చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసును క్వాష్ చేయాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం (జనవరి 10)  తొసిపుచ్చింది. ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి  సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.  దీనిని కొట్టివేయాలంటూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా  హైకోర్టు ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14)   తనపై దుండగులు దాడి చేశారని తల్లిదండ్రులకు చెప్పింది. స్కూలు నుంచి తిరిగి వస్తుంటే ముసుగు ధరించిన కొంతమంది వ్యక్తులు తనను అడ్డుకుని, మత్తుమందు తాగించారని తెలిపింది. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సదరు బాలిక చదివే స్కూలుకు వెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

దీనిపై  స్పందించిన పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు. అయితే, బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 

కాగా హైకోర్టు  చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చడంతో  పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించాలని చెవిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.