అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలేనట!

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రతిపక్షాలపై సీబీఐని ఉసిగొల్పుతూ వారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేసింది. చివరికి తమకు మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, ఆర్.జే.డీ. పార్టీలపై కూడా సీబీఐని ప్రయోగించడానికి వెనకాడలేదు. అప్పుడు వారందరూ ఎంతగా ఆక్రోశించినా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇక నరేంద్ర మోడీని కట్టడి చేయడానికి ఎంతగా ప్రయత్నించిందో దేశప్రజలు అందరూ చూసారు. ఆయనని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత యూపీఏ ప్రభుత్వం ఆయనని అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ దాని ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆయన ఏటికి ఎదురీది తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొని దేశానికి ప్రధాని కాగలిగారు.

 

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నిందితులుగా పేర్కొనడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తప్పుగా కనిపిస్తోంది. తమపై మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కానీ దానిని తాము దైర్యంగా ఎదుర్కొంటామని వారు గొప్పగా చెప్పుకొంటున్నారు. తాను ఇందిరా గాంధీ కోడలునని ఎవరికీ భయపడే మనిషిని కానని సోనియా గాంధీ చెప్పుకొన్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆమె నోట ఇందిరా గాంధీ పేరు వినపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

ఒక రాజకీయ పార్టీ మీడియాకు అప్పు ఇవ్వడం ఎన్నడూ వినలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది! సహజంగానే అది అనుమానాలకు తావిస్తుంది. ఆ తరువాత కొన్ని నెలలకే ఆ సంస్థ మూతపడటం, దాని నుండి రావలసిన బాకీని వసూలు చేసుకొనే హక్కును కాంగ్రెస్ పార్టీ రూ.50 లక్షలకే యంగ్ ఇండియా సంస్థకు కట్టబెట్టడం మరింత అనుమానాలు రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ సొమ్ముని ఒక పద్ధతి ప్రకారం సోనియా గాంధీ, రాహుల్ గాంధి ఖాతాలలోకి మళ్ళించుకోవడానికే ఈ పధకం పన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ వారిరువురితోబాటు మోతీలాల్ ఓరా, శ్యాం పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, అసోసియేటడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ మరియు యంగ్ ఇండియాలను ప్రతివాదులుగా పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు.

 

ఆయన చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తికరమయిన సమాధానం చెప్పకపోగా, మోడీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దానిని నిర్భయంగా ఎదుర్కొంటామని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇటువంటి ప్రత్యారోపణలు చేయడం వలన వారు నిజాయితీ పరులు అయిపోలేరు. కనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తమపై వచ్చిన ఆరోపణలను కోర్టులో ఎదుర్కొని తమ నిజాయితీని నిరూపించుకోగలిగితే బాగుంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu