ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు...

 

ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న తెలంగాణా ప్రభుత్వం తన ఉద్యోగులకు చాలా ఉదారంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తుంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారుతోంది. ఇదివరకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం 47 శాతం వరకు జీతాలు పెంచినప్పుడు, ఆ ప్రభావం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా పడింది. ప్రభుత్వం తమ జీతాలు ఇవ్వడానికే నెలనెలా వెతుకొనే పరిస్థితిలో ఉందని తెలిసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రభుత్వం ముక్కు పిండి మరీ అంత ఇంక్రిమెంటు తీసుకొన్నారు.

 

ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం తన 56,000 మంది ఆర్.టి.సి. ఉద్యోగులు ప్రత్యేక ఇంక్రిమెంటు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి. ఉద్యోగులు అందరూ సంతోసహించడం సహజమే. కానీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ఆర్.టీ.సి. ఉద్యోగులు కూడా తమకూ తెలంగాణా ఉద్యోగులతో సరిసమానంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని పట్టుబడితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి అప్పుడు మూలిగే నక్కమీద తాటి పండు పడినట్లుగా ఉంటుంది.

 

రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఆర్.టి.సి. కూడా తీవ్రంగా నష్టపోయింది. ఆ సమస్య నుండి ఏవిధంగా బయటపడాలా అని చూస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు అత్యవసరంగా మరో సమస్యను పరిష్కరించవలసి వస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కనుకనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటువంటివి పెద్ద సమస్యలుగా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పుంజుకొంటే అప్పుడు తెలంగాణా ప్రభుత్వంతో పోటీపడి మరీ తన ఉద్యోగులకు కూడా జీతాలు పెంచగలదని ఖచ్చితంగా చెప్పవచ్చును.