ఇప్పుడు ఆనాయకుడి పరిస్థితి ఎంటో!!

మనం ఒకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడు అన్నట్టు.. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది. ఇప్పుడు ఒక యువ నాయకుడి పరిస్థితి అలానే ఉంది. గద్దెనెక్కాలన్న ఆశ.. ఆ ఆశ ఎన్ని రాజకీయ కుట్రలు చేయడానికైనా వెనుకాడనీయదు అనడానికి ఈ నోటుకు ఓటు కేసే ఒక నిదర్శనం. ఎలాగైనా తెదేపా పార్టీని దెబ్బగొట్టాలి అన్న పంతంతో ఒక యువ నాయకుడు.. అతని తండ్రికి ఎంతో ఇష్టుడైన ఒక పోలీసు అధికారి కలిసి ఆడిన గేమ్ లో చివరికి అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ వలలో కేసీఆర్ పడ్డారు. గత సంవత్సరకాలం నుండే వాళ్లిద్దరు కలిసి ఈ డ్రామాను స్టార్ట్ చేసిన దానిలో తెలియక కేసీఆర్ కూడా ఇరుకున్నట్టు తెలుస్తోంది. చివరికి అది ఇద్దరు సీఎంల మధ్య రగడగా మారింది. కేసీఆర్ కూడా చంద్రబాబును ఇరికించాలని చూసినా అసలు తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. దీంతో ఆఖరికి తాము తీసిన గోతిలో తామే పడ్డట్టు అయింది.

 

మరోవైపు ఈ కుట్రవల్ల హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు తెరపైకి వచ్చింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలుచేయడానికి పూర్తి వ్యతిరేకం.. ఒకవేళ సెక్షన్ 8 అమలు చేస్తే కేంద్రంతో పోరాడటానికైనా సిద్దమని కేసీఆర్ తేల్చిచెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిందే అని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం చొరవతో హైదరాబాద్ లో బాధ్యతలన్నీ గవర్నర్ కు అప్పగించారు. అయితే సెక్షన్ 8 వల్ల ఒక రకంగా కేసీఆర్ కు కొంత నష్టమే అని విశ్వసనీయవర్గాల వినికిడి. కాగా ఈ సెక్షన్ 8 అమలు వల్ల జీజేపీ కి రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ఎందుకుంటే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడం వల్ల అటు మిత్రపక్షమైన టీడీపీతో ఎటువంటి బేధాలు ఉండవు. మరోవైపు కేసీఆర్ ఎంఐఏం పార్టీతో పొత్తుతో కార్పోరేషన్ ఎలక్షన్స్ లో బరిలో దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పీడ్ కు బ్రేక్ వేయాలంటే ఇదే ఛాన్స్. ఈ సెక్షన్ 8 అమలు వల్ల పోలీస్ వ్యవస్థ మొత్తం గవర్నర్ చేతిలో ఉంటుంది. గవర్నర్ కూడా కేంద్రం చర్యలను అతిక్రమించి చేయరు కాబట్టి భద్రత వ్యవస్థ తమ చేతిలో ఉన్నట్టే. దీంతో కేంద్రానికి సెక్షన్ 8 వల్ల లాభమే తప్ప నష్టంలేదని స్పష్టమవుతోంది. మొత్తానికి ఒక చెడుసావాసం వల్ల కేసీఆర్ కు చెడు తప్ప మంచి జరగలేదని తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా ఈ కేసు వ్యవహారంలో ఏదో ఒకటి జరిగి ఇద్దరు సీఎంల మధ్య సంధి కుదిరి కేసు సద్ధుమణిగితే ఇప్పుడు ఆ యువనాయకుడు పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలాగూ ఇటు తెలంగాణలో ఆపార్టీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం.. అటు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే తనపై మండిపడుతున్న ప్రజలలో మళ్లీ తన ఉనికిని తీసుకురావాలంటే కష్టతరమైనదే. దీంతో అటు ఆంధ్రాకి.. ఇటు తెలంగాణకి కూడా కాకుండా పోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కనుక రెండు పడవలు మీద కాలు పెడితే మునిగి పోవడం ఖాయం అని ఆయువ నాయకుడు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.