వ్యక్తిగత సమస్యలను పార్లమెంటుపై రుద్దుతున్న సోనియా, రాహుల్ గాంధీలు

 

కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇప్పటి వరకు మూడు సార్లు పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడ్డాయి. భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ మొదట అడ్డుపడ్డాయి. ఆ తరువాత లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలను, వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలకు పట్టుబడుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జరగకుండా అడ్డుపడింది. ఈసారి నేషనల్ హెరాల్డ్ కేసులో మోడీ ప్రభుత్వం తమను వేదిస్తోందని ఆరోపిస్తూ సమావేశాలను జరగకుండా అడ్డుపడుతోంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతీసారి పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుపడుతుండటంతో కీలకమయిన అనేక బిల్లులు నిలిచిపోయాయి.

 

మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రియల్ ఎస్టేట్ బిల్లు ద్వారా దేశంలో నిర్మాణ రంగం వేగం పుంజుకొంటుందని ఆశిస్తోంది. అలాగే దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నేరాలలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు చాలా మంది నేరస్తులుగా ఉంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం సంబంధిత చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. అన్నిటికంటే ముఖ్యమయిన ‘జనరల్ సర్వీస్ గూడ్స్ టాక్స్’ బిల్లుని క్రిందటి సమావేశాలలోనే ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కారణంగా అది కూడా ఆమోదానికి నోచుకోలేదు. ఇటువంటివి చిన్నా పెద్ద బిల్లులు కలిపి మొత్తం 36 బిల్లులు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతం కారణంగా ఆ బిల్లులు అన్నీ ఆమోదానికి నోచుకోలేకపోతున్నాయి.

 

మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి చేసిన సవరణల వలన దేశంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీలన్నీ భావించడంతో దానిని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అది ప్రజలకు సంబంధించిన సమస్య కనుక ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు కూడా తప్పు పట్టలేదు. కానీ నేషనల్ హెరాల్డ్ కేసు ఒక పత్రిక యాజమాన్యానికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధి మరో ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినవ్యక్తిగత వ్యవహారం. దానిని దేశ ప్రజల సమస్య అన్నట్లుగా రాహుల్ గాంధితో సహా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడం ఒక పొరపాటయితే, దాని కోసం దేశ భవిష్యత్ ని నిర్దేశించే అనేక ముఖ్యమయిన బిల్లులను అడ్డుకోవడం మరో పెద్ద పొరపాటు.

 

తమకు న్యాయవ్యవస్థపై 100 శాతం నమ్మకం ఉందని చెపుతూనే, మళ్ళీ తమకు అన్యాయం జరిగిపోతోందని పార్లమెంటులో గగ్గోలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే న్యాయవ్యవస్థలను మోడీ ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుంది. కేంద్రప్రభుత్వంపై ఇటువంటి ఆరోపణలు చేస్తు దానిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తద్వారా న్యాయవ్యవస్థపై పరోక్షంగా ఒత్తిడి చేస్తోంది.

 

తమకు న్యాయవ్యవస్థపై 100 శాతం నమ్మకం ఉందని రాహుల్ గాంధి చెప్పుకొంటున్నారు. అలాగే ఇందిరా గాంధీ కోడలినయిన తను ఇటువంటి కేసులను చూసి భయపడబోనని సోనియా గాంధీ గొప్పగా చెప్పుకొన్నారు. మరి అటువంటప్పుడు వారిరువురూ ధైర్యంగా కోర్టులో ఆ కేసును ఎదుర్కొని తమ నిజాయితీని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే అందరూ హర్షించేవారు. కానీ తమ వ్యక్తిగత సమస్యలను ఈవిధంగా పార్లమెంటుపై బలవంతంగా రుద్దుతున్నారు. 

 

కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేస్తానని ఒకప్పుడు రాహుల్ గాంధి గొప్పలు చెప్పుకొన్నారు. కనీ ఆయన కూడా ఇప్పుడు దాని పద్ధతులకే అలవాటు పడిపోయినట్లున్నారు. అందుకే “కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు” చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసు. ఆ తరువాత అయినా కాంగ్రెస్ పార్టీ మారుతుందని అందరూ ఆశించారు. కానీ దాని వైఖరిలో ఎటువంటి మార్పు కనబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.