రేవంత్‌కి బెయిల్.. కేసీఆర్‌కి జ్వరం...


ఎందుకోగానీ, తెలంగాణ తెలుగుదేశం నాయకుడు, దక్షిణ తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి అంటే టీఆర్ఎస్ నాయకులకు మొదటి నుంచీ దడ. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అధికార టీఆర్ఎస్‌కి వణుకు మొదలవుతూ వుంటుంది. అందుకే అసెంబ్లీలో ఆయన నోరు విప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటుంది. టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే కాదు... టీఆర్ఎస్ అగ్ర నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా రేవంత్ రెడ్డి అంటే ఎక్కడో ఏదో భయం వున్నట్టే అనిపిస్తూ  వుంటుంది. అందుకే రేవంత్ రెడ్డి మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ వుంటారు. ఎవరి విషయంలో చూసీ చూడనట్టు వున్నా, రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వుంటారు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కోసం చాలాకాలంగా వేచివున్న కేసీఆర్‌ ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డిని ఎలా ఇరికించారో చూశాంగా... రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా వుండటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నించింది. తన పెంపుడు పిల్లి లాంటి ఏసీబీని ఆ పనిలో పూర్తిగా నిమగ్నం చేసింది. అయితే న్యాయం అనేది ఒకటి వుంది.. అది ఎప్పటికైనా జరిగి తీరుతుంది. ఆ న్యాయమే రేవంత్ రెడ్డికి హైకోర్టు రూపంలో బెయిల్ మంజూరు చేసింది. అదేంటోగానీ, రేవంత్‌రెడ్డికి అలా బెయిల్ మంజూరు అయిందో లేదో, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇలా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చిందంటూ మంగళవారం నాడు కేసీఆర్ తన కార్యక్రమాలన్నిట్నీ రద్దు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి బయట వున్నప్పుడు పులిలా వుండేవారు. ఆయన్ని ప్రభుత్వం కేసులో ఇరికించిన తర్వాత ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు శక్తి పెరిగిన పులి రూపంలో రేవంత్ రెడ్డి బయటకి వస్తున్నారు. మరి ఇలాంటప్పుడు కేసీఆర్‌కి జ్వరం రావడం న్యాయమే కదా.