యాకుబ్ మీమన్ కి ఉరి అమలు

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాకుబ్ మీమన్ రెండవసారి పెట్టుకొన్న క్షమాబిక్ష పిటిషన్ని కూడా తిరస్కరించడంతో అతనిని ఈరోజు ఉదయం 7గంటలకి నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా నిన్న అర్ధరాత్రి తరువాత మళ్ళీ యాకుబ్ కేసును విచారణకు చేప్పట్టింది.

 

యాకుబ్ ఉరి శిక్షను నిలిపి వేయాలని కోరుతూ అతని తరపున లాయర్ ప్రశాంత్ భూషణ్, రాజు రామచంద్రన్‌ తదితరులు మళ్ళీ నిన్న అర్ధరాత్రి తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్. దత్తు ఇంటి తలుపులు తట్టడంతో ఆయన మళ్ళీ ఈ కేసును నిన్న విచారించి తీర్పు చెప్పిన త్రిసభ్య ధర్మాసనాన్ని వారి అభ్యర్ధనను పరిశీలించి తీర్పు చెప్పమని కోరడంతో ఈరోజు తెల్లవారు జామున 3-4.30 గంటల వరకు దీనిపై సుప్రీం త్రిసభ్య బెంచి పునర్విచారణ చేప్పట్టింది.

 

యాకుబ్ ని ఉరి తీసే ముందు కనీసం ఏడు రోజుల ముందు ‘డెత్ వారెంట్’ అందించాలని కానీ ఆవిధంగా చేయనందున అతని హక్కుల ఉల్లంఘన జరిగిందని కనుక అతని ఉరి శిక్షను నిలిపివేయాలని అతని న్యాయవాదులు వాదించారు. కానీ అతనికి టాడా కోర్టు ఉరి శిక్ష విధించినప్పుడే డెత్ వారెంట్ జారీ చేసిందని కనుక మళ్ళీ కొత్తగా మరోమారు డెత్ వారెంట్ జారీ చేయవలసిన అవసరం లేదని భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదించారు. ఏదో విధంగా యాకుబ్ ఉరి శిక్షను వాయిదా వేయించాలనే ఉద్దేశ్యంతోనే అతని న్యాయవాదులు ఈవిధంగా పదేపదే పిటిషన్లు వేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని, వాటిని సుప్రీం ధర్మాసనం అనుమతించరాదని, యాకుబ్ కి ఉరి శిక్షని నిలిపివేయరాదని ఆయన వాదించారు. తెల్లవారు జామున సుమారు 4.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య బెంచి యాకుబ్ మీమన్ కేసు విషయంలో ఎక్కడా తప్పు జరుగలేదని అతనికి ఉరి శిక్ష వేయడం సమంజసమేనని తీర్పు చెప్పింది.

 

అప్పటికే యాకుబ్ మీమన్ ఉరి శిక్ష అమలుకు నాగపూర్ జైలు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పద్ధతి ప్రకారం చివరి సారిగా నిన్న రాత్రి అతని కుటుంబ సభ్యులతో అతనిని మాట్లాడనిచ్చారు. అతనికి ఇష్టమయిన కిచిడిని ఇచ్చారు. అతను దానిని కొద్దిగా మాత్రమే తిన్నాడు. అవతల సుప్రీం ధర్మాసనంలో అతని ఉరిశిక్షపై వాదోపవాదాలు జరుగుతుంటే మరోవైపు జైలు అధికారులు అతనిని ఉరి శిక్షకు సన్నధం చేస్తున్నారు. సుప్రీం ధర్మాసనం అతని ఉరి శిక్షను ఖరారు చేసినట్లు దృవీకరించుకొన్న తరువాతనే అతనిని డిజిపి, మేజిస్ట్రేట్ సమక్షంలో ఈరోజు ఉదయం 7గంటలకు ఉరి తీశారు. అనంతరం అతని శవానికి పోస్ట్ మార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అందజేస్తారు.

 

ఇదివరకు ఎన్నడూ లేనంతగా యాకుబ్ ఊరిపై దేశంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అతనిని ఉరి తీసినందుకు ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉంది కనుక ఇంటలిజెన్స్ విభాగం దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్ర అంతటా ప్రధానంగా నాగపూర్, ముంబైలలో పోలీసులను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగానే భద్రతని మరింత కట్టుదిట్టం చేసింది.