కోలుకొంటున్న ఉత్తరాంధ్ర

 

హుద్ హూద్ తుఫాను తాకిడికి విలవిలాడిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఇప్పుడిపుడే మెల్లగా కోలుకొంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విశాఖలో వారం రోజులు మఖం వేసి తుఫాను సహాయ,పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించిన కారణంగానే ఇది సాధ్యమయిందని చెప్పవచ్చును. ఆయన ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, కడప, కర్నూలు తదితర జిల్లాలు, పొరుగు రాష్ట్రమయిన ఓడిషా నుండి విద్యుత్, వైద్య, మున్సిపల్, ఫైర్ సర్వీస్ సిబ్బందిని రప్పించి, ప్రాంతాల వారిగా వారికి బాధ్యతలు అప్పగించడంతో అన్ని ప్రాంతాలు చాలా త్వరగా సాధారణ స్థితికి చేరుకోగలుగుతున్నాయి.చుట్టుపక్కల జిల్లాల ప్రజలు స్వచ్చంద సంస్థలు, వ్యాపారస్తులు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు, బట్టలు వంటివి భారీ ఎత్తున పంపించి ఉత్తరాంధ ప్రజలకు కష్ట కాలంలో అండగా నిలబడ్డారు.

 

అదేవిధంగా తెలంగాణా ప్రభుత్వం, ప్రజలు కూడా మానవతా దృక్పధంతో స్పందించి యధాశక్తిన సహాయం అందించారు. అంతేకాక తెలంగాణాకు చెందిన కొందరు యువకులు వచ్చి సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొనడం చాలా అభినందనీయం. ఓడిషా మొదలు కొని కడప, కర్నూలు వరకు అనేక ప్రాంతాల నుండి అనేక సహాయక బృందాలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారం రోజుల పాటు రేయింబవళ్ళు సహాయ కార్యాక్రమాలలో పాల్గొన్నారు. వారి సహాయం ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువలేరు. ఇక ఇటువంటి ఆపత్సమయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చేయి తప్ప, సహాయ కార్యక్రమాలలో పాల్గొనకపోవడం చాలా శోచనీయం. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ నేతలు జిల్లా పర్యటనలు చేస్తూ, బాధల్లో ఉన్న ప్రజలకు యదా శక్తిన సహాయపడవలసిందిపోయి, చీపుర్లు పట్టుకొని మీడియాకు ఫోజులు ఇవ్వడానికి, ఓదార్పుకి, ప్రభుత్వం సహాయం డిమాండ్ చేయడానికే పరిమితమయ్యారు. ప్రతిపక్షమంటే ఇలాగే వ్యవహరించాలన్నట్లుంది వారి తీరు.

 

ఇక మున్సిపల్, విద్యుత్ సిబ్బంది గత వారం రోజులుగా అలుపెరుగకుండా చాలా కష్టపడుతున్న కారణంగా మూడు జిల్లాలు ఇప్పుడిపుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. కనుక విద్యుత్ సిబ్బందిలో కూడా కొంత అలసత్వం మొదలయింది. వారం రోజులుగా అంధకారంలో మ్రగ్గుతున్న ప్రజలు విద్యుత్ లేక విలవిలలాడుతుంటే ఇదే అదునుగా విద్యుత్ పునరుద్దరణకు కొన్ని చోట్ల విద్యుత్ సిబ్బంది లంచాలు అడుగుతున్నట్లు పత్రికలలో వార్తలు కూడా వస్తున్నాయి. ఇరుగుపొరుగు జిల్లాల, రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు మానవత్వంతో స్పందిస్తుంటే, స్థానిక విద్యుత్ సిబ్బంది ఈవిధంగా ప్రవర్తించడం చాలా దారుణం.

 

గత వారం రోజులుగా రేయింబవళ్ళు కష్టపడి విద్యుత్ పునరుద్దరణ చేసి మంచిపేరు తెచ్చుకొన్న విద్యుత్ శాఖకి,కొందరు అవినీతిపరుల కారణంగా తీరని అప్రతిష్టకలుగుతోంది.అందువలన ప్రభుత్వం తక్షణమే స్పందించి అటువంటి వారిపై కటిన చర్యలు తీసుకొంటే తప్ప మిగిలిన ప్రాంతాలు విద్యుత్ పునరుద్దరణ సాధ్యపడదు.నేటికీ ఉత్తరాంద్రా జిల్లాలలో అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్దరించవలసి ఉంది.ఇంతవరకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు స్వయంగా సహాయ, పునరావాసకార్యక్రమాలను పర్యవేక్షించారు. కానీ ఇకపై విద్యుత్, వైద్య, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులు అదే స్పూర్తి, సమన్వయం, పట్టుదలతో కృషి చేసినప్పుడే ఉత్తరాంధ్రా తిరిగి సాధారణ స్థితికి చేరుకోగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వారికి అవసరమయిన సహాయం అందించేందుకు సంసిద్దంగా ఉంది కనుక, ఇక వారే ఉత్తరాంధ్ర జిల్లాలను చక్కదిద్దవలసి ఉంటుంది. ఇది వారి బాధ్యత మాత్రమే కాదు, వారి దీక్షా దక్షతలకు ఒక పరీక్ష వంటిది.