పుల్లెల శ్రీరామచంద్రుడు అస్తమయం

 

ప్రముఖ రచయిత పుల్లెల శ్రీరామచంద్రుడు బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో ఆయన అస్తమించారు. పుల్లెల శ్రీరామచంద్రుడు తెలుగు, సంస్కృత భాషలలో రెండు వందలకు పైగా రచనలు చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. 2011 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.


పుల్లెల శ్రీరామచంద్రుడు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం మండలం, ఇందుపల్లి గ్రామంలో జన్మించారు. మహామహోపాధ్యాయగా కీర్తించబడిన పుల్లెల శ్రీరామచంద్రుడు వివిధ సాహిత్య ప్రక్రియలలో గత 5 దశాబ్దాలుగా అవిరళకృషి చేశారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలనుండి తెలుగు భాషలోనికి 80కు పైగా అనువాదాలు చేశారు. 120 వరకు గ్రంథాలు ప్రచురించారు. ఇతిహాసం, వ్యాకరణం, అలంకారం, ప్రాచీన చరిత్ర, వేదాంత గ్రంథాలే కాక వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రతిపదార్థవ్యాఖ్యలు చేశారు. అనేక సంస్కృత రచనలు తెలుగువారికి తేట తెలుుగులో అందుబాటులోనికి తెచ్చారు.

పుల్లెల రామచంద్రుడు అలంకారశాస్త్రంలో ముఖ్యంగా కావ్యాలంకారం, కావ్యదర్శం, కావ్యప్రకాశం, ధ్వన్యాలోకం, కావ్యమీమాంస, వక్రోక్తిజీవితం మొదలైన సంస్కృతసాహిత్య ప్రక్రియలలో విశేషకృషి చేశారు. శంకరాచార్యుని బ్రహ్మసూత్ర, గీతాభాష్యాలను అనువదించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత భాషా శాఖ ఆచార్యులుగా పలువురు శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దారు. పుల్లెల శ్రీరామచంద్రుడు అందుకొన్న పురస్కారాలలో కొన్ని.... తెలుగుభాషా పురస్కారం. (2011 - సి.పి.బ్రౌన్‌ అకాడమీ)
శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం. (1997 - గుప్త ఫౌండేషన్‌, ఏలూరు)