వ్యాపారానుకూల దేశాలలో మెరుగుపడిన భారత్ ర్యాంకింగ్
posted on Oct 29, 2015 10:45AM
భారతదేశంలో వ్యాపారానికి అత్యంత అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుజరాత్ తరువాత రెండవ స్థానంలో ఉందని కొన్ని రోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఈసారి ప్రపంచ దేశాలలో వ్యాపారానుకూల వాతావరణం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఉన్న189 దేశాల జాబితాను ప్రపంచ బ్యాంక్ నిన్న ప్రకటించింది. ఆ జాబితాలో భారత్ కి 130వ స్థానం దక్కింది. గత ఏడాది ఇదే సమయానికి భారత్ 142వ స్థానంలో ఉండగా, ఏడాది సమయంలోనే 12 స్థానాలు మెరుగుపడి 130వ స్థానానికి భారత్ చేరుకోవడం విశేషం.
ఈ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీధే నని ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. మోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యవస్థలలో అనేక సంస్కరణలు చెప్పట్టారు. అభివృద్ధి నిరోధకాలుగా ఉన్న అనేక అవరోధాలను గుర్తించి తొలగిస్తున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తత్ఫలితంగా పాలనలో పారదర్శకత, వేగం పెరిగాయి. గత ఏడాదిన్నర కాలంలో మోడీ చేసిన విదేశీ పర్యటనలలో భారత్ పట్ల ప్రపంచ దేశాలకున్న నిశ్చిత దురాభిప్రాయలను పటాపంచలు చేసి, భారత్ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అని అక్కడ వ్యాపారావకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయనే విషయం ప్రపంచాదేశాలకి చాటి చెప్పారు. తత్ఫలితంగా భారత్ పట్ల ప్రపంచ దేశాల అభిప్రాయాలు కూడా మారడం మొదలయ్యాయి.
భారత్ లో ప్రస్తుతం సంస్కరణలు చాలా వేగంగా జరుగుతున్నాయని, ఒకవేళ ఇదే ఊపు కొనసాగిస్తే వచ్చే ఏడాదినాటికి భారత్ ర్యాంక్ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూప్ డైరెక్టర్ లోపెజ్ క్లారోస్ అన్నారు. భారత్ లేకుండా ఇంటర్నెట్ తో ప్రపంచ దేశాలను అనుసంధానం చేయడం సాధ్యం కాదని, భారత్ లో విస్తృతంగా వ్యాపారావకాశాలు ఉన్నాయని ఫేస్ బుక్ సి.ఈ.ఓ. మార్క్ జూకర్ బెర్గ్ చెప్పడమే అందుకు చక్కటి ఉదాహరణ.
గమ్మతయిన విషయం ఏమిటంటే ఒక ప్రపంచ ప్రసిద్ధి పొందిన గొప్ప ఆర్ధికవేత్త డా.మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ 142స్థానంలో ఉంటే, బస్టాండులో టీ అమ్ముకొనే వ్యక్తి నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే ఏడాది కాలంలోనే ఒకేసారి 12స్థానాలు ఎగ్రబ్రాకి 130కి చేరుకొంది.
ప్రపంచ బ్యాంక్ ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట నిన్న విడుదల చేసిన జాబితాలో సింగపూర్ నెంబర్:1 స్థానంలో నిలవగా ఆ తరువాత స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్, డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్, బ్రిటన్, అమెరికా దేశాలు నిలిచాయి. ఈ జాబితాలో చైనాకు 84వ స్థానం, పాకిస్థాన్‌కు 138వ స్థానం దక్కింది. గతేడాదితో పోలిస్తే పాకిస్థాన్ ర్యాంకు 10 స్థానాలు దిగజారగా భారత్ 12 స్థానాలు ఎగ్రబ్రాకి 130కి చేరుకొంది.
ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వంపై పట్టు కోల్పోయారని, డా.మన్మోహన్ సింగ్ వద్ద ఆర్ధిక పాఠాలు నేర్చుకొన్నారని ఎగతాళి చేసేవారికి చెంపదెబ్బ వంటిదని చెప్పవచ్చును.