రేవంత్ సర్కార్ బిగ్ ప్లాన్.. కేటీఆర్‌కు దిమ్మతిరిగే షాక్ తప్పదా?
posted on Nov 16, 2024 8:50AM
నన్ను అరెస్టు చేయండి.. మీకు దమ్ముంటే అరెస్టు చేసి జైలుకు పంపించండి.. జైల్లో మంచిగా యోగా చేస్తా.. స్లిమ్‌గా తయారవుతా.. ఆ తరువాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా.. ఇవీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు. ఎంత వీలైతే అంత తొందరగా జైలు కెళ్లాలన్న ఉత్సాహం కేటీఆర్‌లో కనిపిస్తోంది. ఆయన తీరుతో బీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. ఎవరైనా అరెస్టు అంటే ఎలా తప్పించుకోవాలా అని చూస్తారు. కేటీఆర్ మాత్రం పదేపదే నన్ను అరెస్టు చేయండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంగా మారింది.
గత దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జైలు జీవితం గడిపి వచ్చిన వారు ముఖ్యమంత్రి పీఠాలను అదిరోహిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి కాక మునుపు జైలు జీవితం గడిపి వచ్చినవారే. దీంతో కేటీఆర్ సైతం అదే ఫార్ములా ఫాలో కావాలని తొందరపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం తనను అరెస్టు చేస్తుందని భావించిన కేటీఆర్, అందుకు రెడీ అయిపోయారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలపై దృష్టిసారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ- కార్ రేసింగ్ నిర్వహణలో కేటీఆర్‌పై అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా లగచర్ల ఘటనలోనూ కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన విచారణలో కేటీఆర్ కనుసన్నల్లోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగిందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరో వారం రోజుల్లో కేటీఆర్ అరెస్టు కాబోతున్నారన్న సంకేతాలను పోలీసులు ఇచ్చేశారు. దీనికితోడు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ఇటీవల భేటీ సందర్భంగా సీఎం రేవంత్ గవర్నర్ కు అందజేసినట్లు తెలిసింది. కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను రేవంత్, కాంగ్రెస్ నేతలు కోరినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఈ క్రమంలో రాత్రివేళల్లో కేటీఆర్ ఇంటివద్దకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. రాత్రంతా అక్కడే ఉంటున్నారు. తన అరెస్టు ఖాయమని భావిస్తున్న కేటీఆర్, ముందుగానే తనను జైలు పంపించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసి సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించినా రెండుమూడు నెలల్లో బెయిల్ పై బయటకు రావచ్చునని కేటీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ను జైలుకు పంపిస్తే మహా అంటే ఐదు నెలలు జైల్లో ఉంటాడేమో, ఆ తరువాత బెయిల్ పై బయటకు వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఒక్కసారి జైలుకు వెళితే.. సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు కేటీఆర్ బయటకు రాకుండా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ-ఫార్ములా కార్ రేసింగ్ కేసు, తాజాగా లగచర్ల ఘటన కేసుల విషయంలో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో ఏ ఒక్క కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లినా.. ఆ తరువాత వరుసగా మరిన్ని కేసులు బనాయించి సుదీర్ఘకాలం కేటీఆర్ జైల్లోనే ఉండేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కేటీఆర్ సుదీర్ఘ కాలం జైల్లో ఉంటే.. కేసీఆర్ బయటకు వచ్చినా పూర్తి స్థాయిలో రాజకీయాలకు సమయం వెచ్చించే పరిస్థితులు ఉండవన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఆనారోగ్య కారణాల దృష్ట్యా గతంలోలా ఇప్పుడు ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే పరిస్థితి లేదని కొందరు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సైతం ఇప్పట్లో పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్ లో ఇక మిగిలింది. హారీష్ రావు. ఒక్కసారి హరీష్ రావు చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళితే.. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కు అది పెద్ద అవరోధంగా, అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ సుదీర్ఘకాలం జైలుకే పరిమితం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.