పాపం... కాంగ్రెస్ పార్టీ!
posted on Dec 11, 2015 10:06AM
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న తీరు శల్యసారధ్యాన్ని తలపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యులు వారిరువురే. ఆ మాట బయటవాళ్ళు ఎవరో అనలేదు కాంగ్రెస్ పార్టీ నేతలే అన్నారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళిద్దరినీ పదవులలో తప్పుకొని సమర్దులయిన వారి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించమని కొందరు కోరారు. వాళ్ళిద్దరూ తప్పుకోలేదు కానీ అలాగ అడిగిన వారిని మెల్లగా పక్కకు తప్పించేసారు. ఆ తరువాత వరుసపెట్టి నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయినా పార్టీని చక్కదిద్దుకొనే ప్రయత్నం చేయలేదు. తమ పొరపాట్లను, బలహీనతలను గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. కనీసం తమ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకొనేందుకు ఇష్టపడలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో అది మళ్ళీ మరొకమారు స్పష్టం అవుతోంది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీలను కోర్టుకు హాజరు కావలసిందేనని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అది తమపై కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ నిన్న పార్లమెంటును స్తంభింపజేశారు. సామాన్య ప్రజలు ఎవరయినా పోలీస్ స్టేషన్ లేదా కోర్టు గుమ్మం తొక్కవలసివస్తే దానిని చాలా అవమానకరంగా భావిస్తారు. ఆ విషయం ఎవరికయినా తెలుస్తుందేమోనని సిగ్గుతో, బాధతో తమలోతామే కుమిలిపోతారు. కానీ ఒక నేరంలో విచారణకు హాజరవుతున్న సోనియా, రాహుల్ గాంధీలు అదేదో చాలా ఘన కార్యమన్నట్లుగా తమ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, పార్టీలో సీనియర్ నేతలు అందరితో కలిసి పాదయాత్ర చేస్తూ ఊరేగింపుగా డిల్లీలోని పాటియాలా కోర్టుకు చేరుకోవాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. తద్వారా మీడియా, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని వారి ఆలోచన. కాంగ్రెస్ ఆలోచనా విధానం ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవడానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే.
ఇంతకంటే గొప్ప విషయం మరొకటి వినబడుతోంది. అదేమిటంటే ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు కోర్టు జైలు శిక్ష విధించవచ్చని తెలుస్తోంది. సాధారణంగా అటువంటప్పుడు బెయిలు తీసుకొని జైలుకి వెళ్ళకుండా తప్పించుకొంటారు. కానీ ఈ కేసులో ఒకవేళ కోర్టు జైలు శిక్ష విదించినట్లయితే, సోనియాగాంధీ మాత్రమే బెయిలు తీసుకోవాలని, రాహుల్ గాంధి బెయిలు కోసం దరఖాస్తు చేసుకోకుండా జైలుకి వెళ్ళాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జైలుకి వెళ్ళినట్లయితే దేశ ప్రజల సానుభూతి పొందవచ్చుననిట! అంతే కాదు..మోడీ ప్రభుత్వం తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ప్రజలకు చాటి చెప్పుకోవడానికి వీలుపడుతుంది. రాహుల్ జైలులో ఉన్నంత కాలం యావత్ దేశంలో ఇదే చర్చ జరుగుతుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఉచిత ప్రచారం, ప్రజలలో సానుభూతి దొరుకుతుంది. కనుక రాహుల్ జైలుకి వెళ్లేందుకే సిద్దం అవుతున్నట్లు సమాచారం. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రజల సానుభూతిని పొందడానికి కోర్టు వరకు పాదయాత్రలు చేయాలనుకోవడం, జైలుకి వెళ్ళాలనుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంలో ఎటువంటి మార్పు రాలేదని, ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు’ చేయకుండా అది ఎన్నడూ మానుకోలేదని అర్ధమవుతోంది.
ఇంతకీ ఇదంతా కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసమే జరుగుతున్నట్లయితే ప్రజలు అర్ధం చేసుకొనేవారు. కానీ ఆ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలలో ఉన్న సోనియా, రాహుల్ గాంధీలపై మోపబడిన తీవ్ర అభియోగాల నుండి ప్రజల దృష్టిని మళ్ళిస్తూ, పనిలోపనిగా మోడీ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికే ఇటువంటి చవకబారు పనులకు పూనుకోవడం చూస్తుంటే “అయ్యో!కాంగ్రెస్ పార్టీ మరీ ఇంతకు దిగజారిపోయిందా” అని అనుకోకుండా ఉండలేరు.
కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవలసిన వారిద్దరూ తమను తాము కాపాడుకోవడం కోసం పార్టీ పరువు ప్రతిష్టలను బజారు కీడ్చడానికి కూడా వెనకాడక పోవడం చాలా విచారకరం. పార్టీని కాపాడవలసినవారే దాని పాలిట శత్రువులుగా మారడం మళ్ళీ వారిని కాంగ్రెస్ పార్టీయే కాపాడుకోవలసి రావడం ఆ పార్టీ దురదృష్టమే తప్ప మరొకటి కాదు. తల్లీ కొడుకులు కలిసి కాంగ్రెస్ పార్టీకి శల్యసారధ్యం చేస్తుంటే పార్టీలో సీనియర్ నేతలు అందరూ కిమ్మనకుండా వారి వెనుక నడుస్తున్నారు. ఇవన్నీ చూస్తూ "పాపం...కాంగ్రెస్ పార్టీ!" అనుకోకుండా ఉండలేము.