హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువు హత్య

 

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బంధువైన అరవింద్ సింగ్ మంగళవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. తన భార్యను కారులో ఎయిర్పోర్ట్లో దింపి ఇంటికి బయలుదేరగా దుండగులు బైక్ మీద వచ్చి ఆయన వాహనానికి అడ్డుగా నిలిపారు. తరువాత వారి వద్ద ఉన్న తుపాకీతో అరవింద్ పై కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే అదే రహదారిలో వెళుతున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అరవింద్ సింగ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఘటన జరిగిన ప్రదేశంలో 32 ఖాళీ బులెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వారణాసి రూరల్ ఎస్పీ ఏకే పాండే తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ స్పందిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది లేదని విమర్శించారు.