హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ( ఎమ్మెల్సీ ఎన్నికల, పోలింగ్ కు ఇంకా వారం రోజులకు పైగానే సమయం వుంది. ఏప్రిల్ 23 న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయినా ఇంకా పోలింగే జరగక పోయినా,ఫలితం అయితే వచ్చేసింది.గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో తెలిసి పోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం(ఎల్ఎసీ)ఎలెక్టోరల్ కాలేజీ లో పార్టీలకు ఉన్న బలా బలాను బట్టి చూస్తే,ఎంఐఎం గెలుపుకు ఢోకా లేదు. అయితే, ఫలితం ముందుగానే తెలిపోయినా, ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది? అంటే, అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణం అంటున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం (ఎల్ఎసీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు.ఈ లెక్కన, ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. సో, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపుకు ముందు గానే ఖారరై పోయింది
అందుకే, కావచ్చును,ఎలెక్టోరల్ కాలేజీలో 24 ఓట్లున్న బీఆర్ఎస్, 14 ఓట్లున్న అధికార కాంగ్రస్ పార్టీ పోటీకి దిగలేదు.కానీ, పాతిక ఓట్లు మాత్రమే ఉన్న బీజేపీ మాత్రం, బరిలో దిగింది. సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నేమారుగోముల గౌతం రావును బీజేపీ బరిలో దింపింది. మరో వంక అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలవి కాని చోట అధికులం అనరాదు అనుకున్నారో, లేక ఇంకా ఏదైనా ‘రహస్యం’ వుందో ఏమో కానీ, ముందుగానే ఓటమిని అంగీకరించి, చేతులెత్తేశాయి. తమ అభ్యర్ధులను బరిలో దింప లేదు.
దీంతో హైదరాబాద్ ఎల్ఎసీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే మిగిలాయి. అయితే, ఏదో అద్భుతం జరిగితే తప్పించి, ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి గెలుపును ఆపడం, మోదీ, షా దిగి వచ్చినా అయ్యేపనికాదని అంటున్నారు. అయితే ఈ వాస్తవం బీజేపీకి తెలియదా అంటే తెలుసు. అయితే ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డు కునేందుకే పార్టీ నాయకత్వం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే, కేవలం ఎంఐఎం ఏకాగ్రీవాన్ని నిరోధించడం మాతమే కాదు, గెలిచేందుకు కూడా పోటీ చేస్తున్నామని బీజీపే నాయకులు, మరోమాట అంటున్నారు. అంతే కాదు, మా గెలుపు లెక్కలు మాకున్నాయని కొంచెం ధీమాగానే చెపుతున్నారు.
కాషాయ పార్టీ క్రాస్ వోటింగ్ పై హోప్స్ పెట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. మరో వంక ఓటింగ్ లో పాల్గొంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు లేక పోలేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోవంక ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీల స్టాండ్ ఏమిటి అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మాకు బలం లేదు, అందుకే పోటీచేయడం లేదు అంటున్నారే, కానీ, తమ మద్దతు ఎవరికో చెప్పడం లేదు. అంతేకాదు, మద్దతు గురించి చెప్పక పోవడమే కాదు, అసలు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. మరో వంక మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందనీ, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు.
మరో వంక, బీజేపీ హిందూ కార్డును తెర పైకి తెచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, అటో ఇటో తేల్చుకోవాలని కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని, శనివారం (ఏప్రిల్ 12) గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆహ్వానం మేరకు, ఆకాశపురి, హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన సమయంలో బండి సంజయ ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. ఎంఐఎంను గెలిపించి హిందువుల ఆగ్రహానికి గురికావద్దని పరోక్షంగా హెచ్చరించారు. అంతే కాకుండా ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మల్యే రాజా సింగ్ అద్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రలో రాజకీయాలతో సంబంధం లేకుండా లక్ష మందికి పైగా హిందువులు ముఖ్యంగా యువతీ యువకులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఐఎం ఓడించేందుకు , బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు.
అయితే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు లేదా ఇతరత్రా కారణాల కారణంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేస్తారా? అనేది, ఎలా ఉన్నా ఆసలు అ రెండు పార్టీలు ఓటింగ్ లో పాల్గొంటాయా? లేదా? అనేది అన్నిటినీ మించిన బిగ్ క్వశ్చన్ అంటున్నారు.
అదలా ఉంటే ఎంఐఎం మాత్రం గెలుపు విషయంలో ధీమాగా వుంది. అంతే కాకుండా, బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం యూపీ, సహా అనేక ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నఆరోపణలకు, ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర పోటీ సమాధానం అవుతుందని ఎంఐఎం నాయకులు సంతోషిస్తున్నారు. అలాగే బీజేపే కూడా రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో హిందూ వ్యతిరేక ఎంఐఎంను నిరిధించే సత్తా, సంకల్పం ఒక్ బీజేపీకి మాత్రమే ఉన్నాయని నిరూపించుకునేందుకు, తద్వారా హిందూ ఓటు బ్యాంకును పతిష్ట పరచుకునేందుకు, ఇదొక అవకాశంగా బావిస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే, ఫలితం ముందుగానే తేలి పోయినా హైదరాబాద్ ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నిక, మరో కోణంలో ఆసక్తిని రేకేతిస్తోందని అంటున్నారు.