటతో (సగ్గుబియ్యం రాకుండా పాలు మాత్రమే) చక్కిలాల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చక్కిలాలను ఒత్తినట్లు మరుగుతున్న పాలలోకి ఒత్తాలి. ఇవే తాలికలు. ఇవి పాలలోనే ఉడుకుతాయి. ఒక తీగ మరొక తీగ మీద పడకుండా విడివిడిగా వచ్చేటట్లు చూడాలి. ఒకదానిమీదకొకటిగా పడితే ఉడికేటప్పుడు కలిసి ముద్దవుతాయి.తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, ఏలకుల పొడిని వేసి కలపాలి. ఇప్పుడు పైన రెండు స్పూన్ల నెయ్యి వేసి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించాలి.

 

 

కుడుములు

 

 

కావలసిన పదార్థాలు:
 బియ్యపుపిండి - రెండు కప్పులు
శనగపప్పు - అర కప్పు
నెయ్యి - ఒక స్పూన్‌
ఉప్పు, - తగినంత

 

తయారీ విధానం:
ముందుగా  స్టవ్ వెలిగించుకుని  పాన్ పెట్టుకుని  బియ్యం రవ్వని శనగపప్పును కలిపి ఉడికించుకోవాలి.  తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి వేడయ్యాక, అందులో స్పూన్‌ నెయ్యి వేసి శనగపప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి. శనగపప్పు వేగాక వెంటనే నీళ్లు పోసి మరగనివ్వాలి. అందులో తగినంత ఉప్పు వేసి, ఆ తర్వాత బియ్యపుపిండిని వేసి ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి. వెంటనే మూతపెట్టి 5 నిమిషాలు ఉక్కిరిపట్టాలి. నీరంతా పిండి పీల్చేసుకున్నాక స్టౌ మీద నుంచి దించేసుకోవాలి. ఆ పిండిని కుడుములు లా చేసుకోవాలి.