త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు
posted on Oct 22, 2014 6:59AM
తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, మూస పద్దతిలో కాక తెలంగాణా రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా బడ్జెటు తయారు చేయమని అధికారులకు ఆదేశించినందున బడ్జెట్ తయారీలో కొంత జాప్యం జరిగింది. ఇక రెండవ కారణం-తీవ్ర రెవెన్యూ లోటు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ, ఆ తరువాత ఈ ఐదు నెలల కాలంలో వివిధ ఆదాయ వనరుల ద్వారా రాష్ట్రానికి ఆశించినంతగా ఆదాయం సమకూరకపోవడం కూడా ఈ జాప్యానికి కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత వివిధ శాఖల ద్వారా తెలంగాణా రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలకు భిన్నంగా చాలా తక్కువ ఆదాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. జూలై-సెప్టెంబరు నెలలలో వివిధ శాఖల ద్వారా రూ.10,611 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని భావిస్తే, అందులో మూడవ వంతు కూడా సమకూరలేదని తెలుస్తోంది. వ్యాట్ టాక్స్ ద్వారా రూ. 7,875 కోట్లు రాబడి వస్తుందని అంచనా వేస్తే అక్టోబరు చివరినాటికి కేవలం రూ. 4,500 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,125 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం రూ. 700కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇక స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.960కోట్లు ఆదాయం ఆశించగా అందులో సగం మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మోటార్ వాహనాలపై ట్యాక్స్ వసూళ్లదీ అదే పరిస్థితి. రూ.651కోట్లు ఆదాయం ఆశించగా కేవలం రూ.425కోట్లు మాత్రమే వసూలయినట్లు సమాచారం.
ఈ ఆదాయపు లోటుకు తోడు, అదనపు విద్యుత్ కొనుగోలుకు భారీ మొత్తాలు వెచ్చించవలసి రావడం, పంట రుణాల మాఫీ ఇత్యాదులు ఆ లోటును మరింత పెంచేలా చేస్తున్నాయి. అందువల్ల రూ.75,000 కోట్లతో భారీ బడ్జెటు రూపొందించాలని తెలంగాణా ప్రభుత్వం భావించినప్పటికీ ఈ తీవ్ర ఆదాయ లోటు కారణంగా బడ్జెట్‌ని కుదించక తప్పని పరిస్తితి కనబడుతోంది. ఒకవేళ ఆదాయానికి తగినట్లు బడ్జెట్ ను కూడా కుదించవలసివస్తే అన్నిటికంటే ముందు సంక్షేమ కార్యక్రమాలపైనే వేటు పడవచ్చును. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే నెల మొదటి వారం నుండి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈనెల 24న ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణా భవన్ లో సమావేశమయ్యి బడ్జెట్ సమావేశాలకు వ్యూహ రచన చేయబోతున్నారు. ఆ తరువాత వెంటనే తెరాస యల్పీ సమావేశం నిర్వహించి, అదే రోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశం కూడా నిర్వహించేందుకు అవసరమయిన కసరత్తు జరుగుతోంది. మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులపై మరింత లోతుగా చర్చించిన తరువాత, సమావేశ తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల 5నుండి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యి 23వరకు కొనసాగుతాయి. వచ్చే నెల 7న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు సమాచారం.