సెక్షన్ 8 ద్వారా ప్రత్యేక బాధ్యత గవర్నర్ ది
posted on Jul 29, 2015 1:18PM
రాష్ట్రం విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాలు ఎన్నో విషయాల్లో పరస్పరం వాగ్వాదాలు చేసుకున్నాయి.. ఇంకా చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఎప్పుడూ సెక్షన్ 8పై అంతగా దృష్టి పెట్టలేదు. కాని ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు వ్యవహారం వెలుగుచూసిందే అప్పుడే ఈ సెక్షన్ 8 అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్రం సెక్షన్ 8 అమలు అవసరం లేదంటే.. మరోవైపు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉండాలంటే సెక్షన్ 8అమలు చేయాల్సిందే అంటూ ఇరు రాష్ట్రాలు మొండిగానే వ్యవహరించాయి. ఈ సెక్షన్ 8 అమలుపై పాపం గవర్నర్ ను కూడా నేతలు బాగానే విమర్శించారు. దీంతో ఒకానొక సందర్భంలో ఆయన రాజీనామా కూడా చేస్తారు అన్న వార్తలు కూడా వినిపించాయి.
ఇదిలా ఉండగా టీడీపీ లోకసభసభ్యుడు అవంతి శ్రీనివాస్ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని సెక్షన్లను, ప్రత్యేకంగా సెక్షన్ 8ని అమలు చేయాలని కేంద్రం ఏమైనా గైడ్‌లైన్స్ విడుదల చేసిందా? అని ప్రశ్నించగా దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయి సమాధానం ఇస్తూ.. సెక్షన్ 8 అమలుకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదన్నారు. కాగా.. హైదరాబాద్ లో భద్రతా వ్యవస్ధ గురించి భారతీయ జనతా పార్టీ ఎంపి హరిబాబు కూడా కేంద్రానికి లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల్ని కాపాడేందుకు ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కేంద్రం తీసుకున్న చర్యలేంటి? అంటూ ప్రశ్నిస్తూ లేఖ రాశారు. దీనికి కూడా హరిభాయ్ చౌధరి హైదరాబాద్ లో ఉండే ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల భద్రతకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ అయిన నరసింహన్ కు విభజన చట్టం సెక్షన్ 8 ద్వారా ప్రత్యేక బాధ్యత కట్టబెట్టినట్లు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.