చంద్రబాబుకి రామోజీకి మధ్య అందుకే గ్యాప్ వచ్చిందా?

ఈనాడు అంటే టీడీపీ, టీడీపీ అంటే ఈనాడు అన్నంతగా ప్రజల్లో నాటుకుపోయింది, పైగా చంద్రబాబుకి రామోజీ రాజగురువని చెప్పుకుంటారు, ఎన్టీఆర్ పదవీచ్యుతుడ్ని చేసి చంద్రబాబును గద్దెనెక్కించడంలో రామోజీ పాత్ర కూడా ఉందంటారు, అందుకే వీరిద్దరి బంధం...రామ్ కో సిమెంట్ కంటే ధృడమైనది అంటుంటారు, అలాంటిది ఇప్పుడు వీరిద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలవడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి, తనను ముప్పుతిప్పలు పెట్టిన వైఎస్ తనయుడికి రామోజీ ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇచ్చారంటే... రామోజీ-బాబు మధ్య గ్యాప్ వచ్చేవుంటుందని టీడీపీ శ్రేణులు సైతం చెవులు కొరుక్కుంటున్నాయి

మొన్నామధ్య ఇసుక మాఫియాపై చంద్రబాబు సర్కార్ ను ఏకిపారేస్తూ మూడ్రోజులపాటు ఈనాడులో బ్యానర్ ఐటెమ్స్ వచ్చాయి, ఇదేంటీ తెలుగుదేశం గెజిట్ పత్రిక ఈనాడులో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టికల్ రావడమేంటని జనం సైతం ఆశ్చర్యపోయారు, ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, దీన్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ ఈనాడు రాసుకొచ్చింది, ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 3కోట్లు సంపాదిస్తున్నారని, ఇప్పటివరకూ 2వేలకోట్లకు పైగానే దోచేశారని లెక్కలతో సహా ఈనాడు బయటపెట్టింది. దాంతో పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, టీడీపీ లోకల్ లీడర్స్ కంగుతిన్నారు, మన పత్రికలో మనకు వ్యతిరేకంగా కథనాలు రాయడమేంటని చర్చించుకున్నారు, ఈ కథనాలపై పార్టీలో కూడా చర్చ జరిగిందని, బాబుకు రామోజీకి ఎక్కడో గ్యాప్ వచ్చిందని గుసగుసలు వినిపించాయ

అయితే గతంలో చంద్రబాబుకి ఇప్పటి చంద్రబాబుకి ఎంతో తేడా వచ్చిందని, ఇప్పుడు బాబు కోటరీ పూర్తిగా మారిపోయిందని, పార్టీలో నారాయణ లాంటి కొత్తవారి పెత్తనం పెరగడంతో రామోజీ లాంటి పెద్దతలకాయ మాటకు కూడా విలువ లేకుండా పోతోందని చెప్పుకుంటున్నారు. ఓటుకు నోటు ఇష్యూ కూడా మరో కారణమని, పెద్దఎత్తున ఎమ్మెల్యేలను కొనేందుకు బాబు ప్రయత్నించడం, ఆ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడం కూడా ఇద్దరి మధ్యా గ్యాప్ పెంచిందని అంటున్నారు, కేసీఆర్ తో సత్సంబంధాలు నెరుపుతున్న రామోజీకి ఈ వ్యవహారం తలనొప్పులు తెచ్చిపెట్టిందంటున్నారు, అందుకే ఈ వ్యవహారంలో చంద్రబాబుకు రామోజీ చిన్న క్లాస్ కూడా పీకారని టాక్.

పైగా ఎప్పటికప్పుడు సొంత సర్వేలు చేయించుకునే రామోజీ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని గుర్తించారట,  భవిష్యత్ లో వచ్చేది జగనేనని, అలాంటప్పుడు అతనితో వైరం ఎందుకనే నిర్ణయానికి వచ్చారట, అందుకే జగన్ రామోజీ భేటీ జరిగిందని టాక్, అయితే రామోజీని బుజ్జగించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఒకవేళ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, బాబు-రామోజీ బంధం మాత్రం ఎప్పటికీ ఫెవికిక్ లాగా బలంగా ఉంటుందని, అది ఎన్నటికీ బీటలు మారే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి