యాకుబ్‌ ఉరితాడు అక్కడనుండి వచ్చిందే..

 

1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్‌ మెమెన్‌ను ఈరోజు ఉదయం 7 గంటలకు ఉరి తీశారు. అయితే యాకుబ్‌ మెమెన్‌ ఉరితాడును బిహార్‌లోని బక్సర్‌ కేంద్ర కారాగారం నుండి తెప్పించారు. అంతేకాదు దేశంలో ఏ జైలులో ఉరిశిక్ష అమలు చేయాలన్నా ఉరితాడు ఇక్కడినుండి రావాల్సిందే. గతంలో పాక్‌ ఉగ్రవాది కసబ్‌ను 2012లో పుణెలోని యరవాడ జైల్లో.. పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్‌గురును 2013లో తీహార్‌ జైల్లో ఉరితీయడానికి వాడిన తాళ్లను బక్సర్‌ సెంట్రల్‌ జైలు నుంచే తెప్పించారు. కాగా అతడి మృతదేహానికి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో పోస్టు మార్టం నిర్వహించి అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేయడానికి నాగ్ పూర్ నుండి ముంబైకు తరలిస్తున్నారు. అయితే తొలుత యాకుబ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేయాలా లేక జైలులోనే ఖననం చేయాలా అని అధికారులు డైలమాలో పడ్డా ఆఖరికి తన కుటుంబసభ్యులకే అందజేయాలని నిర్ణయించుకున్నారు. కాగా ముంబైలోని ముస్లీం శవవాటికలో మెమెన్ అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో మెరైన్ లైన్ ముస్లీం శవవాటిక వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.